Top Stories

రికార్డు స్థాయిలో బంగారం ధర.. తులం ఎంతంటే?

  బంగారం ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్. ఇక పసిడి కోనుగోలు చేయాలంటే సామాన్య ప్రజలకు మరింత కష్టతరం అవుతోంది. రోజురోజుకి గోల్డ్ రేటు అకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా బంగారం ధరకి మరోసారి రెక్కలు వచ్చాయి. 10 గ్రాముల బంగారం ధర పన్నులతో కలిసి అక్షరాల లక్ష రూపాయిలను తాకింది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సోమవారం ఉదయం రూ.98,350 ఉన్న24 క్యారెట్ల గోల్డ్ తులం రేటు సాయంత్రం 5.30 గంటల సమయానికి రూ.1,00,016కు చేరింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే దాదాపు రూ.2వేలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు 3,393 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా- చైనాల మధ్య వాణిజ్యం విషయంలో సయోధ్య కుదిరేంతవరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.  ఇక పెరిగిన పసిడి ధరను చూసి సామాన్యులు గుండెలు బాదుకుంటున్నారు. ఇప్పట్లో తాము పసిడి కొనుగోలు చేయడం ఇక కలే అని వాపోతున్నారు. శుభకార్యాల సీజన్ ముందుండటంతో అసలు ఏం చేయాలో పాలు పోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అమెరికా-చైనా సుంకాల యుద్ధం నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి వైపు చూస్తున్నారు. బలహీనపడుతున్న డాలర్, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం పెరుగుదలకు ప్రధాన కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,469గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,599గా నమోదైంది. విజయవాడలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,475గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,605గా నమోదైంది.దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,613గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,743గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,465 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 97,595గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,461గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,591గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 89,455గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 97,585గాను ఉంది.
రికార్డు స్థాయిలో బంగారం ధర.. తులం ఎంతంటే? Publish Date: Apr 21, 2025 6:20PM

బాలినేని చాణక్యం.. జనసేన గూటికి మానుగుంట?

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేసి జనసేన గూటికి చేరారు. ఆయన చేరిక అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ఆయన జనసేన చేరికను తెలుగుదేశం గట్టిగా వ్యతిరేకించింది. బాలినేని చేరిక సందర్కభంగా ఒంగోలులో పలు చోట్ల ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు ధ్వంసం చేశారు. ఇక అటు జనసేనలో కూడా అప్పట్లో ఆయన చేరిక పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది.  వైసీపీ అధినేత జగన్ కు బంధువు కావడం, ఆయన చేరికతో వైసీపీ నుంచి పలువురు ఆయన అనుచరులు కూడా వచ్చి చేరే అవకాశాలు ఉండటంతోనే అప్పట్లో బాలినేనిని తెలుగుదేశం, జన సేనలు వ్యతిరేకించాయి. అయితే.. పవన్ కల్యాణ్ మాత్రం బాలినేనిని మాత్రమే చేర్చుకుంటున్నట్లు క్లారిటీ ఇవ్వడమే కాకుండా బాలినేని కోరినట్ల ఒంగోలులో భారీ సభ ఏర్పాటు చేసి మందీ మార్బలంతో పార్టీ తీర్ధం పుచ్చుకోవాలని భావించిన బాలినేనికి చెక్ పెట్టారు. ఒంగోలులో కాదు.. ఒక్కరుగా మంగళగిరి వచ్చి పార్టీ కండువా కప్పుకోండని తేల్చి చెప్పారు. దాంతో బాలినేని అప్పట్లో ఒక్కడుగానే మంగళగిరి వెళ్లి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పటి నుంచీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలలో తన అనుచరులందరినీ జనసేన గూటికి చేర్చాలన్న ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆయన ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేశారు.  వైసీపీలో అసంతృప్త నేతలపై ఫోకస్ చేస్తున్న బాలినేని.. ఉమ్మడి ఒంగోలు జిల్లాలో  జనసేన బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.   వైసీపీలోని ఓ కీలక నేతతో  బాలినేని మంతనాలు సాగిస్తున్నారనీ, త్వరలో ఆ కీలక నేత జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయనీ అంటున్నారు.  గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతోపాటు పార్టీకి భవిష్యత్తు లేదన్న అంచనాతో కందుకూరు మాజీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారని గట్టిగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారవుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా వైదొలగుతుండటంతో పరిస్థితి మరింత దిగజారుతోందని అంటున్నారు. ప్రధానంగా వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలు.. అక్కడ తమ ప్రాబల్యం పెంచుకునేందుకు తమ అనుచరులను వైసీపీకి రాజీనామా చేసి రమ్మంటూ ప్రోత్సహిస్తున్నారు.  గతంలో వైసీపీలో కీలకంగా పనిచేసిన మాజీ మంత్రి బాలినేని ఈ కోవలో అందరికంటే ముందున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేనలో చేరినప్పుడే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీని ఖాళీ చేస్తానని ఆయన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఆ దిశగా అడుగులేస్తూ కందుకూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డిని జనసేనలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు.  ప్రకాశం జిల్లాకు చెందిన మహీధర్ రెడ్డి సీనియర్ నేత. 1989లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 2014 వరకు కాంగ్రెస్ లో కొనసాగారు. 2014లో వైసీపీలో చేరిన ఆయన కందుకూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019లో వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో పోటీకి దూరంగా ఉండిపోయారు. 2009 నుంచి 2014 వరకు రాష్ట్రమంత్రిగా పనిచేసిన మహీధర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి కూడా శాసనసభ్యుడిగా సేవలందించారు. తొలి నుంచి టీడీపీ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్న మహీధర్ రెడ్డి ఈ కారణంగా గత ఎన్నికల ముందు తెలుగుదేశం నుంచి ఆహ్వానం వచ్చినా వెళ్లలేదని చెబుతున్నారు. వైసీపీ టికెట్ నిరాకరించినా, అందుకే ఆ పార్టీని వీడకుండా కొనసాగుతున్నారు. అయితే పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న మహీధర్ రెడ్డి అధినేత జగన్ వైఖరి మారుతుందని ఇన్నాళ్లు వెయిట్ చేశారని అంటున్నారు.  కానీ  పార్టీ ఓడినా అధిష్టానం వైఖరి మారకపోవడంతో ఇప్పుడు ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తు న్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లాలో జనసేన కార్యకలాపాలు పుంజుకోవడం, భవిష్యత్తులో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తుందన్న అంచనాకు తోడు బాలినేని ప్రోత్సాహంతో  మహీధర్ రెడ్డి జనసేనపై మొగ్గుచూపుతున్నారని అంటున్నారు.  ఆయన చేరికకు  జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. వివాద రహితుడు, సీనియర్ నేత,  రాజకీయ కుటుంబ నేపథ్యం వల్ల మహీధర్ రెడ్డి చేరికను ఇతర భాగస్వామ్యపక్షాలు వ్యతిరేకించే పరిస్థితి లేదనీ,  త్వరలోనే మహీధర్ రెడ్డి జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
బాలినేని చాణక్యం.. జనసేన గూటికి మానుగుంట? Publish Date: Apr 21, 2025 5:34PM

తెలుగుదేశం మహానాడుకు తొలి ఆహ్వానం ఎవరికో తెలుసా?

ఆవిర్భావం నుంచి తెలుగుదేశం కార్యకర్తల పార్టీయే. ఎన్ని సంక్షోభాలు ఎదురైనా పార్టీకి అండగా కార్యకర్తలు నిలబడి పార్టీని నిలబెట్టుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం మాత్రమే. అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా తొలి నుంచీ కార్యకర్తల సంక్షుమానికే పెద్ద పీట వేస్తూ వస్తున్నది అనడంలో సందేహం లేదు.  పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ, విపక్షంలో ఉన్నప్పుడూ కూడా పార్టీ అధినాయకత్వం కార్యకర్తల పక్షానే నిలబడింది.  సాధారణంగా రాజకీయ పార్టీలు కార్యకర్తల గురించి ఆలోచించేదీ, మాట్లాడేదీ పార్టీ అధికారంలో లేని సమయంలో మాత్రమే. ఆ పద్ధతికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ భిన్నంగానే ఉంది.  పార్టీ మనుగడ, ఉనికికి కార్యకర్తలే ప్రధానమని భావిస్తూ వచ్చింది.   ఇందుకు తజా నిదర్శనం ఏమిటంటే.. తెలుగుదేశం పార్టీ కడప వేదికగా నిర్వహించనున్న పార్టీ పండుగ మహానాడుకు తొలి ఆహ్వానం పార్టీ కార్యకర్త కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించడమే. అది కూడా పార్టీ కోసం ప్రాణాలను త్యాగం చేసిన తోట చంద్రయ్య కుటుంబానికి మహానాడుకు తొలి ఆహ్వానం అంద జేయాలని నిర్ణయించింది. ఆ ఆహ్వానం కూడా  ఏ స్థానిక నేతతోనో పంపించడం కాకుండా.. మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా చంద్రయ్య ఇంటికి వెళ్లి అందజేయాలని నిర్ణయించుకున్నారు.   చంద్రయ్య ఎవరో కాదు. పార్టీలో సామాన్య కార్యకర్త. తన చివరి రక్తం బొట్టు వరకూ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. ఆ పార్టీ కోసమే పని చేశారు. జగన్ రాక్షస పాలన సాగుతున్న కాలంలో వైసీపీ గూండాల చేతిలో హతమయ్యారు. చంద్రయ్య తెలుగుదేశం జెండా మోయడమే వైసీపీ గూండాలు ఆయనను హత్య చేయడానికి కారణం.  పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలోని గుండ్లపాడు గ్రామానికి చెందిన తోట చంద్రయ్య 2022 జనవరి 13న స్థానిక వైసీపీ నేతలు అత్యంత పాశవికంగా గొంతు కోసి హత్య చేశారు. గొంతు కత్తిమీద పెట్టి జై జగన్, జై వైసీపీ అంటే వదిలేస్తామన్నా కూడా చంద్రయ్య నోటి వెంట జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్న నినాదమే వచ్చింది.దీంతో వైసీపీ   మూకలు ఆయనను అత్యంత పాశవికంగా హత్య చేశాయి. ఈ ఘటన అప్పట్లో పెను సంచలనమే సృష్టించింది. చంద్రబాబు స్వయంగా తోట చంద్రయ్య అంత్యక్రియలకు హాజరై, ఆయన పాడె మోశారు.   ఇప్పుడు కడపలో నిర్వహించనున్న మహానాడును వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో నిర్వహించనున్నది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ పండుగకు ఆహ్వాన పత్రికలు రెడీ అయ్యాయి. మొదటి ఆహ్వాన పత్రికను పార్టీ కోసం ప్రాణాలర్పించిన కార్యకర్త తోట చంద్రయ్య కుటుంబానికి ఇవ్వాలని తెలుగుదేశం నిర్ణయించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా గుండ్లపాడు గ్రామానికి వెళ్లి తన స్వహస్తాలతో తోట చంద్రయ్య కుటుంబాన్ని మహానాడుకు ఆహ్వానిస్తారు.  తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ప్రాణమనీ, అటువంటి కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడటం తన కర్తవ్యమనీ లోకేష్ ఎప్పుడూ చెబుతుంటారు. ఆ చెప్పడం మాటల వరకే పరిమితం కాదనీ, చేతలు కూడా అలాగే ఉంటాయనీ మరోసారి పార్టీ  కార్యకర్త కుటుంబానికి మహానాడు తొలి ఆహ్వానాన్ని అందించడం ద్వారా రుజువు చేస్తున్నారు నారా లోకేష్.  
తెలుగుదేశం మహానాడుకు తొలి ఆహ్వానం ఎవరికో తెలుసా? Publish Date: Apr 21, 2025 5:07PM

హైకోర్టు‌లో కేటీఆర్‌కు ఊరట.. రెండు కేసులను కొట్టివేసిన న్యాయస్థానం

  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీపై డ్రోన్ ఎగురవేసినందుకు కేటీఆర్‌తో పాటు మరికొంతమందిపై మహాదేవ్‌పూర్‌ పీఎస్‌లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. అనుమతి లేకుండా ప్రాజెక్టును సందర్శించడంతో పాటు డ్రోన్ ఎగురవేశారని ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్లు కింద మహాదేవ్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని కేటీఆర్ న్యాయవాది టీవీ రమణారావు అన్నారు. రాజకీయ కక్ష్యల కారణంగానే కేసు నమోదు చేశారని ఆయన కోర్టుకు తెలిపారు. డ్రోన్ ఎగురవేయడం డ్యాం భద్రతకే ప్రమాదమన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇరువైపులా వాదనలు ముగిసియి. మరోవైపు ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.  కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఆత్రం సుగుణ ఫిర్యాదు మేరకు 2024 సెప్టెంబర్‌లో ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతోందని ఉట్నూరులో జరిగిన ఒక సభలో మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేశారు. దేశంలో రాబోయే ఎన్నికల నిధుల కోసం మూసీ ప్రాజెక్టును రిజర్వ్ బ్యాంక్‌లా ఉపయోగించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్థాయిని తగ్గించేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసును హైకోర్టు తాజాగా కొట్టివేసింది.  
హైకోర్టు‌లో కేటీఆర్‌కు ఊరట.. రెండు కేసులను కొట్టివేసిన న్యాయస్థానం Publish Date: Apr 21, 2025 4:47PM

హైదరాబాద్‌లో మత్తు ఇంజెక్షన్ తీసుకున్న ఇంటర్ విద్యార్ధి మృతి

  హైదరాబాద్ బాలనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఇంటర్ విద్యార్ధి మృతి చెందాడు. ఇంజక్షన్‌తో పాటు టాబ్లెట్లను ఒకేసారి తీసుకోవడంతో డోస్ ఎక్కువైంది. ఈ క్రమంలో నాసర్ అనే విద్యార్థి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులు పరిస్థితి విషమంగా ఉంది. సదరు విద్యార్ధులకు మెడికల్ డ్రగ్స్ అమ్మిన సాహిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నరు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డ్రగ్స్, మత్తు పదార్థాల వాడకం, సరఫరాపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో కొందరు యువకులు మత్తు ఇంజెక్షన్‌లు, మరియు డ్రగ్స్ సొంతగా వినియోగించడమే కాకుండా ఇతరులకు అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగిస్తున్న, సరఫరా చేస్తున్న వారిలో ఎక్కువగా విద్యార్థులే ఉంటున్నారని ఇటీవల గణాంకాలు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఓ ఘటన ఇందుకు మరో ఉదాహరణగా నిలిచింది.సదరు వ్యక్తి మత్తు మాత్రలు, ఇంజెక్షన్ లను విక్రయిస్తున్నాడు? అతని వద్దకు మత్తు ఇంజెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎంత మందికి విక్రయిస్తున్నారు? అనే కోణాల్లో ను బాలాపూర్ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.   
హైదరాబాద్‌లో మత్తు ఇంజెక్షన్ తీసుకున్న ఇంటర్ విద్యార్ధి మృతి Publish Date: Apr 21, 2025 4:19PM

పూజా ఖేడ్కర్‌‌కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

  మాజీ ప్రొబెషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్‌  మే 2వ తేదీన ఢిల్లీ పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.  జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను మే 21వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ఖేద్కర్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అంతకు ముందు అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో నిజమైన ఎంక్వైరీ జరగలేదని  త్వరగా ఈ కేసు విచారణ ముగించాలని పోలీసులను ఆదేశించింది.  పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఖేద్కర్‌ను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని .. అయితే కోర్టు ఆమెకు మధ్యంతర రక్షణ కల్పించిందని అన్నారు. కోర్టు దాన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో యూపీఎస్సీ నమోదు చేసిన క్రిమినల్ కేసుపై తాజాగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అధికార దుర్వినియోగం,తప్పుడు ధ్రువపత్రాల సమర్పణ వ్యవహారంలో పూజా ఖేద్కర్‌ ,యూపీఎస్సీ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పేరు ఇటీవలా మీడియాలో వినిపించింది. ఆమెపై క్రిమినల్‌ కేసు నమోదైందైన సంగతి తెలిసిందే.  
పూజా ఖేడ్కర్‌‌కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు Publish Date: Apr 21, 2025 3:28PM

వల్లభనేని వంశీ బెయిలు పిటిషన్ విచారణ వాయిదా

విజయవాడ జిల్లా జైల్లో గత రెండు నెలలుగా రిమాండ్‌ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో మరో సారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను కోర్టు వారం రోజులకు వాయిదా వేసింది.  భూ ఆక్రమణ కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ వల్లభనేని  వంశీ దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ పై సోమవారం (ఏప్రిల్ 21) విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది.   గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడి 8.91 ఎకరాలను విక్రయించారని తేలబ్రోలుకు చెందిన ఎన్‌ శీధర్‌రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు   ఆత్కూరు పోలీసులు వంశీ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అదే కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.   ఈ కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ వంశీ హైకోర్టును ఆశ్రయించారు.   ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది  ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాలని కోరడంతో కోర్టు విచారణ వాయిదా వేసింది.   వల్లభనేని వంశీ ఇప్పటికే పలు కేసుల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు,  గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా ఉన్న సత్యవర్థన్‌ కిడ్నాప్‌ చేశారనే కేసు, భూ ఆక్రమణ కేసులో కూడా ఆయన  రిమాండ్‌ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. 
వల్లభనేని వంశీ బెయిలు పిటిషన్ విచారణ వాయిదా Publish Date: Apr 21, 2025 3:24PM

ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు చెల్లించిన చెన్నమనేని ఎందుకంటే?

తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ హైకోర్టులో రూ.25 లక్షల  డీడీ అందజేశారు. జర్మనీ పౌరసత్వం ఉండి చెన్నమనేని ఎమ్మెల్యేగా పోటీ చేశారు. గతంలో ఆది శ్రీనివాస్‌ తెలంగాణ హైకోర్టు లో పిటిషన్‌ దాఖలు చేశారు. జర్మనీ పౌరసత్వం కలిగి ఉండి తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేశారని.. ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశంపై కోర్టులో ఆది శ్రీనివాస్‌ సుదీర్ఘ కాలం పోరాడారు. పలు దఫాలుగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. చెన్నమనేని రమేశ్‌కు జర్మనీ పౌరసత్వం ఉన్నట్లు గతేడాది డిసెంబర్‌లో తేల్చింది. తప్పుదోవ పట్టించినందుకు ఆయనకు జరిమానా విధించింది. పిటిషనర్‌ ఆది శ్రీనివాస్‌కు రూ.25లక్షలు, న్యాయసేవాధికార సంస్థకు రూ.5లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పు మేరకు నేడు ఆ డబ్బును డీడీల రూపంలో చెన్నమనేని రమేశ్ అందజేశారు.
ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు చెల్లించిన చెన్నమనేని ఎందుకంటే? Publish Date: Apr 21, 2025 2:47PM

చంద్రబాబుకి ఊహించని ప్రత్యర్థుల బర్త్ డే విషెస్..

కేసీఆర్ నుంచి  కేశినేని నాని వరకు తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా ఊహించని ప్రత్యర్థులు విషెస్ చెప్పడం ఆసక్తి రేపుతోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ దగ్గర నుంచి ఏపీ మాజీ సీఎం జగన్ సహా పలువురు చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని వైసీపీ అధినేత జగన్ ఆకాంక్షించారు. అటు తెలంగాణ నుంచి మాజీ మంత్రి కేటీఆర్ సైతం చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతే కాదు.. చంద్రబాబు హయాంలో హైదరాబాద్ కి ఐటీ కంపెనీలు వచ్చాయని, హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్ర ఉందన్నారు. కేసీఆర్, షర్మిల కూడా సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలపడం విశేషం.  పార్టీ నేతలు, మిత్రపక్షాలు, అభిమానులు సరేసరి.. వైరి వర్గాలు కూడా ఈసారి చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలపడం ఆసక్తిగా మారింది. మాజీ సీఎం జగన్ తన తల్లి విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా ఈసారి సోషల్ మీడియా ద్వారా కూడా శుభాకాంక్షలు తెలపలేదు.  కన్నతల్లి పుట్టినరోజుని పట్టించుకోని జగన్, తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారని ఎవరూ అనుకోలేదు. కానీ అనూహ్యంగా ఆయన చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ వేశారు. ఆయన ప్రశాంతమైన, ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఆ మధ్య స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయితే కనీసం హైదరాబాద్ లో నిరసనలకు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. పక్క రాష్ట్రం వ్యవహారాలు ఇక్కడెందుకంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై అక్కసుని ప్రదర్శించారు. అయితే నేడు సీఎంగా ఉన్న చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ తన సహజ వైఖరికి భిన్నంగా స్పందించడం విశేషం. ట్విట్టర్లో విషెస్ చెబుతూనే.. పార్టీ మీటింగ్ లో చంద్రబాబు గొప్పదనాన్ని మెచ్చుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్ర ఉందన్నారు. హైదరాబాద్ కి ఐటీ కంపెనీలు చంద్రబాబు తీసుకొచ్చారని వివరించారు. అభివృద్ధి విషయంలో ఆయన  ఆనవాళ్లు, ముద్రను ఎవరూ చెరిపేయలేరని చెప్పుకొచ్చారు. అటు కేసీఆర్ కూడా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని, ఆయన పాలనలో ఏపీ ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు కేసీఆర్. ప్రధాని మోదీ నుంచి మొదలు పెడితే ఈ రోజు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఈ దఫా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలి పుట్టిన రోజు కావడంతో మిత్రపక్షాల నేతలంతా సామాజిక మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన వారంతా ఈ రోజు శుభాకాంక్షలు చెబుతూ ఆయనపై పొగడ్తల వర్షం కురిపించడం విశేషం.  ఇదంతా ఒక ఎత్తైతే విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని చంద్రబాబును కీర్తిస్తూ విషెస్ చెప్పడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఒకప్పుడు టీడీపీ తరఫున రెండు సార్లు విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలిచిన కేశినేని నాని పార్టీకి వీర విధేయుడిగా ఉండేవారు. కానీ సొంత పార్టీలో ప్రత్యర్దులను పెంచిపోషించుకుని, పార్టీలో ఇమడ లేక గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం వీడి వైసీపీలో చేరారు. అక్కడ ఎంపీ సీటు తెచ్చుకున్నా ఓడిపోయారు. దీంతో రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అయినా సోషల్ మీడియాలో నాని యాక్టివ్ గానే ఉంటున్నారు. ఇదే క్రమంలో  సీఎం చంద్రబాబును ఉద్దేశించి కేశినేని నాని ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో చంద్రబాబుకు వజ్రోత్సవ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో చంద్రబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. అసలే టీడీపీలోకి కేశినేని నాని రీఎంట్రీకి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సమయంలో చంద్రబాబుతో అనుబంధాన్ని నాని గుర్తుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.  సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఫేస్ బుక్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మైలురాయి ప్రజా జీవితంలో సుదీర్ఘ ప్రయాణాన్ని, దశాబ్దాల రాజకీయ నాయకత్వం, పాలన, ప్రజా సేవను సూచిస్తుందని నాని పేర్కొన్నారు. ఒక నిర్దిష్ట దశలో ఆ ప్రయాణంలో భాగం అయ్యే అవకాశం తనకు లభించిందన్నారు. ఆ అనుభవాన్ని తాను అంగీకరిస్తున్నట్లు కూడా నాని తెలిపారు. మీకు మంచి ఆరోగ్యం, నిరంతర బలం, ప్రజా జీవితంలో, సేవలో మరిన్ని చురుకైన సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్తూ కేశినేని నాని తన పోస్టును ముగించారు.  గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ అంతకు ముందు తాను కలిసి పనిచేసిన వ్యక్తులతో కేశినేని నాని తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారన్న ప్రచారం ఉంది. అదే క్రమంలో ఆయన్ను తిరిగి టీడీపీలోకి వచ్చేయాలంటూ ఆఫర్లు వస్తున్నాయంట. అయితే రాజకీయాల్లో రీఎంట్రీపై ఏ నిర్ణయం తీసుకోలేదంటూ కేశినేని నాని గతంలో పలు మార్లు చెప్పారు. 
చంద్రబాబుకి ఊహించని ప్రత్యర్థుల బర్త్ డే విషెస్.. Publish Date: Apr 21, 2025 2:44PM

పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత

కేథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వాటికన్ సిటీలో తన నివాసంలో సోమవారం (ఏప్రిల్ 21) ఉదయం కన్నుమూశారు. వాటికన్ కామెరెంగో కార్డినల్ కెవిన్ ఫెర్రెల్ ఈ విషయాన్నిధృవీకరించారు.  పోప్ ఫ్రాన్సిస్ వయస్సు 88 ఏళ్లు.   1936 డిసెంబర్ 17న  జన్మించిన ఆయన 2013 మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా నుంచి పోప్‌గా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు.  పోప్​ తన జీవితమంతా చర్చి సేవకే అంకితమయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. ఈస్టర్ సందర్భంగా ఆదివారం పోప్ ఫ్రాన్సిస్ రోజున సందేశం కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన  ఆరోగ్యం క్షీణించి మరణించారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల  ప్రపంచ వ్యాప్తంగా నాయకులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.  
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత Publish Date: Apr 21, 2025 2:27PM

స్వామీ ఏమి ఈ క్రిష్టియ‌న్ ప్రేమ‌! బేసిగ్గా హిందూ ద్వేష భావ‌జాల‌మా?

సుబ్ర‌హ్మ‌ణ్య స్వామికి  చంద్ర‌బాబు అంటే అంత ద్వేషం ఎందుకు? జ‌గ‌న్ అంటే వ‌ల్ల‌మాలిన‌ అభిమానం.. కార‌ణ‌మేంటి? అస‌లు స్వామికి  తిరుమ‌ల తిరుప‌తి అంటే అంత ఇంట్ర‌స్ట్ ఏంటి? సాటి సామాజిక వ‌ర్గ‌పు జ‌య‌ల‌లిత‌ను వ‌ద‌ల‌ని స్వామి క్రిష్టియ‌న్ అయిన జ‌గ‌న్ అంటే ప్ర‌త్యేక ప్రేమ క‌న‌బ‌రుస్తారెందుకు? 2021లో ప‌రువు న‌ష్టం దావా.. 2023లో శ్రీవాణి విష‌యంలో బాబు, ప‌వ‌న్ పై ఆరోప‌ణ‌లు.. 2024లో ల‌డ్డు నెయ్యి క‌ల్తీ వ్య‌వ‌హారంలో బాబు వ్యాఖ్య‌ల ఆధారంగా భ‌ద్ర‌త‌పై ప్ర‌శిస్తూ పిటిష‌న్.. 2025లో టీటీడీ చైర్మ‌న్ వ‌య‌సు మ‌ళ్లిన మ‌నుషుల‌కు మ‌ల్లే ఆవులు సైతం చనిపోతాయ‌న్న కామెంట్ల‌పైనా కేసు వేస్తాన‌న‌డం.. అదే జ‌గ‌న్ పాల‌న‌లో క‌నీసం ఒక్క మాట కూడా అన‌ని స్వామి- అంత‌ర్యం ఏమిటి? అని చూస్తే.. పై నాలుగు ఘ‌ట‌న‌ల్లో స్వామి డైరెక్టుగా కానీ.. ఇన్ డైరెక్టుగా కానీ సుబ్రహ్మణ్య స్వామి చంద్ర‌బాబును అటాక్ చేశార‌న‌డానికి మ‌న ద‌గ్గ‌రున్న ఆధారాలు. బీజేపీకి ప్రాతినిథ్యం వ‌హించే స్వామి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్.. త‌మ కూట‌మిలో భాగ‌స్వామ్యం అన్న క‌నీస  జ్ణానం కూడా లేకుండానే కామెంట్లు  ఎందుకు చేస్తుంటారో అర్ధం కాదు..  తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించ‌డం మాత్ర‌మే కాకుండా.. ఆపై కేసులు కూడా వేస్తుంటారు.    ఇదే స్వామికి క్రిష్టియ‌న్ జ‌గ‌న్ అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. అంతులేని ప్రేమతో కూడిన‌ వాత్సల్యాన్ని క‌న‌బ‌రుస్తుంటారు. అదేమంటే జ‌గ‌న్ హ‌యాంలో తాను తిరుమల తిరుపతి దేవస్ధానం ఆదాయ వ్య‌యాల‌పై కాగ్ ఆడిట్ చేయించాల‌ని కోర‌గా.. అందుకు ఆయ‌న‌ ఒప్పుకున్నారు. దీంతో స్వామి..  జ‌గ‌న్ ని ప‌ల్లెత్తు మాట కూడా అన‌ర‌ని చెబుతారు. కానీ ఇక్క‌డే స్వామిని అనుమానించాల్సి వ‌స్తోంది. ఇదే స్వామి ఇటు నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీల‌ను, అటు అక్ర‌మాస్తుల కేసులో జ‌య‌ల‌లిత వంటి వారిని కోర్టు కీడ్చారు. మ‌రీ ముఖ్యంగా  జ‌య త‌న ప‌ద‌వి వీడేలా చేసిన ఘ‌న‌త సుబ్ర‌హ్మ‌హ్మ‌ణ్య స్వామిది. సుబ్ర‌హ్మ‌ణ్య స్వామికి టీటీడీ అంటే ఎందుకంత ఆస‌క్తి అంటే తిరుపతి హైంద‌వ ఆధ్యాత్మిక బాంఢాగారం.. అక్క‌డ ఏ చిన్న త‌ప్పిదం జ‌రిగినా ఒక బాధ్య‌త కొద్దీ  తాను స్పందిస్తాన‌ని అంటారాయ‌న‌. స‌రిగ్గా అదే స‌మ‌యంలో సోనియా, జ‌య‌ల‌లిత వంటి వారి విష‌యంలో అవినీతి మ‌కిలిని తుద‌ముట్టించే వ‌ర‌కూ తాను నిద్రించేది లేద‌ని.. అంటారు. బేసిగ్గా తాను అంత‌టి నీతి మంతుడ్న‌ని తెలియ చేస్తుంటారు. ఇక్క‌డ మ‌రో విచిత్ర‌మైన విష‌య‌మేంటంటే చెన్నై మైలాపూర్ లో పుట్టిన స్వామి   బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. జ‌యల‌లిత‌ సైతం అదే సామాజిక వ‌ర్గానికి చెందిన వారే. అందుకే ఆమె తానెంత‌టి సీఎం స్థాయి వ్య‌క్తినైనా కుంభ‌కోణం వంటి  బ్రాహ్మ‌ణ ఆధిప‌త్యం గ‌ల నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ  చేస్తుంటారు. సాటి సామాజిక వర్గానికి చెందిన  జ‌య అంటే కూడా స్వామికి  ప‌డ‌దు. అదేమంటే ఆమె చుట్టూ పేరుకుపోయిన‌ అవినీతే అస‌లు కార‌ణం అంటారు. సాటి సామాజికవర్గానికి చెందిన జయలలిత ప‌ట్ల కూడా అంత‌టి విద్వేషం  క‌న‌బ‌ర‌చే స్వామికి జ‌గ‌న్ అవినీతి ఎందుకు క‌నిపించ‌దు? అన్న  ప్ర‌శ్న‌కు స‌మాధానం  వెత‌కాలి. జ‌గ‌న్ పై ఎంత‌టి అవినీతి ఆరోప‌ణ‌లున్నాయో అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టికీ ఆయ‌న బెయిలుపై తిరుగుతోన్న   అవినీతి కేసుల నిందితుడు. అలాంటి స్వామి క‌నీసం జ‌గ‌న్ మీద రాంగ్ కామెంట్లు కూడా చేయ‌రు. ఇదే జ‌గ‌న్ తాను క్రిష్టియ‌న్ కావ‌డ‌మే కాదు.. టీటీడీకి కూడా ఒక క్రిష్టియ‌న్ని చైర్మ‌న్ గా చేశారు.  అప్పుడు స్వామికి క‌నీసం నోరు పెగ‌ల‌దు. అంతే కాదు జ‌గ‌న్ ఎప్పుడైనా తిరుమ‌ల‌కు వెళ్తే ఒక క్రిష్టియ‌న్ గా డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌రు. అప్పుడు కూడా స్వామికి ఏదైనా కామెంట్ చేయాల‌న్న ఆలోచ‌న రాదు. జ‌గ‌న్ సాక్షాత్తూ శ్రీవారి ప‌విత్ర‌త‌ను మంట‌గ‌లుపుతూ.. ఇంటి ముందే ఆల‌యం సెట్ వేశారు. అప్పుడు కూడా  స్వామి నోరు మెదపలేదు. I am a devotee of Lord Venkateswara. Tirumala is not just a temple, it is a national treasure for Hindus,, అని చెప్పే సుబ్ర‌హ్మ‌ణ్య‌ స్వామికి శ్రీవారి భ‌క్తుల‌పైకి చిరుత పులుల‌ను వ‌దులుతుంటే ప‌ట్ట‌దు. ఇక వాటిని త‌ర‌మ‌డానికి చేతి క‌ర్ర‌ల‌ను ఇస్తుంటే చోద్యం చూస్తుంటారు. అదేమంటే శ్రీవాణి విష‌యంలో జ‌రిగే అవ‌క‌త‌వ‌క‌ల గురించి బాబు, ప‌వ‌న్ మాట్లాడితే మాత్రం విరుచుకుప‌డిపోతారు. క్రిష్టియ‌న్ జ‌గ‌న్ కి బ్రాహ్మిన్ స్వామికీ ఉన్న లింకేంటి? ఇరువురి మ‌ధ్య ఉన్న సంబంధ‌బాంధ‌వ్యాలేంటి?.. శ‌బ‌రిమ‌ల‌, రామ‌సేతు ప‌రిర‌క్ష‌ణ‌పై పిటిష‌న్లు వేసి హిందుత్వం అన్నా హైంద‌వ ఆచార వ్య‌వ‌హారాల‌కు కించిత్ భంగం క‌లిగినా.. కేసుల‌తో విజృంభించే స్వామికి.. తిరుమ‌ల ల‌డ్డూలో నెయ్యి క‌ల్తీ జ‌రిగితే గొడ‌వ‌కు దిగాల్సింది ఎవ‌రితో?  రివ‌ర్స్ లో ఈ విష‌యం వెలుగులోకి తెచ్చిన బాబునే త‌ప్పు ప‌డ‌తారు. ఇదెక్క‌డి విడ్డూరం??? అన్న‌ది శ్రీవారి భ‌క్తుల‌కు వ‌చ్చే అనుమానం.  టీటీడీ అంటే హిందూ ధార్మిక సంస్థ అయిన‌ప్పుడు అక్క‌డ 2వేల‌కు పైగా అన్య‌మ‌త‌స్తులు ఉద్యోగాలు చేస్తుంటే స్వామికి ఎందుకు ప‌ట్ట‌దు? ఇదే అంశంలో నాటి సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం తీవ్ర స్థాయిలో పోరాడి.. త‌న సీఎస్ వంటి కీల‌క ప‌ద‌విని సైతం కోల్పోయారు. హైంద‌వ ఆల‌యాల్లో అన్య‌మ‌త‌స్తుల‌కు తావు లేద‌న్న పాయింట్ మీద జ‌గ‌న్ తో బ‌రాబ‌ర్ ఫైట్ చేసి.. ప‌క్క‌కు త‌ప్పుకున్నారు. అంతే త‌ప్ప ఎంత‌కీ త‌ల వంచ‌లేదు. అలాంటి పేరే గ‌ల సుబ్ర‌హ్మ‌ణ్య స్వామికి జ‌గ‌న్ అన్నా, ఆయ‌న పాల‌న‌లో టీటీడీలో జ‌రిగిన గోల్ మాల్ వ్య‌వ‌హారాల‌న్నా ఎందుకు ప‌ట్ట‌ద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం రావాల్సి ఉంది. ఇదే టీటీడీ గోశాల‌లో స్వ‌దేశీ ఆవులనే ఎక్కువ‌గా పెంచి పోషించాలన్న నిబంధ‌న ఉంది. ఇక్క‌డా ఆ నిబంధ‌న‌ల‌కు తూట్లు పొడుస్తూ.. జ‌గ‌న్ హ‌యాంలో గో.. గోల్ మాల్ జ‌రిగితే.. స్వామికి క‌నీసం ప్ర‌శ్నించాల‌ని అనిపించ‌దు. ఇది ఎందుకో తేలాల్సి ఉంది.  జ‌గ‌న్ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి మ‌ధ్య ఏవైనా ఒప్పందాలున్నాయా? లేక మ‌రేదైనా  మ‌త‌ల‌బు దాగి ఉందా? ఆ స్వామివారే వెలికి తీయాలి..  త‌మ‌ కూట‌మి  ప్ర‌భుత్వ పాల‌న అన్న క‌నీస కన్సర్న్ లేకుండా స్వామి చేస్తున్న ఈ ఆధ్యాత్మిక విధ్వంసానికి అడ్డుక‌ట్ట ఎప్పుడో కూడా ఆ వెంక‌టేశ్వ‌రుడే చెప్పాల‌ని అంటున్నారు ప‌లువురు శ్రీవారి భ‌క్తులు.
 స్వామీ ఏమి ఈ క్రిష్టియ‌న్ ప్రేమ‌!  బేసిగ్గా హిందూ ద్వేష భావ‌జాల‌మా? Publish Date: Apr 21, 2025 2:08PM

హెలిప్యాడ్ లో కాకుండా సభా ప్రాంగణంలో చోపర్ ల్యాండింగ్.. మంత్రులకు తప్పిన ప్రమాదం

మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను పెను ప్రమాదం తప్పింది.  నిజామాబాద్ లో నిర్వహిస్తున్న రైతు మహోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు హెలికాప్టర్ లో ఈ ముగ్గురు మంత్రులూ వెళ్లారు. వారి హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి అధికారులు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో కాకుండా పైలట్ ఏకంగా సభా ప్రాంగణంలోనే హెలికాప్టర్ ను ల్యాండ్ చేయడం గందరగోళానికి దారి తీసింది. హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో రెక్కల నుంచి వచ్చిన గాలి కారణంగా భారీగా దుమ్ము రేగింది. అంతే కాకుండా ఆ గాలి ధాటికి సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు కూలిపోయాయి. పంట ఉత్పత్తులకు ఏర్పాటు చేసిన స్టాళ్లు కొన్ని ధ్వంసమయ్యాయి. జనం భయంతో పరుగులు తీశారు. అదృష్ట వశాత్తూ ఈ ఘటనలో మంత్రులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ఈ ఘటనలో బందోబస్తుకు వచ్చిన పోలీసులలో కొందరు స్వల్పంగా గాయపడ్డారు.  
హెలిప్యాడ్ లో కాకుండా సభా ప్రాంగణంలో చోపర్ ల్యాండింగ్.. మంత్రులకు తప్పిన ప్రమాదం Publish Date: Apr 21, 2025 1:36PM

రేవంత్ మౌనం పై కాంగ్రెస్ చార్జిషీట్?

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్‌ దాఖలు చేసింది. నిజానికి  ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో సోనియా, రాహుల్ గాంధీలతో పాటుగా, శ్యామ్ పిట్రోడా, ఆస్కార్ ఫెర్నాండెజ్ పేర్లు కూడా ఉన్నాయి. అయినా ఫోకస్ అంతా ఈ ఇద్దరిపైనే తప్ప మిగిలిన ఇద్దరినీ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. చివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సోనియా, రాహుల్ గాంధీ పై చార్జిషీట్ దాఖలు చేయడాన్ని, తప్పు పడుతున్నారే  తప్ప  మొత్తంగా చార్జిషీటే తప్పని ఆనడం లేదు.    ఇంతవరకు ఎవరిపైనా జరగని మహాపరాధం ఏదో  సోనియా, రాహుల్ విషయంలో  జరిగిపోయింద న్నట్లుగా మండిపడుతున్నారు. గుండెలు బాదుకుంటున్నారు. మిగిలిన ఇద్దరి గురించి, పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అందుకే..  విషయం తెలిసిన పెద్దలు ఇది  అందరికీ తెలిసిన  కాంగెస్ నేతల స్వామి భక్తికి, విధేయతకు చక్కని నిదర్శనం   అంటున్నారు.     అయితే..  దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలంతా వీధుల్లోకి వచ్చి పోటాపోటీగా ఆందోళనలు చేస్తున్నారు, బీజేపీ పై విరుచుకు పడుతున్నారు, అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం  ఇంతవరకు ఈ విషయంపై పెదవి విప్ప లేదు. ఒక్క ముక్క మాట్లాడ లేదు. ఈడీ చర్యను ఖండించలేదు. కనీసం, ఒక ప్రకటన అయినా చేయలేదు. ఓ వంక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొదలు, నిన్న మొన్నట్లో ఎమ్మెల్సీ అయిన అద్దంకి దయాకర్  వరకూ కాంగ్రెస్ నాయకులంతా   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలపై, అరేయ్ ..ఒరేయ్  స్థాయిలో మండి పడుతున్నారు. అయినా..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం చీమైనా కుట్టినట్లు లేదు. కనీసంలో కనీసం ఒక  ఖండన  ప్రకటన కూడా చేయలేదు. అసలు తనకు ఏమీ సంబంధం లేని అంశం అన్నట్లుగా.. ఆయన తన పనిలో తాను బిజీబిజీగా  ఉన్నారని అంటున్నారు. అయితే..  ప్రస్తుతం రేవంత్ రెడ్డి దేశంలో లేరు.   జపాన్ లో  పెట్టుబడుల వేటలో బిజీగా ఉన్నారు. అందుకే ఆయన స్పందించలేదని  కొందరు అనుకున్నా, ఎందుకో అది, అంతగా నమ్మబుల్  గా లేదని కాంగ్రెస్ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. అది నిజం కాదు.. కుంటి సాకు మాత్రమే అని  కాంగ్రెస్ పెద్దలే అంటున్నారు.  నిజానికి.. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారు, పదవులు ఆశిస్తున్నవారు ఇలాంటి సందర్భాలను  అగ్రనేతల పట్ల విధేయత చూపేందుకు ఒక అవకాశంగా తీసుకుంటారు. కప్పుడు శరద్ పవార్, తారిక్ అన్వర్, పీఏ సంగ్మా, సోనియా గాంధీ విదేశీ మూలాలను ప్రశ్నించిన సమయంలో  కొందరు వీర విధేయులు  ఏకంగా గాంధీ భవన్ లో అగ్గి పెట్టారు.  అంతవరకు ఎందుకు ఇదే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారిచినప్పుడు ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇప్పడు కూడా  దేశ వ్యాప్తంగా  కాంగ్రెస్ నాయకులు నిరసన పేరిట విధేయ ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. ఈడీ, మోదీలను జాయింట్ గా దుమ్మెత్తి పోస్తున్నారు. గాంధీ కుటుంబం త్యాగాలను ఏకరవు పెడుతూ కన్నీళ్లు కారుస్తున్నారు. అలాగే  భవిష్యత్ లో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన ఉదృతం చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే హెచ్చరించారు. ఎటొచ్చి రేవంత్ రెడ్డి   మాత్రమే సైలెంట్ గా ఉండి పోయారు.  అయితే.. ఇప్పడు అదంతా ఒకెత్తు అయితే, రేవంత్ రెడ్డి మౌనం, ప్రతి పక్షాలకు, ముఖ్యంగా బీఆర్ఎస్ కు మరో అస్త్రం అయిందని  అంటున్నారు. సహజంగానే  రేవంత్ రెడ్డి ఎక్కడ దొరికితే అక్కడ విమర్శించేందుకు సిద్ధంగా ఉండే  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్  ఇప్పటికే తొలి అస్త్రాన్ని సంధించారు.  మీడియా సమావేశంలో మాట్లాడుతూ  కేటీఆర్’  కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ,రాహుల్ గాంధీల పై ఈడీ చార్జిషీట్  దాఖలు చేయడానికి నిరసనగా  దేశంలోని కాంగ్రెస్‌ నేతలంతా ధర్నాలకు దిగుతూ బీజేపీని ఎండగడుతున్నారు. రాష్ట్రంలో కూడా పీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. కానీ ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్ల అగ్రనేతల మీద కేసులు పెట్టినా చడీ చప్పుడు లేదు. మోదీ, రేవంత్‌ దృఢమైన బంధమే ఇందుకు కారణం. ఆయనను ఈయన కాపడుతున్నారు..ఈయనను ఆయన కాపాడుతారు  అని  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అలాగే.. కాంగ్రెస్  సీనియర్ నాయకుడు ఒకరు  ఢిల్లీకి ‘కబురు  అందించారని అంటున్నారు.  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  శనివారం ( ఏప్రిల్ 19), చార్జిషీట్  ఫ్యూచర్ ఆక్షన్ పై చర్చించేందుకు ఢిల్లీలో ఏఐసీసీ కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జిలు, ఇతర ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన  సమావేశంలో రాష్ట్ర నాయకులు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను పూస గుచ్చినట్లు వివరిస్తూ.. రేవంత్ రెడ్డి అవిధేయ ధోరణికి సంబంధించిన అభియోగాలతో  ఆయనపై చార్జిషీట్ ని సమర్పించినట్లు చెపుతున్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పంది స్తుందనేది  వేచి చూడవలసి ఉంటుందని..  ముఖ్యంగా రేవంత్ రెడ్డి జపాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన స్పందన చూసిన తర్వాతనే అధిష్టానం తదుపరి నిర్ణయం ఉంటుందని అంటున్నారు.
రేవంత్ మౌనం పై  కాంగ్రెస్ చార్జిషీట్? Publish Date: Apr 21, 2025 10:17AM

శారదాపీఠానికి టీటీడీ నోటీసులు

తిరుమలలోని శారదా పీఠానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నోటీసులు జారీ చేశారు. గోగర్భం తీర్థం వద్ద శారదాపీఠం భవనాన్ని 15 రోజులలోగా ఖాళీ చేయాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శారదాపీఠం అక్రమంగా నిర్మాణాలను చేపట్టింది. దీనిపై అప్పట్లోనే హైందవ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలకు విరుద్ధంగా అటవీ భూమిలో కాలువను ఆక్రమించి 20 వేల చదరపుటడుగుల మేర శారదా పీఠం అక్రమ నిర్మాణాలను చేపట్టింది. దీనిపై హైందవ సంఘాలు కోర్టును ఇశ్రయించడంతో కోర్టు తీర్పు హైందవ సంఘాలకు అనుకూలంగా వచ్చింది. అప్పటికే  వైసీపీ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో హైందవ సంఘాలు శారద పీఠం అక్రమ నిర్మాణాల విషయాన్ని టీటీడీ ఈవో దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన తొలి పాలకమండలి సమావేశంలోనే చర్చించి, ఆ భవనాలను తొలగించాలని నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని శారదా పీఠం కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది దీనిపై శారదా పీఘం హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంది. .   తాజాగా టీటీడీ ఇచ్చిన షోకాజ్ నోటీసులులో ఎలాంటి తప్పు లేదని పేర్కొంటూ కోర్టు స్టే ఎత్తివేసింది.  టీటీడీ ఎస్టేట్ విభాగం విశాఖ శారదా పీఠం భవనాన్ని 15 రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది.  
శారదాపీఠానికి టీటీడీ నోటీసులు Publish Date: Apr 21, 2025 10:00AM

బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ తినే అలవాటు ఉందా.. ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

  నేటి బిజీ జీవితాలలో బ్రేక్ ఫాస్ట్ అంటే చాలా మంది ఆలోచలో పడిపోతారు.  ఉద్యోగాలకు వెళ్లేవారు పిల్లలను స్కూల్ కు పంపేవారు ఉదయాన్నే టిఫిన్,  మధ్యాహ్నానికి లంచ్ రెండూ తయారు చేయడం అంటే కాస్త కష్టమే.  పైగా తల్లి కూడా ఉద్యగస్తురాలు అయితే ఇక వంట చేయడం దగ్గర చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. చాలా మంది సులువైన పరిష్కారాల వైపు మొగ్గు చూపుతారు. అలాంటి వాటిలో బ్రెడ్ కూడా ఒకటి.  ఉదయాన్నే బ్రెడ్ కు కాస్త జామ్ రాస్ శాండ్విచ్ తయారు చేస్తే ఇంటిల్లిపాదీ ఈజీగా బ్రేక్పాస్ట్ చేసేయవచ్చు. అయితే ఇలా అల్పాహారంగా ప్రతి రోజూ బ్రెడ్ తీసుకోవడం ఎంతవరకు ఆరోగ్యానికి మంచిది అనే విషయం చాలామంది ఆలోచన చేయరు. దీని గురించి షాకింగ్ నిజాలు తెలుసుకుంటే.. బ్రెడ్‌లో ఉండే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు,  ప్రిజర్వేటివ్‌లు శరీర జీవక్రియను నెమ్మదిగా దెబ్బతీస్తాయి. క్రమం తప్పకుండా బ్రెడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.  శరీరంలో వాపు వంటి సమస్యలు కూడా వస్తాయి. కొంతమంది మద్యం తాగకపోయినా వారి శరీరంలో ఆల్కహాల్ ఏర్పడటం ప్రారంభమవుతుందట. ఇది వింతగా అనిపించవచ్చు, కానీ ఇది ఆటో-బ్రూవరీ సిండ్రోమ్ (ABS) లేదా గట్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్ అని పిలువబడే చాలా అరుదైన వైద్య పరిస్థితి. ఈ స్థితిల, ఒక వ్యక్తి కడుపు లేదా ప్రేగులలో ఉండే కొన్ని రకాల ఈస్ట్ (ఫంగస్) శరీరంలోకి తీసుకున్న కార్బోహైడ్రేట్‌లను  బ్రెడ్, బియ్యం లేదా స్వీట్లు వంటివి - కిణ్వ ప్రక్రియకు గురిచేసి ఆల్కహాల్‌గా మారుస్తాయి. ఫలితంగా ఒక వ్యక్తి మద్యం తాగకపోయినా, తలతిరగడం, అలసట,  గందరగోళం వంటి మత్తు లక్షణాలు ఏర్పడతాయి. ఈ సమస్యను సకాలంలో గుర్తించకపోతే అది క్రమంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతుందట. బ్రెడ్ వల్ల  సమస్య ఎందుకు? బ్రెడ్ తయారీలో ఉపయోగించే శుద్ధి చేసిన పిండి, ప్రిజర్వేటివ్స్,  అధిక సోడియం కంటెంట్ జీర్ణక్రియను బలహీనపరచడమే కాకుండా పేగు ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తాయి. బ్రెడ్ లో పోషకాలు లోపిస్తాయి, దీని కారణంగా శరీరానికి అవసరమైన పోషకాలు ఏమీ అందవు. ఎవరు తినకూడదు.. డయాబెటిస్, రక్తపోటు లేదా థైరాయిడ్ తో బాధపడేవారు ముఖ్యంగా బ్రెడ్ తినకుండా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారికి, ఇది క్రమంగా  'స్లో పాయిజన్' లాగా పనిచేస్తుంది. బ్రెడ్ బదులు ఏం తినవచ్చంటే.. రోజువారీ బ్రెడ్ కు బదులుగా మల్టీగ్రెయిన్ రోటీ, ఓట్స్ ఉప్మా, క్వినోవా, శనగపిండి చీలా లేదా దోశ  లేదా ఇంట్లో తయారుచేసిన ఫ్రూట్ స్మూతీ వంటివి ఎంచుకోవచ్చు. అవి పోషకమైనవి మాత్రమే కాదు, సులభంగా జీర్ణమవుతాయి,  రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ తినే అలవాటు ఉందా.. ఈ షాకింగ్ నిజాలు తెలుసా? Publish Date: Apr 21, 2025 9:30AM

మనిషికి ఉన్న అతిపెద్ద ఆయుధం ఇదే..!

  ఒక వ్యక్తి సానుకూలంగా ఉంటే, కష్టాలను అధిగమించడానికి ఎక్కువ సమయం పట్టదని చాణక్య నీతి చెబుతుంది. చాణక్యుడు డబ్బు గురించి తన అభిప్రాయాలను వివరంగా తన నీతి శాస్త్రంలో చెప్పాడు. నిజాయితీగా పనిచేసే వారికి తమ కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని, తమ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని ఆయన చెబుతారు. సంపద ఆనందాన్ని ఇచ్చినప్పటికీ, దానిని లాక్కుంటోంది. జీవితం ఎంత కష్టంగా అనిపించినా, సంపదకు మించిన ఒక ముఖ్యమైన  విషయాన్ని చాణక్యుడు  చెబుతాడు.  ఆ ముఖ్యమైన విషయం మనిషి జీవితంలో చాలా గొప్పదని,  మనిషి ఆ ఒక్క ఆయుధంతో జీవితంలో కావలసినది సాధించుకోగలడని చెబుతాడు. ఇంతకీ అదేంటో తెలుసుకుంటే.. జ్ఞానం కామధేనువు వంటిది.. చాణక్యుడి ప్రకారం జ్ఞానాన్ని సంపాదించడంలో ఎప్పుడూ వెనుకాడని వ్యక్తిని దుఃఖ మేఘాలు  తాకలేవు. జ్ఞాన శక్తితో వ్యక్తి విజయ శిఖరాన్ని చేరుకోగలడు. చాణక్యుడు ధనవంతుల కంటే జ్ఞానం, మేధావిగా ఉన్నవారిని గొప్పవారిగా నిర్వచించాడు. ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పటికీ, జ్ఞానం ఉన్న వ్యక్తిని ప్రతిచోటా గౌరవిస్తారు. జ్ఞానాన్ని సంపాదించడం అనేది కామధేనువు ఆవు లాంటిదని, అది మానవులకు అన్ని కాలాల్లోనూ అమృతాన్ని అందిస్తుందని, అందుకే జ్ఞానం ఎప్పుడు, ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ సంపాదించాలని చాణక్యుడు చెప్పాడు. జ్ఞానం ఎప్పుడూ వృధా కాదని అన్నాడు. అనుభవంతో పాటు జ్ఞానం ఉంటే విజయం సిద్ధిస్తుంది.. జ్ఞానం,  అనుభవం ఒకే నాణేనికి రెండు వైపులా ఉంటాయి. ఒక వ్యక్తికి జ్ఞానం ఉంటుంది కానీ అతను ఆ పరిస్థితిలో జీవించినప్పుడే అతనికి అనుభవం లభిస్తుంది. ఒక వ్యక్తి తాను నేర్చుకున్న విషయాలను ఆచరించడం కూడా చాలా ముఖ్యం. అప్పుడే ఒక వ్యక్తి మంచి,  చెడుల మధ్య తేడాను బాగా గుర్తించగలడు. మానవ జీవితంలో జ్ఞానం ఎంత ముఖ్యమో అనుభవం కూడా అంతే ముఖ్యం. చాణక్యుడి ప్రకారం  ఒక వ్యక్తి అతిపెద్ద లక్ష్యాలను కూడా సులభంగా సాధించగల గుణం జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అయితే  జ్ఞానం గురించి ఎప్పుడూ గర్వపడకూడదు. పంచుకున్నప్పుడు జ్ఞానం పెరుగుతుంది.  దీనితో వ్యక్తి ఉన్నత స్థానాన్ని పొందుతాడు.                                      *రూపశ్రీ.
మనిషికి ఉన్న అతిపెద్ద ఆయుధం ఇదే..! Publish Date: Apr 21, 2025 9:30AM

కర్నాటక మాజీ డీజీపీ దారుణంగా హత్య.. హంతకురాలెవరో తెలిస్తే షాకే!

కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(68) ఆదివానం (ఏప్రిల్ 20) దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరులోని తన నివాసంలోనే హత్యకు గురయ్యారు.  ఈ హత్య చేసినది ఆయన భార్యేనని పోలీసులు అనుమానిఃస్తున్నారు. ఆయన శరీరంపై పలు  కత్తి పోట్లు ఉన్నాయని తెలిపారు.  కుటుంబ కలహాల నేపథ్యంలో, ఆస్తి కోసమే మాజీ డీజీపీని ఆయన భార్య హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆయన భార్య పల్లవిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.  కర్ణాటక కేడర్‌కు చెందిన 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి   ఓంప్రకాశ్.. 2017లో పదవీ విరమణ చేశారు. , 2015లో డీజీపీగా విధులు నిర్వహించారు. ఓంప్రకాశ్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ఆ క్రమంలోనే భార్యతో తరచూ గొడవ పడుతున్నారనీ చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్య జరిగిందని చెబుతున్నారు.   ఇలా ఉండగా డీజీపీ హత్య తరువాత ఆయన భార్య పల్లవి మరో ఐపీఎస్ అధికారి భార్యకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫోన్ లో రక్తపు మడుగులో పడి ఉన్న భర్త మృతదేహాన్ని చూపించి.. ఓ రాక్షసుడిని చంపేశానని చెప్పిందని అంటున్నారు. 
కర్నాటక మాజీ డీజీపీ దారుణంగా హత్య.. హంతకురాలెవరో తెలిస్తే షాకే! Publish Date: Apr 21, 2025 7:31AM

నిలువెత్తు నిఘంటువు చంద్రబాబు.. కేంద్ర మంత్రి పెమ్మసాని

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్ర మంత్రి పెమ్మసాని నిలువెత్తు నిఘంటువుగా అభివర్ణించారు. . చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయన ప్రసంగాలతో కూడిన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం   ఏపీ అసెంబ్లీ హాల్ లో ఆదివారం (ఏప్రిల్ 20)జరిగింది. ఆ సందర్భంగా పెమ్మసాని ప్రసంగిస్తూ.. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్లేన ఎందరో తెలుగు విద్యార్థులకు చంద్రబాబు అండగా నిలిచారనీ, వారి ఫీజులు చెల్లించి ఆదుకున్నారనీ చెప్పారు. అయితే చంద్రబాబు చేసిన ఈ సహాయం గురించి ఒకరిద్దరు వినా మరెవరికీ తెలియదన్నారు.  చంద్రబాబు కేవలం రాజకీయ నాయకుడే కాదనీ, ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన మార్గదర్శి అన్న పెమ్మసాని, అమెరికాలో చదువుకోవాలనే ఆశతో వచ్చి, ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిస్తే చంద్రబాబు వెంటనే స్పందించేవారని తెలిపారు.ఆయన సేవా దృక్పథానికి, విద్యార్థుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనమని అన్నారు.  చంద్రబాబును 'నిలువెత్తు నిఘంటువు'గా అభివర్ణించిన పెమ్మసాని, ఆయన నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ముఖ్యంగా అమెరికాలో స్థిరపడే సమయంలో ఆ స్ఫూర్తి ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. అమరావతి వంటి బృహత్తర ప్రాజెక్టును చేపట్టాలనే సంకల్పం, శ్రమదానం, జన్మభూమి వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం వంటివి ఆయన దార్శనికతకు నిదర్శనాలని కొనియాడారు. అమరావతి  ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెడల్పు విషయంలో చంద్రబాబు దూరదృష్టిని పెమ్మసాని ప్రస్తావిస్తూ..  కేంద్రం 70 మీటర్ల వెడల్పుకు అనుమతిస్తే, భవిష్యత్ అవసరాల దృష్ట్యా దాన్ని 140 మీటర్లకు పెంచాలని చంద్రబాబు పట్టుబట్టారని, ఇందుకోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా  సీతారామన్ తో అర్ధరాత్రి ఒంటిగంటకు సమావేశమై చర్చించి, ఒప్పించారని గుర్తు చేశారు. ఆయన దార్శనికత, పట్టుదల తనను ఎంతగానో ప్రభావితం చేశాయని పెమ్మసాని చెప్పారు. 
నిలువెత్తు నిఘంటువు చంద్రబాబు.. కేంద్ర మంత్రి పెమ్మసాని Publish Date: Apr 21, 2025 7:04AM

చంద్రబాబుపై కేసీఆర్, కేటీఆర్ పొగడ్తలు.. తెలుగు తమ్ముళ్లలో జోష్!

 తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి 75వ జన్మదినం సందర్భంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.   చంద్రబాబు వల్లే తెలంగాణలో ఐటీ అభివృద్ధి చెందింది అని కొనియాడారు.తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు  తీసుకొచ్చిన హైటెక్ సిటీ సహా.. ఐటీ అభివృద్ధిని తాము కొనసాగించామని చెప్పారు.   ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గతంలో నటించిన సినిమాలో ‘చివరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా’అని ఓ డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అదినేత చంద్రబాబునాయుడిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లు ప్రశంసలు కురిపిస్తుంటే.. తెలుగు తమ్ముళ్లు ప్రత్యర్థే పొగడ్తల వర్షం కురిపిస్తే ఆ కిక్కే వేరప్పా అంటూ సంబరపడిపోతున్నారు.   తెలంగాణలో తమ రాజకీయ లబ్ధి కోసం తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడినీ విమర్శించి రాజకీలబ్ధి పొందింది బీఆర్ఎస్. తెలంగాణ సెంటిమెంట్ పండించడం కోసం అప్పుడూ, ఇప్పుడూ కూడా చంద్రబాబును తెలంగాణకు విలన్ గా చూపించేందుకు నానా తంటాలూ పడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2019 ఎన్నికలలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ అంటూ ఎగతాళి చేసిన కేసీఆర్, జగన్ హయాంలో అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేసిన సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. అలాంటి ఆ ఇద్దరూ  చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ అభినందనలతో ముంచెత్తారు. ఊరికే శుభాకాంక్షలు చెప్పి ఊరుకోకుండా చంద్రబాబును పొగడ్తలతో  ముంచెత్తారు.ఎన్నికలు ఎప్పుడొచ్చినా లేదా రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇదే చంద్రబాబును ఇదే కేసీఆర్, కేటీఆర్ ఇష్టారీతిగా విమర్శించారు. తెలంగాణ సెంటిమెంటును రగిల్చేందుకు చంద్రబాబును లేదా ఆంధ్రా పాలకులను కేసీఆర్, కేటీఆర్ ఎన్నేసి మాటలన్నారో అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి వారిద్దరూ ఇప్పుడు సీబీఎన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తుండటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేటీఆర్, కేసీఆర్ లను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. 
చంద్రబాబుపై కేసీఆర్, కేటీఆర్ పొగడ్తలు.. తెలుగు తమ్ముళ్లలో జోష్! Publish Date: Apr 21, 2025 6:48AM

గుజరాత్ లో మంత్రి నారాయణ బృందం రెండు రోజుల పర్యటన.. ఎలా సాగుతోందంటే?

ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా ఇతర రాష్ట్రాలలో  దేశంలోని ఇత‌ర రాష్ట్రాల్లో అధ్య‌యనం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే నారాయణ బృందం గుజరాత్ వెళ్లింది.  ఆదివారం (ఏప్రిల్ 20)) అహ్మదాబాద్ చేరుకున్న నారాయణ బృందం అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఏక్తానాగర్ చేరుకుంది.  అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహ నిర్మాణానికి ఉపయోగంచిన సాంకేతికత, పరికరాలు తదితర అంశాలను పరిశీలించింది.  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించ తలపెట్టిన భారీ విగ్రహాల కోసం మంత్రి నారాయణ బృందం పటేల్ విగ్రహాన్ని పరిశీలించింది. ఈ బృందంలో ఏడీసీ చైర్ పర్సన్ లక్ష్మీపార్థసారథి, గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు,  సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబు తదితరులు ఉన్నారు. ఈ బృందం ఇప్పటికే  ముంబ‌యి, ఢిల్లీలో ప‌ర్య‌టించిన సంగతి విదితమే. ఇప్పుడు గుజరాత్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ బృందం .ఏక్తాన‌గ‌ర్ లో ప్ర‌పంచంలోనే అతిపెద్ద‌దైన స‌ర్ధార్ వ‌ల్ల‌భాయి ప‌టేల్ విగ్ర‌హాన్ని ప‌రిశీలించారు.అనంతరం  స్థానిక అధికారుల‌తో పాటు ప‌టేల్ విగ్ర‌హ నిర్మాణ సంస్థ అయిన ఎల్ అండ్ టీ ప్ర‌తినిధులు మంత్రి నారాయణ బృందానికి పవ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా విగ్రహ నిర్మాణం చేసిన విధానం. అందుకోసం ఉపయోగించిన సాంకేతికత, సామగ్రి తదితర అంశాలను వివరించారు.  అమ‌రావ‌తిలో ఎన్టీఆర్ విగ్ర‌హం తో పాటు మ‌రికొంత‌మంది ప్ర‌ముఖుల భారీ విగ్ర‌హాలు ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఆ విగ్రహాల నిర్మాణం కోసమే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహన్ని పరిశీలించిన నారా యణ బృందం   దానికి అనుగుణంగా నిర్మించిన కట్టడాలనూ పరిశీలించింది. అనంతరం    అహ్మ‌దాబాద్ గాంధీన‌గ‌ర్ జిల్లాలో ఉన్న గిఫ్ట్( గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (గిఫ్ట్), సెంటర్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ (సెప్ట్ ) యూనివర్శిటీనీ సందర్శించింది.  అలాగే స‌బ‌ర్మ‌తి రివ‌ర్ ఫ్రంట్ ను కూడా మంత్రి నారాయణ బృందం సంద‌ర్శించింది.   స‌బ‌ర్మ‌తి న‌దీ తీర ప్రాంతం అభివృద్ది కోసం గుజ‌రాత్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా స‌బ‌ర్మ‌తి రివ‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ ను కూడా ఏర్పాటుచేసింది.  . అమ‌రావ‌తి కూడా కృష్ణా నది ఒడ్డున నిర్మిస్తుండ‌టంతో, స‌బ‌ర్మ‌తి రివ‌ర్ ఫ్రంట్ ను ఏవిధంగా అభివృద్ది చేసార‌నే దానిపై అధ్య‌య‌నం చేసింది మంత్రి నారాయణ బృందం. ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా సోమ‌వారం(ఏప్రిల్ 21)న మంత్రి నారాయణ బృందం  స్పోర్ట్స్ సిటీని సందర్శనలో భాగంగా  న‌రేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంను మంత్రి బృందం సంద‌ర్శించ‌నుంది. అమరావతిలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్ సిటీని నిర్మించనున్న సంగతి తెలిసిందే.
గుజరాత్ లో మంత్రి నారాయణ బృందం రెండు రోజుల  పర్యటన.. ఎలా సాగుతోందంటే? Publish Date: Apr 21, 2025 6:11AM

రేపటి నుంచి వైన్స్ బంద్ ఎందుకంటే?

  ఈ నెల 23న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని వైన్స్ షాపులు ఈ నెల 21 సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వైన్ షాపు అనుమతులు రద్దు చేస్తామని ఇప్పటికే హైదరాబాద్ సీపీతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. అలాగే ఎవరైనా పరిమితికి మించి స్టాక్ ఉంచి.. ఏదైనా ప్రదేశంలో విక్రయించినా నేరంగానే పరిగణిస్తామని పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.  హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ అసన్‌ ఎఫెండ్‌ను మజ్లిస్ పార్టీ ఖరారు చేసింది. బీజేపీ తరపున ఎన్ గౌతంరావు బరిలో ఉన్నారు ఇప్పటివరకు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ, ఎంఐఎంతో పాటు మరో రెండు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు దాఖలయ్యాయి. పోటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నిర్ణయించాయి. కాంగ్రెస్‌ మద్దతుతో ఎంఐఎం ఏకగ్రీవం అవుతుందనే సమయంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ నామినేషన్‌తో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ, ఎంఐఎం అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొననుంది. ఈ నెల 23న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.  25 తేదీన కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలు ప్రకటించనున్నారు.  
రేపటి నుంచి వైన్స్ బంద్ ఎందుకంటే? Publish Date: Apr 20, 2025 5:51PM

చంద్రబాబు శాసనసభ ప్రసంగాలపై పుస్తకావిష్కరణ

    సీఎం చంద్రబాబు చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా  అమరావతి అసెంబ్లీ కమిటీ హాల్‌లో రెండు పుస్తకాలను రఘురామకృష్ణరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఆవిష్కరించారు. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలకు సంబంధించి, రెండు పుస్తకాలను జయప్రద ఫౌండేషన్‌ ప్రచురించింది. పుస్తకాలను టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు టీడీ జనార్ధన్‌, సీనియర్‌ పాత్రికేయులు, రచయిత విక్రమ్‌ పూల రూపొందించారు. ‘స్వర్ణాంధ్రప్రదేశ్‌ సారథి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాలు’ పేరుతో రెండు సంపుటాలు ప్రచురించారు.   ఐటీ విప్లవం వచ్చిన వెంటనే తెలుగు జాతికి దాని ఫలాలు అందించాలని భావించిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని పుస్తక రూపకర్త టీడీ జనార్ధన్  అన్నారు. చంద్రబాబు ఆనాడు చేసిన కృషితో ప్రతి రైతు, ప్రతికూలీ, ప్రతి కార్మికుడి ఇంట్లో ఓ ఐటీ ఉద్యోగి వచ్చారని ఆయన తెలిపారు. హైదరాబాదును సంపద ఉపాధి కేంద్రంగా మార్చిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని కూడా అలాగే నిర్మించ తలపెట్టారని వ్యాఖ్యానించారు.  చంద్రబాబు నాయుడు లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో విద్యుతే లేదు అంధకారమే ఉండేదని అన్నారు. ఏదైనా కొత్త విషయాన్ని చిన్న కుర్రాడు చెప్పినా.. శ్రద్ధగా వింటూ టైమ్‌ మర్చిపోయి, నిత్య విద్యార్థిగా  ముఖ్యమంత్రి చంద్రబాబు నేర్చుకుంటారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు అన్నారు. ఆయన సమయపాలనతో ఒకరిద్దరికి ఇబ్బంది కలిగినా.. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్‌లో ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ఆయన ఆదర్శ రాజకీయవేత్త అని కొనియాడారు. . ఈ కార్యక్రమంలో  కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
 చంద్రబాబు  శాసనసభ ప్రసంగాలపై  పుస్తకావిష్కరణ Publish Date: Apr 20, 2025 5:01PM

సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా.. టీటీడీ అన్నప్రసాదానికి రూ.44 లక్షలు వితరణ

ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారి భక్తులకు అన్నప్రసాదం కోసం భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ రూ.44 లక్షల విరాళం అందించారు. దీంతో ఈ రోజు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి దాతతో కలిసి అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా వడ్డించారు. అన్న ప్రసాదాల రుచి, నాణ్యతపై నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్‌, కర్నూలుకు చెందిన కొందరు భక్తుల నుంచి బీఆర్‌ నాయుడు అభిప్రాయాలు తెలుసుకున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ప్రజలకు మరింత సేవ చేసే శక్తినివ్వాలని కోరుకుంటున్నాను" అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలిపారు. "ముఖ్యమంత్రి చంద్రబాబుకి 75వ జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు. చంద్రబాబుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు  శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం, ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్ళు సుఖశాంతులతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు దేవుడు వారికి మరింత శక్తినివ్వాలని కోరుకున్నారు.  
సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా.. టీటీడీ అన్నప్రసాదానికి రూ.44 లక్షలు వితరణ Publish Date: Apr 20, 2025 4:00PM

తెలంగాణ ప్రజలు తినే అన్నంలో మన్ను పోసుకున్నారు : కేటీఆర్

కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చేరిగారు. తెలంగాణ భవన్‌లో రాజేంద్ర నగర్ ఇంచార్జ్ ప‌టోళ్ల కార్తీక్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీలో అత్తాపూర్ డివిజన్ నుండి శ్రీరామ్ రెడ్డి, పలు పార్టీల నేతలు చేరారు. వారంద‌రికి కేటీఆర్ గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి మాట్లాడుతు కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలకు తెలంగాణ ప్రజలు టెంప్ట్ అయి ఆ పార్టీకి అవకాశం ఇచ్చారని.. ఫలితంగా తినే అన్నంలో మట్టిపోసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్,బీజేపీ పార్టీలు ఎన్ని కథలు చెప్పినా ఓటర్ హైదరాబాద్ ప్రజలు వారి మాటలను నమ్మలేదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని మంచి చేస్తే ఎవరైనా అభినందిస్తారని.. గతంలో వైఎస్సార్, చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనులను, వారిని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  ఔట‌ర్ లోప‌ల కాంగ్రెస్, బీజేపీ ఎత్తుగ‌డ‌ల‌కు ప్ర‌జ‌లు మోస‌పోలేదు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు ఇవ్వ‌లేదు. గోషామ‌హ‌ల్ కూడాపోయేది కాదు.. ఆగ‌మాగం వ‌ల్లే పోయింది. ప్ర‌జ‌లు ఎప్పుడైనా మంచి ప‌నుల‌ను ఆద‌రిస్తారు అని కేటీఆర్ అన్నారు. ఇవాళ చంద్ర‌బాబు జ‌న్మ‌న‌దినం.. హృద‌య‌పూర్వ‌కంగా శుభాకాంక్ష‌లు.  ఆయ‌న ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు. సంస్కార‌వంత‌మైన ప్ర‌భుత్వం గ‌త ప్ర‌భుత్వాల‌ను గౌర‌విస్తూ ప్ర‌వ‌ర్తిస్త‌ది అని కేటీఆర్ తెలిపారు.మేం ప‌దేండ్ల ఉన్నాం.. ఆన‌వాళ్లు చెరిపేస్తాం అన‌లేదు. అది అనాగ‌రిక చ‌ర్య‌. కాక‌తీయుల ఆన‌వాళ్ల‌ను కుతుబ్‌షాహీలు, అస‌ఫ్‌జాహీలు కూడా చెరిపేయ‌లేదు. కానీ రేవంత్ సర్కార్ కిరాత‌క ప‌నులు చేస్తుంది. మంచి ప‌నులు చేయ‌రు. చేసిన మంచి ప‌నుల‌ను ఆపుతారు. అభివృద్ధికి అంద‌రం స‌హ‌క‌రిస్తాం. కానీ16 నెల‌ల్లో విధ్వంసం జ‌రిగింది. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అన్నారు.. 500 రోజుల త‌ర్వాత కూడా ఏ ఒక్క హామీ అమ‌లు కాలేదు. ఒక్క‌టే ఒక్క‌టి ఫ్రీ బ‌స్సు అమ‌లు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని చిత్ర‌విచిత్రాలు ఆర్టీసీ ఉచిత బ‌స్సుల్లో చూస్తున్నాం అని కేటీఆర్ అన్నారు. తులం బంగారం కోసం ఆడ‌బిడ్డ‌లు ఆశ‌ప‌డ్డారు. రైతుబంధు రూ. 15 వేలు అని చెప్పేస‌రికి రైతులు కూడా ఆశ‌ప‌డ్డారు. రూ. 2 ల‌క్ష‌ల రుణాల వ‌ర‌కు మాపీ చేస్తామ‌ని చెప్పేస‌రికి ఆశ‌ప‌డ్డారు. రూ. 4 వేల పెన్ష‌న్ ఇంటికి ఇద్ద‌రికి ఇస్తామ‌ని చెప్పేస‌రికి ఆశ‌ప‌డ్డారు. తొలి ఏడాదిలోనే 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు నింపుతాన‌ని రాహుల్ గాంధీ అశోక్ న‌గ‌ర్‌లో ఫోజులు కొట్టి చెప్పేస‌రికి.. మ‌నం ఇచ్చిన 1 ల‌క్షా 60 వేల ఉద్యోగాలు మ‌రిచిపోయారు. పిల్ల‌లు కూడా కొంత టెంప్ట్ అయ్యారు. 420 వాగ్దానాలు చేసి మోసం చేశారు కాంగ్రెసోళ్లు. డిక్ల‌రేష‌న్ల పేరిట మోసం చేశారు. 
తెలంగాణ ప్రజలు తినే అన్నంలో మన్ను పోసుకున్నారు : కేటీఆర్ Publish Date: Apr 20, 2025 3:28PM

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా చంద్రబాబు బ‌ర్త్ డే సెలబ్రేషన్స్

  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు బ‌ర్త్ డే సెలబ్రేషన్స్  తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యాలయాల్లో  కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఆలయాల్లో నేతలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. 75 కిలోల కేక్‌ కట్‌ చేసి వేడుకలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్‌, వర్ల రామయ్య, అశోక్‌బాబు, వీవీవీ చౌదరి, నన్నపనేని రాజకుమారి, ఎ.వి.రమణ హాజరయ్యారు. విజనరీ లీడర్‌ చంద్రన్న పేరిట ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను నేతలు తిలకించారు. చంద్రబాబు జన్మదిన వేడుకలను తిరుమల అలిపిరి మార్గంలో పార్టీ కార్యకర్తలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా కొబ్బరికాయాలు కొట్టి పూజలు చేశారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో సీఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. వేడుకలకు ఏపీ మాజీ మంత్రి సోమిరెడ్డి, నందమూరి సుహాసిని, టీటీడీ బోర్డు సభ్యుడు నర్సిరెడ్డి, టీడీపీ నేత అరవింద్‌కుమార్‌ గౌడ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ అని.. ఆయన విజయాలకు పొంగిపోలేదని.. అపజయాలకు కుంకుంగిపోలేదని అన్నారు. అధికారం ప్రజలకు సేవ చేసేందుకేననని నమ్మిన నేత చంద్రబాబు అని,‘చంద్రబాబు P4’ కార్యక్రమం ప్రపంచానికి ఆదర్శం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. క్రమశిక్షణలో, అంకిత భావంలో, భవిష్యత్తు కార్యాచరణలో, సంక్షోభాలను సంక్షేమంగా మార్చడంలో దేశ నాయకులకే సీబీఎన్  ఆదర్శమని అన్నారు. సీబీఎన్ నాయుడు సారధ్యంలో నవ్యాంధ్ర దేశంలోనే అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నానని.. చంద్రబాబుకు భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని కోరుకున్నానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కార్యకర్తలు, నాయకులు, చంద్రబాబు అడుగుజాడల్లో నడవాలన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో నడిపిస్తున్న నేత చంద్రబాబు అని, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని, కార్యకర్తలను, నాయకులను కంటికి రెప్పలా కాపాడుతున్న నేత చంద్రబాబు అని పల్లా శ్రీనివాసరావు కొనియాడారు.  
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా చంద్రబాబు బ‌ర్త్ డే సెలబ్రేషన్స్ Publish Date: Apr 20, 2025 1:26PM

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేష‌న్

  నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీజీఆర్‌టీసీలో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను త్వ‌ర‌లోనే భ‌ర్తీ చేస్తామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వెల్ల‌డించారు. అతి త్వ‌ర‌లోనే 3,038 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేస్తామ‌న్నారు. వీటిలో డ్రైవర్-2,000, శ్రామిక్స్-743, డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్)-114, డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్)-84, డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్-25, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్)-23, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్-15, సెక్షన్ ఆఫీసర్ (సివిల్)-11, మెడికల్ ఆఫీసర్ (జనరల్)-07, మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్)-07, అకౌంట్స్ ఆఫీసర్-06 పోస్టులు ఉన్నాయ‌ని మంత్రి పొన్నం పేర్కొన్నారు  తెలంగాణలో కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిలిచిపోయాయి. ఇకనుంచి మాత్రం నోటిఫికేషన్లు ఒక్కొక్కటిగా రిలీజ్ కానున్నాయి. ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో.. జాబ్​ క్యాలెండర్​ను ప్రభుత్వం రీషెడ్యూల్​ చేయాలని నిర్ణయించింది. దీంతో గ్రూప్​ 1,2,3,4 పోస్టులతోపాటు.. పోలీస్, గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డుల నుంచి నోటిఫికేషన్‌లు వెలువడనున్నాయి.  
నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ Publish Date: Apr 20, 2025 12:58PM

డ్రగ్స్‌ నిర్శూలనకు చేయిచేయి కలుపుదాం : చిరంజీవి

  డ్రగ్స్‌ రహిత తెలంగాణ కోసం చేయిచేయి కలుపుదామని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాద్ టీవర్క్స్‌ వద్ద నోటి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మెగాస్టార్ వర్చువల్‌ సందేశం పంపారు. డ్రగ్స్‌ రహిత తెలంగాణ కోసం చేయిచేయి కలుపుదామన్నారు. వ్యసనాలకు బానిసలై కొందరు తమ కలలను దూరం చేసుకుంటున్నారని చెప్పారు. మాదకద్రవ్యాల కట్టడిపై తెలంగాణ ప్రభుత్వంతో పాటు అందరం అవగాహన కల్పించాలని కోరారు.  డ్రగ్స్‌ను నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహితంగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రేడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పబ్‌లు, క్లబ్బుల్లో స్నిఫర్ డాగ్స్‌తో నార్కొటిక్ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. విద్యాసంస్థల్లోనూ డ్రగ్స్‌ను అరికట్టేందుకు వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రహారీ క్లబ్‌ల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.  
డ్రగ్స్‌ నిర్శూలనకు చేయిచేయి కలుపుదాం : చిరంజీవి Publish Date: Apr 20, 2025 12:30PM

నాన్నగారికి జ‌న్మ‌దిన‌ శుభాకాంక్షలు.. చంద్రబాబుకు లోకేశ్ బ‌ర్త్‌డే విషెస్‌

ఏపీ సీఎం చంద్రబాబు వజ్రోత్సవ 75వ పుట్టిన రోజు సందర్బంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.  ఇప్ప‌టికే సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు సీబీఎన్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. తాజాగా చంద్రబాబునాయుడికి ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "నాన్నగారికి శుభాకాంక్షలు. నా స్ఫూర్తి నారా చంద్ర‌బాబు నాయుడు గారూ. వెరీ హ్యాపీ బ‌ర్త్ డే" అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఓ ఆస‌క్తిక‌ర వీడియోను కూడా జోడించారు. మరోవైపు సీఎం చంద్రబాబునాయుడికి ఆయన సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  ‘పుట్టినరోజు శుభాకాంక్షలండీ’ అంటూ ఎక్స్ వేదికగా ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు.‘‘మన ఆంధ్రప్రదేశ్ కుటుంబం పట్ల మీకున్న అంతులేని మక్కువతో మీరు నా ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నారు. మీ బలం, మీ దార్శనికత నన్ను ప్రతిరోజూ మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతున్నాయి. మీకు తోడుగా ఉండటం చాలా గర్వంగా ఉంది. నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. నా ప్రేమతో మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటాను’’ అని భువనేశ్వరి రాసుకొచ్చారు. కాగా, చంద్రబాబు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని పలు రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  
నాన్నగారికి జ‌న్మ‌దిన‌ శుభాకాంక్షలు.. చంద్రబాబుకు లోకేశ్ బ‌ర్త్‌డే విషెస్‌ Publish Date: Apr 20, 2025 12:03PM