తెలంగాణలో ముందస్తు ఎన్నికలు? కేసీఆర్ మాటల అర్ధం అదేనా..!

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? మొదటి టర్మ్ లాగే ఈసారి కూడా కేసీఆర్ సంచలనం చేయబోతున్నారా? ఈ చర్చే తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొన్ని రోజులుగా సాగుతోంది. సీఎం కేసీఆర్ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు, పార్టీ కమిటీలను గతంలో ఎప్పుడు లేనంత స్థాయిలో నియమించడం, నవంబర్ లో వరంగల్ లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేయడం ఇందుకు బలాన్నిచ్చాయి. అయితే ముందస్తు ఎన్నికల ప్రచారంపై పార్టీ సమావేశంలో క్లారిటీ ఇచ్చారు గులాబీ బాస్. 

ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు, వ్యూహాగానలకు ఒకే సారి తెరదించారు కేసీఆర్. ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన లేదని తేల్చి చెప్పారు.  తెరాస ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు. “ఈసారి మనం ముందస్తుకు వెళ్లడం లేదు. మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా రెండేళ్లు సమయం ఉంది. ఈ రెండేళ్లలో చేయవలసిన  అన్ని పనులు  చేసుకుని, సరైన సమయంలోనే ఎన్నికలకు పోదాం”  అని ముఖ్యమంత్రి తమ మనసులోని మాటను బయట పెట్టారు. వచ్చే ఎన్నికల్లో  మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా పనిచేయాలని పార్టీకి దిశానిర్దేశం చేశారు.

అయితే ఇది ముఖ్యమంత్రి మనసులోని మాటా, హుజూరాబాద్ ఉప ఎన్నికలను, పార్టీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను  దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా చేసిన ప్రకటనా అనే విషయంలో అనుమానాలు వస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను బట్టి నిర్ణయం మారినా మార వచ్చని పార్టీలో చర్చ మొదలైందని అంటున్నారు. హుజూరాబాద్’లో విజయం సాధిస్తే, ఆ షాక్ నుంచి విపక్షాలు తేరుకునే ముందే ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా ఆశ్చర్య పోనవసరం లేదనే వాదన ఒకటి పార్టీ వర్గాల్లో వినవస్తోంది. విపక్షాలకు ఎంత  ఎక్కువ సమయం ఇస్తే అంత ఎక్కువ మూల్యం చేల్లికోవలసి వస్తుందని, అంతర్గత వ్యూహబృందం ఆలోచనగా కూడా చెపుతున్నారు. అయితే హుజూరాబాద్ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, ఇతర పరిణామాలను బేరీజు వేసుకుని ముఖ్యమంత్రి నిర్ణయం ఉంటున్నది పార్టీ సీనియర్ నాయకుడు అన్నారు. అంతే కాకుండా హుజూరాబాద్ ఉప ఎన్నికను మించిన క్లిష్ట సమస్యలున్నాయని, ఆయన పేర్కొన్నారు. అయితే అవేమిటి అనేడి మాత్రం ఆయన బయట పెట్టలేదు. 

పార్టీ నాయకుల్లో విశ్వాసం పెంచేందుకు ముఖ్యమంత్రి హుజూరాబాద్ లో మనమే గెలుస్తున్నామని అన్నారు. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా వరంగల్ ప్రజాగర్జన సభ నిర్వహించాలని నిర్ణయం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రోజూ 20 నియోజకవర్గాలకు సన్నాహక సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు.ఒక విధంగా పార్టీ ద్విశతాబ్ధి ఉత్సవాల పురస్కరించుకుని, పార్టీకి కొత్త దశ దిశలతో పాటుగా కొత్త నాయకత్వాన్ని ముదుకు తీసుకురావడం కూడా ముఖ్యమంత్రి మదిలోని ఆలోచనగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అదలా ఉంటే పార్టీలో చోటు చేసుకుంటున్న పరినామాలను గమనిస్తే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నాపార్టీలో అంతా బాగుంది అనుకునే పరిస్థితిలో పార్టీ లేదు. పార్టీ  నాయకత్వం లేదు. అదే పార్టీ నాయకుల మాటల్లో ప్రతిధ్వనిస్తోంది. అందుకే తెరాసలో ఏదో జరుగుతోంది ... అనే మాట అంతటా బలంగా వినవస్తోంది.