అటు కాదు కిరణ్.. ఇటు!

 

 

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమైక్య చాంపియన్ హోదా తప్ప మరేమీ పట్టనట్టుంది. ప్రజల సమస్యల కంటే రేపు రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకి కూడా ముఖ్యమంత్రి పోస్టు వెలగబెట్టాలన్న ముచ్చట ఆయనలో కనిపిస్తోంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ చివరి సీఎంగా, ముక్కలై చిక్కిపోయిన చిన్న ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా అరుదైన ఘనతను సాధించడానికి ఆయన తంటాలు పడుతున్నట్టుంది.

 

ముఖ్యమంత్రి హోదాలో వున్న ఆయన సమైక్యం అని ఆయన కంఠ నాళాలు తెగిపోయేలా, అధిష్ఠానం కర్ణభేరులు పగిలిపోయేలా అరుస్తున్నప్పటికి పట్టించుకునేవారే లేకుండా పోయారు. సీఎం ఎంత కిందామీడా పడినా కేంద్రం లైట్‌గా తీసుకుని విభజనవైపు దూసుకుపోతోంది. అందుకే ఎలాగూ రాష్ట్రం ముక్కలయ్యేట్టుంది కాబట్టి సీమాంధ్రలో అయినా తన పట్టు నిలుపుకోవాలని కిరణ్ ప్రయత్నిస్తున్నారు. అందుకే తనను తాను సమైక్య చాంపియన్‌గా సీమాంధ్ర ప్రజల ముందు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేసిన ‘రచ్చబండ’ కార్యక్రమంలో నిమగ్నం కావాలని ప్రయత్నిస్తున్నారు.



ఆదివారం నుంచి ఆయన రాయలసీమ ప్రాంతంలో రచ్చబండ నిర్వహించనన్నారు. అయితే ఆయన ప్రస్తుతం వెళ్ళాల్సింది రాయలసీమకు కాదు.. హెలెన్ తుపాను ధాటికి కకావికలైపోయిన కోనసీమ, దివిసీమ ప్రాంతానికి! కోస్తాలోని ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడి ప్రజల కన్నీరు తుడిచే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కానీ, తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్న రచ్చబండకు వెళ్ళడం న్యాయమా? పోనీ కిరణ్ సార్ రచ్చబండకి వెళ్ళినా పెద్దగా ఒరిగేదేమీ లేదు. జనం రచ్చబండలో సమైక్య నినాదాలు చేస్తూ  రచ్చరచ్చ చేస్తున్నారు.  రాయలసీమలో రచ్చబండకి వెళ్ళి జనం చేత తిట్లు తినేబదులు, తుపాను బాధితులను పరామర్శించడానికి వెళ్ళి బాధితుల చేత నమస్కారాలు అందుకోవచ్చు కదా..! ముఖ్యమంత్రి గారికి మంచి ఆలోచనలు రావు.. ఎవరైనా చెప్పినా వినరు.. ఆయనతో ఇదే సమస్య!