సీఎం కేసీఆర్ ఆడియా లీక్.. హుజురాబాద్ లో సంచలనం..

ఆరు నూరైనా హుజురాబాద్ గెలిచి తీరాల్సిందే. ఈట‌ల రాజేంద‌ర్‌ను అసెంబ్లీలో అడుగు పెట్ట‌కుండా చేయాల్సిందే. ఇదే సీఎం కేసీఆర్ సంక‌ల్పం. అందుకోసం ఎలాంటి చ‌ర్య‌ల‌కైనా సిద్ధ‌మంటున్నారు. ఈట‌ల‌ను ఓడించేందుకు.. ఏకంగా ద‌ళిత బంధు ప‌థ‌కాన్నే తీసుకొచ్చారు. హుజురాబాద్‌లో 45వేల‌కు పైగా ఉన్న ద‌ళిత ఓట‌ర్ల‌ను గంప‌గుత్త‌గా ఆక‌ర్షించేందుకు.. ఏకంగా 2వేల కోట్లు ఖ‌ర్చే చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. కుటుంబానికి 10 ల‌క్ష‌ల‌తో దిమ్మ‌తిరిగే ప‌థ‌కానికి శ్రీకారం చుట్టారు. కేవ‌లం ద‌ళితుల‌కేనా.. అదికూడా హుజురాబాద్‌కేనా.. మ‌రి, మిగ‌తా వారి ప‌రిస్థితి ఏంటంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. అవేవీ ప‌ట్టించుకునేలా లేరు సీఎం కేసీఆర్‌. ద‌ళిత బంధు ప‌థ‌కం ప్ర‌యోజ‌నాల‌ను తానే స్వ‌యంగా వివ‌రించేందుకు రంగంలోకి దిగారు. హుజురాబాద్ ద‌ళితుల‌ను ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు పిలుపించుకొని.. వారికి ప‌థ‌కం ల‌బ్ది గురించి వివ‌రించ‌నున్నారు కేసీఆర్‌. ఆ మేర‌కు ముఖ్య‌మంత్రి నేరుగా నేతలు, ప్రజలతో మాట్లాడుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనగుల ఎంపీటీసీ సభ్యురాలు నిరోష భర్త రామస్వామికి కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ఆడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

‘‘దళిత బంధు ప్రపంచంలోనే అతిపెద్ద పథకం. ఇలాంటి పథకం ఎక్కడా లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. హుజూరాబాద్‌లో ప్రతి గ్రామంలో ఈ పథకం గురించి వివరించాలి. దళిత జాతి చాలా గొప్పది. దేశానికి, ప్రపంచానికి గొప్ప సందేశం ఇచ్చే పథకం ఇది. దళిత బంధు విజయం దేశానికి, ప్రపంచానికి ఆదర్శవంతమవుతుంది. ఈ పథకాన్ని బాధ్యతతో విజయవంతం చేయాలి. హుజూరాబాద్‌లో ఈ పథకం విజయంపై ఎస్సీల భవిష్యత్‌ ఆధారపడి ఉంది. ఈ నెల 26న హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని వారు ప్రగతిభవన్‌కు రావాలి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు’’ అని ఫోన్‌లో వివరించారు కేసీఆర్‌. 

సీఎం కేసీఆర్‌ నుంచి స్వయంగా ఫోన్‌ రావడంతో రామస్వామి ఆనందం వ్యక్తం చేశారు. ఈనెల 26న హుజురాబాద్‌ నియోజకవర్గంలోని 412 మంది ఎస్సీలతో ప్రగతి భవన్‌లో దళితబంధు పథకంపై అవగాహన సదస్సు జ‌ర‌గ‌నుంది. అంత‌కుముందు 25న క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ద‌ళితుల‌తో స‌మావేశం నిర్వ‌హించి.. సీఎంతో జ‌ర‌గ‌బోయే సమీక్ష కార్య‌క్ర‌మంపై అవ‌గాహ‌న క‌ల్పించ‌నున్నారు.