జగన్ మూర్ఖ వైఖరితో ఏపీకి నష్టం! కేసీఆర్ సంచలనం..

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. గత రెండేండ్లు ఇద్దరు సఖ్యతగానే ఉంటూ వచ్చారు. జగన్ కు తనకు అత్యంత సన్నిహితుడని తెలంగాణ సీఎం కేసీఆర్ ఓపెన్ గానే చెప్పారు. కేసీఆర్ హీరో అంటూ ఏపీ అసెంబ్లీలోనే పొగిడారు జగన్నోహన్ రెడ్డి. అలాంటిది ప్రస్తుతం ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తోంది. ఏపీ సీఎం జగన్ తీరుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ సర్కార్ వ్యవహారంపై గులాబీ బాస్ గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. తాజాగా మంత్రివర్గ సమావేశంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో.. ఏపీతో యుద్ధానికి ఆయన సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. కేబినెట్ సమావేశంలో జగన్ ను ఉద్దేశించి కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని సమాచారం. 

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకతారం కేబినెట్ భేటీలో జగన్ పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. జగన్‌ మూర్ఖుడిలా వ్యవహరిస్తున్నారని ….మూర్ఖత్వంలో జగన్‌ తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డిని మించిపోయారని కేసీఆర్ అన్నట్టు సమాచారం . కృష్ణా బేసిన్‌లో ఏపీ సర్కారు అక్రమ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా కేసీఆర్ ఈ విధంగా విమర్శలు గుప్పించారట. నిబంధనలకు విరుద్ధంగా జగన్ సర్కార్ పలు అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని, ఒక రాష్ట్ర సీఎంగా జగన్‌కు చట్టాలపై ఏమాత్రం గౌరవం లేదని కేసీఆర్ అన్నట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వానికి అడ్డుకట్ట వేసి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని, ఇందుకోసం అవసరమైతే కోర్టులకు వెళదామని, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలందరితో ఢిల్లీలో ధర్నా చేయాలని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. జగన్ కు చెక్ పెట్టేందుకు తెలంగానలోనూ ఏడెనిమిది ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని కూడా కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది.

ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఏపీతో తాడోపేడో తేల్చుకుంటామని కూడా కేసీఆర్ చెప్పారట. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పోవాలని  కేబినెట్ అభిప్రాయపడింది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్ డిఎస్) కుడి కాల్వ నిర్మాణాలను తెలంగాణ కేబినెట్ తీవ్రంగా నిరసించింది. ఏపీ  ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించిందని, సుప్రీంకోర్టులో కేసులు వేసిందనీ నీటిపారుదల శాఖ  కేబినెట్ కు తెలిపింది. ఎన్ జీ టీ తో పాటు కేంద్రం కూడా ఆదేశించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాలను బేఖాతరు చేస్తుందని తెలంగాణ కేబినెట్ ఆరోపించింది. 

ఇప్పటివరకు ఏపీ సీఎం జగన్ మోనార్క్ అని ….ఎవరు చెప్పినా వినరని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ది తుగ్లక్ పాలన అని…ఆయన తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్ల, మూర్ఘపు చర్యల వల్ల ఏపీ అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కు వెళ్లిపోతోందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. విపక్షాలు కాబట్టి విమర్శించాయిలే అని వైసీపీ నేతలు సర్ది చెప్పుకుంటున్న తరుణంలో సీఎం జగన్ తో సన్నిహిత సంబంధాలున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేయడం ఆసక్తిగా మారింది. అంతేకాదు జగన్ తీరుతో ఏపీకి నష్టం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. జగన్ తీరుతో కృష్ణా నదిపై కేసీఆర్ కొత్త ప్రాజెక్టులకు ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే ఎగువ నుంచి శ్రీశైలానికి నీరు రావడం కష్టం. ఏపీకి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇవేమి ఆలోచించకుండానే.. సెంటిమెంట్ రెచ్చగొట్టి లబ్ది పొందాలనే ఉద్దేశ్యంతో జగన్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి కూడా వస్తోంది.