Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాక్రోచ్ జనతాపార్టీ జంతర్ మంతర్ ఉద్యమానికి మెచ్యూరిటీ లోపించిందన్న డోలేంద్రప్రసాద్!
posted on: Jun 20, 2026 4:34PM
.webp)
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న తాజా నిరసనలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డోలేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన ఈ ఉద్యమం తీరు, నిరసనలు తెలిపే క్రమంలో అనుసరించాల్సిన వ్యూహాలు, రాజకీయ పరిణామాలపై డోలేంద్ర ప్రసాద్‌తో సీనియర్ జర్నలిస్ట్ కె. రవిశంకర్ వాస్తవ వేదికలో విస్తృత చర్చ జరిపారు. ఆ సందర్భంగా డోలేంద్ర ప్రసాద్.. ఈ ఉద్యమంలో పాల్గొన్న యువతకు కనీస రాజకీయ పరిణతి లోపించిందన్నారు. జంతర్ మంతర్ వంటి చారిత్రాత్మక ధర్నా చౌక్‌లలో నిరసనలు తెలిపేటప్పుడు.. కేవలం నినాదాలకే పరిమితం కాకుండా, స్పష్టమైన ఉపన్యాసాల ద్వారా సమస్య తీవ్రతను వివరించాలనీ, కానీ కాక్రోచ్ జనతా పార్టీ నాయకులకు మైకులు ఉపయోగించి తమ డిమాండ్లను బలంగా వినిపించాలనే కనీస అవగాహన కూడా లేదని చెప్పారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ ఇలాంటి ధర్నాలు చేపడితే భారీగా మెన్ అండ్ మిషనరీని తరలిస్తుందని.. కానీ ఇది నిరుద్యోగులను కలుపుకోకుండా కేవలం స్టూడెంట్స్ కే పరిమితం కావడం వల్ల బలపడటం లేదని స్పష్టం చేశారు.
గతంలో కాంగ్రెస్ హయాంలో రామదేవ్ బాబా నిరసనలకు దిగినప్పుడు ప్రణబ్ ముఖర్జీ వంటి అగ్రనేతలు స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి రాయబారాలు నడిపిన దాఖలాలు ఉన్నాయని డోలేంద్ర ప్రసాద్ గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో వచ్చే ఇలాంటి పబ్లిక్ ఇష్యూలను హ్యాండిల్ చేయడంలో నాటి ప్రభుత్వాలకు భయం ఉండేదనీ.. కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దీన్ని వ్యూహాత్మకంగా డీల్ చేస్తూ నిప్పును చల్లార్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు.
రాజకీయ నాయకుల్లో ఎప్పుడూ ఒక రకమైన ప్రజా ఉద్యమాల భయం ఉంటుందని, అయితే ఈ నిరసనలకు సరైన నాయకత్వం లేకపోవడం పెద్ద మైనస్ అని తేల్చిచెప్పారు. ప్రజల్లో కోరిక ఉన్నప్పటికీ, సరైన లీడర్షిప్ లేని కారణంగానే ఉద్యమం పాలపొంగులా వచ్చి చల్లారిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రాంతీయ పార్టీల నేతలు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న తరుణంలో.. క్షేత్రస్థాయి ఉద్యమాలను సమర్థవంతంగా నడిపించగల నాయకత్వ బలం యువతకు ఎంతైనా అవసరమని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు.


.webp)


