ఇవి చెక్ చేసుకుంటే జీవితం మారిపోతుంది

జీవితంలో మనిషికి టార్గెట్ లు ఎన్నో!! ప్రతి విషయంలోనూ ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు. కానీ చివరలో నిర్ణయం తీసుకునేటపుడు మాత్రం వెనకడుగు వేస్తారు. కారణం భయం. ఎందుకు అంటే ఫలితం ఎలా ఉంటుందో!! దానివల్ల సమస్యలు వస్తాయేమో!! ఆ నిర్ణయం వల్ల ఇప్పటికంటే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుందేమో!! ఇలాంటివే కారణాలు. 

ఇవన్నీ జీవితం పట్ల జాగ్రత్తల్లా అనిపిస్తాయి  కానీ జాగ్రత్తలు కాదు జీవితాన్ని ఎదగనీయకుండా పెట్టె ఇబ్బందులు. అతి భయాలు అనుకోవచ్చు.  కేవలం ఇవి మాత్రమే కారణాలా లేక ఇంకా ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అనే విషయం ఒక్కసారి ఎవరికి వారు ఆలోచించుకుంటే…..

తరువాత……

ప్రతి విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ముందు చాలా మంది, తరువాత ఏమవుతుందో…. అనే భయంతో ఆగిపోతారు. తరువాత ఏమయ్యేది లేనిది తెలిసేది ముందు నిర్ణయం తీసుకుని అడుగేస్తేనే కదా!! ఏమో అనుకున్నదానికంటే  ఇంకా పెద్ద ఫలితం సొంతమవచ్చేమో కదా!! భయంతో అరుదైన అవకాశాలు, జీవితంలో గొప్ప ప్రయత్నాలు వదిలేసుకోకూడదు కదా.

ఆత్మవిశ్వాసపు రేపరెపలు….

జీవితంలో ఎంతో గొప్ప మలుపు అవుతుంది. కానీ దానివైపు వెళ్లాలంటే భయం అంటూ ఉంటారు. నిజానికి మనం తీసుకునే నిర్ణయం వల్ల మనకు మంచి జరుగుతుందనే అవగాహన ఉంటేనే కదా ఏ విషయం గురించి అయినా ఆలోచిస్తాం. అలాంటప్పుడు అపనమ్మకాన్ని మనసులో పెట్టుకోవడం ఎందుకు??

అవగాహన….

ప్రతి విషయం గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరైనా సరే తీసుకునే నిర్ణయం వెనుక ఎంతో అవగాహన కలిగి ఉంటారన్నది నిజం. అసలు ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నాం. దాని వల్ల చేకూరే ప్రయోజనం ఏమిటి?? అది ఎంత అవసరం?? వంటి ప్రశ్నలు ఎవరికి వారు తప్పకుండా వేసుకోవడం ద్వారా ఓ అవగాహనకు రావచ్చు.

అవకాశంతో అందలం ఎక్కాలి

కొన్నిసార్లు కొన్ని అవకాశాలు ఒక్క సారి వస్తుంటాయి. మళ్ళీ మళ్ళీ రావడం బహుశా జరగకపోవచ్చు. కాబట్టి అవకాశం ముందున్నప్పుడు ధైర్యం చెయ్యాలి. 

ఇతరుల జోక్యం….

సాదారణంగా ప్రతి పని విషయంలో, ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవడం సలహాలు తీసుకోవడం చేస్తుంటారు. అప్పుడు అవతలి వాళ్ళ అనుభవాలు చెబుతారు. అంతేనా ఆ పనిని గూర్చి ఇంకా ఇంకా ఏవో చెప్పి దాని మీద భయం ఏర్పడేలా చేస్తారు. కాబట్టి ఇతరుల అభిప్రాయాలు కేవలం ఆ విషయం గురించి తెలుసుకోవడానికి మాత్రమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమో అవతలి వ్యక్తి ఆ పని పట్ల వంద శాతం పర్ఫెక్ట్ గా ఉన్నారో లేదో ఎవరికి తెలుసు. ఎప్పుడైనా చేసేపని పట్ల నమ్మకమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదే సగం విజయాన్ని చేకూరుస్తుంది అనే విషయం మరువకూడదు. 

మీరు ఒంటరి కాదు..

ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దాని పర్యావసానాల గురించి ఆలోచించేటపుడు నాకు ఒక కుటుంబం ఉంది, దాని సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది అని విషయాన్ని మరువకూడదు. అలాగే  తీసుకోబోయే నిర్ణయం గురించి కుటుంబ సభ్యులతో వివరంగా చెప్పాలి. దాని గురించి చర్చించాలి. ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారో వాళ్లకు అర్థమయ్యేలా చెబితే  తప్పకుండా మీకు సపోర్ట్ లభిస్తుంది.

ప్రణాళిక…

నిర్ణయం వెనుక ఒక ప్రణాళిక అవసరం. ఆ ప్రణాలికను అనుసరించి మెల్లిగా అడుగులు వేస్తూ చేయబోయే పనికి సంసిద్ధం కావాలి. దానివల్ల గందరగోళం ఉండదు. గమ్యం ఏమిటో స్పష్టం గా తెలుసు కాబట్టి భయం అక్కర్లేదు.

వాస్తవిక కోణం..

ఇది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ ప్రతి పనీ విషయంలో, నిర్ణయం తీసుకునే విషయంలో దీన్ని తప్పక అర్థం చేసుకోవాలి. మనం చేయగలిగింది పని పట్ల వంద శాతం కష్టపడటం, నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాల నుండి ఆలోచించడం. ఇలా అన్ని చేసిన తరువాత వేసే అడుగుకు, తీసుకునే నిర్ణయానికి వచ్చే ఫలితం ఏదైనా దాన్ని స్పోర్టివ్ గా రిసీవ్ చేసుకోగలగాలి. అప్పుడే మనిషిలో జీవితం పట్ల కూడా ఓ అవగాహన ఏర్పడుతుంది.

పైన చెప్పుకున్న అన్నిటినీ ఫాలో అయితే నిర్ణయాలు తీసుకోవడానికి భయపడటం, ఆ తరువాత ఏదో అయిపోయిందని బాధపడటం అసలు జరగదు సుమా!!

◆ వెంకటేష్ పువ్వాడ