సండే.. వాళ్లకు ఫైటింగ్ డే! గుంటూరులో చర్చి కమిటీల రచ్చ..

సండే హాలీడే.. చాలా మందికి జాలీ డే.. కాని ఆదివారం వస్తే చాలు ఆంధ్రప్రదేశ్ లో వివాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా  చర్చిలు గొడవలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతున్నాయి. సాధారణంగా సండే వస్తే క్రిస్టియన్లు చర్చీలకు వెళ్లి ప్రార్థనలు చేస్తుంటారు. అందుకే ఆదివారం అన్ని చర్చిలు హౌస్ పుల్ గా కనిపిస్తాయి. కాని ఏపీలోని గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం సండే వచ్చిందంటే చాలు చర్చి కమిటీలు ఘర్షణలకు దిగుతున్నాయి. ఇరు వర్గాల గొడవలతో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. 

గుంటూరు ఈస్ట్ పారిస్‌లో రెండు వర్గాల మధ్య గొడవ టెన్షన్ పుట్టించింది. బిషప్ ఏలియా, పరదేశి బాబు వర్గాలు గొడవకు దిగాయి. దీంతో పోలీసులు చర్చిల్లోకి ప్రవేశించారు.చర్చిలో పాత ఫాదర్ వర్సెస్‌ కొత్త ఫాదర్ మధ్య వివాదం పీక్‌కి వెళ్లింది. ఆదివారం ప్రార్థనల సమయంలో ఒక్కొక్కరుగా చర్చికి చేరుకుంటున్నారు. ఆ సమయంలో అగ్గిరాజుకుంది. రెండు వర్గాలుగా విడిపోయిన కొంతమంది దూషణలకు దిగారు. కొట్టుకున్నంత పనిచేశారు. గలాట చూసి ప్రార్థనల కోసం వచ్చినవాళ్లంతా అవాక్కయ్యారు. ఫాదర్‌లు మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోయారు.

చర్చిలో ఆధిపత్యపోరు, వాగ్వాదంపై సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. కానీ రెండు వర్గాలు మాత్రం ఎవరి మాట వినిపించుకోలేదు. తప్పంతా మీదేనంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు మోహరించారు. బిషప్ నియామకంలో విభేదాలే గొడవకు కారణంగా తెలుస్తోంది. ఏలియా, పరదేశీ వర్గాల మధ్య చాలా రోజులుగా ఈ వ్యవహారంపై వివాదం నడుస్తోంది. ఆదివారం.. పైగా ప్రార్థనలు జరిగే సమయంలో గొడవకు ఆజ్యం పోశారు కొంతమంది. గతంలో నార్త్, వెస్ట్ పారిస్ చర్చ్ ల్లోనూ రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. 

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం AELC లూథనర్‌ చర్చ్‌ కొత్త పాస్టర్‌ నియామకంలో వివాదం చెలరేగింది. చర్చ్‌ కమిటీ సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఆదివారం ఆరాధనను అడ్డుకునేందుకు ఓవర్గం ప్రయత్నించింది.. మరో వర్గం కొత్త పాస్టర్‌తో ఆరాధన చేయించేందుకు ప్రయత్నించింది. దీంతో చర్చ్‌లో రెండు వర్గాలు తోపులాటలు దిగాయి.ఇటీవల చర్చి పాత పాస్టర్‌ కుటుంబానికి కరోనా సోకింది. దీంతో ఫాదర్‌ భార్య మృతి చెందింది. ఫాదర్‌కు బ్లాక్‌ ఫంగస్‌కు సోకింది. దీంతో కొత్త పాస్టర్‌ను AELC కమిటీ నియమించింది. అయితే పాత పాస్టర్‌నే కొనసాగించాలని ఓ వర్గం పట్టుబడుతుంది. అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి కొత్త పాస్టర్‌ కొనసాగించాలని మరో వర్గం వాదిస్తోంది. 

Related Segment News