ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌.. మిన‌హాయింపులు ఇవే..

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రోజూ వేల‌ల్లో పాజిటివ్ కేసులు వ‌స్తున్నాయి. అధికారిక లెక్క‌లే ఇన్ని ఉంటే.. ఇక అన‌ధికారికంగా అనేక మందికి కొవిడ్ బాధితులు మ‌న చుట్టూనే ఉంటున్నారు. ఎవ‌రికి క‌రోనా ఉందో ఓ ప‌ట్టాన తెలీడం లేదు. ల‌క్ష‌ణాలు లేకుండానే చాలామంది వైర‌స్ వాహ‌కాలుగా తిరుగుతున్నారు. ద‌గ్గు, జ‌లుబు లాంటి సింప్ట‌మ్స్ ఉన్నా.. ఏమ‌వుతుందిలే అని లైట్ తీసుకుంటూ రోటీన్‌గా గ‌డిపేస్తున్నారు. విచ్చ‌ల‌విడిగా ప‌క్క వారికి క‌రోనా అంటించేస్తున్నారు. అందుకే, ప్ర‌భుత్వం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఒక రోజంతా సంపూర్ణ లాక్‌డౌన్ పెట్టాల‌ని.. ఎవ‌రినీ బ‌య‌ట‌కి అనుమ‌తించ‌కూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేసింది. 

ఆదివారం త‌మిళ‌నాడు వ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి స్టాలిన్‌. ఒమైక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి అధికమవుతున్న నేపథ్యంలో ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్‌ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై.. సోమవారం ఉదయం 5 గంటల వరకు ఉంటుంది.

దుకాణాలన్నింటినీ మూసివేయాలని, అంబులెన్సులు, వైద్యులు ప్రయాణించే అత్యవసర వాహనాలు మినహా తక్కిన వాహనాలేవీ సంచరించకూడదని ఆదేశించారు. పొరుగు రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రైలు, బస్సు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా సెంట్రల్‌, ఎగ్మూరు రైల్వేస్టేషన్లలో కోయంబేడు బస్‌స్టేషన్‌, మదురై, కోయంబత్తూరు తదితర నగరాల్లోని రైల్వేస్టేషన్లు, బస్‌ స్టేషన్లలో ఆటోలు, టాక్సీలు నడిపేందుకు అనుమతించారు. అయితే ప్రయాణికులు టికెట్లు త‌ప్ప‌నిస‌రిగా చూపించాల‌ని నిబంధ‌న పెట్టారు. 

కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న కారణంగా త‌మిళ‌నాడు ప్రభుత్వం ఈ నెల 9, 16 తేదీల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించింది. ఈ ఆదివారం మ‌రోసారి కంప్లీట్ లాక్‌డౌన్ అమ‌లు చేయ‌నున్నారు. మిగతా రోజుల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ కొన‌సాగుతోంది. 

పాల దుకాణాలు ఏటీఎం కేంద్రాలు, ఆసుపత్రులు, సరుకు రవాణ, పెట్రోల్‌ బంక్‌లు అనుమతించింది ప్ర‌భుత్వం. రెస్టారెంట్‌లు, హోటళ్లు ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఫుడ్ డెలివరీ సౌకర్యాలతో పాటు టేక్ అవుట్ సేవలను అందిస్తాయని తెలిపింది. 

తమిళనాడులో గ‌డిచిన‌ 24 గంటల్లో 28,561 కొత్త కొవిడ్ కేసులు న‌మోద‌వ‌గా.. 39 మంది చ‌నిపోయారు.  ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 1,79,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి.