ఢిల్లీలో చంద్రబాబు... వైసీపీలో గుబులు! నిఘా కోసం ప్రత్యేక బృందాలు...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ అరాచక పాలన సాగిస్తోందని ఆరోపిస్తున్న తెలుగు దేశం పార్టీ దేశ రాజధానిలో పోరాటం చేయబోతోంది. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, నిరంకుశ పాలనపై కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేయబోతోంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఆ పార్టీ బృందం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో పాటు కేంద్రం పెద్దలను కలవబోతోంది. తెలుగు దేశం పార్టీ నేతలు  ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చారు.  సోమవారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు భారత రాష్ట్రపతితో చంద్రబాబు ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల టీడీపీ బృందం కలవబోతోంది.

రాష్ట్రప‌తిని క‌ల‌వ‌నున్న చంద్రబాబు.. ఏపీలో నెల‌కొన్న ప‌రిస్థితులు, వైసీపీ అమ‌లు చేస్తున్న అరాచ‌క పాల‌న‌, టీడీపీ కార్యాల‌యాల‌పై దాడులు, ఇష్టారాజ్యంగా టీడీపీ నేత‌ల‌ను అరెస్ట్ చేస్తున్న తీరు.. త‌దిత‌రాల‌ను రామ్ నాథ్ కోవింద్‌కు వివ‌రించ‌నున్నారు. అంతేకాకుండా ఆయా ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి చంద్ర‌బాబు ఆధారాల‌ను కూడా అందించ‌నున్నారు. అరాచ‌క పాల‌న నుంచి ఏపీ ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు త‌క్ష‌ణ‌మే రాష్ట్రంలో రాష్ట్రప‌తి పాల‌న‌ను అమ‌లు చేయాల‌ని కూడా చంద్ర‌బాబు కోర‌నున్నారు.ఏపీలో మాదకద్రవ్యాలు , వైసీపీ దాడులపై ఫిర్యాదు చేయనుంది.  

రెండున్నర సంవత్సరాల తరువాత చంద్రబాబు హస్తినకు వెళుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రితో పాటు మరికొందరిని కూడా కలిసే అవకాశం ఉంది. రెండు రోజులపాటు  చంద్రబాబు బృందం ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు విధ్వంసంపై ఢిల్లీలో నేతలకు బృందం సభ్యులు వివరించనున్నారు. టీడీపీ నేతలపై దాడులు, పార్టీ కార్యాలయాల విధ్వంసం, అక్రమ కేసులు వంటి అంశాలను  టీడీపీ బృందం కేంద్ర పెద్ద దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఏపీలో ఆర్టికల్ 356 ప్రయోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.

సాధార‌ణంగా ఓ పార్టీ అధినేత హ‌స్తిన ప‌ర్య‌ట‌న‌కు వెళుతుంటే.. ఇత‌ర పార్టీలు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తూ ఉంటాయి. ఢిల్లీ వెళ్లిన నేత ఎవ‌రెవ‌రిని క‌లుస్తున్నారు? ఏమేం చేస్తున్నారు? అన్న విష‌యాల‌పై వివ‌రాలు సేక‌రిస్తూ ఉంటాయి. విప‌క్షంలో ఉన్న పార్టీ నేత‌లు ఇలా ఢిల్లీకి వెళితే.. అధికారంలోని పార్టీలు అంత‌గా ప‌ట్టించుకోవు. అయితే ఏపీలో ప‌రిస్థితి అలా లేద‌నే చెప్పాలి. విప‌క్ష నేత‌గా ఉన్న చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారంటేనే.. వైసీపీలో ఇప్ప‌టికే పెను అల‌జ‌డి రేగింది. చంద్ర‌బాబుకు జాతీయ స్థాయిలో మంచి పలుకుబడి ఉండటమే వాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. ఏపీలో పరిస్థితులు కూడా గందరగోళంగా ఉండటంతో ఎక్కడ తమకు ఎసరు వస్తుందోనన్న ఆందోళన జగన్ రెడ్డిలో కనిపిస్తుందని తెలుస్తోంది. ఢిల్లీ పర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు ఎక్క‌డ బీజేపీ నేత‌ల‌ను క‌లుస్తారో, ఎక్క‌డ టీడీపీ, బీజేపీల మ‌ధ్య కొత్త పొత్తు పొడుస్తుందోన‌న్న భ‌యం వైసీపీలో నెల‌కొంది. 

ఇలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే.. తాను సైలెంట్‌గా ఉంటే కుద‌ర‌దు క‌దా అనుకుందో, ఏమో తెలియ‌దు గానీ.. వైసీపీ అప్పుడే రంగంలోకి దిగిపోయింది. చంద్ర‌బాబు ఎవ‌రెవ‌రి అపాయింట్‌మెంట్లు కోరుతున్నార‌న్న విష‌యాన్ని ప‌సిగ‌డుతూ ఆయా నేత‌ల కార్యాల‌యాల‌కు త‌న పార్టీ ఎంపీల‌ను పంపుతూ చంద్ర‌బాబుకు ఆయా నేత‌ల‌ అపాయింట్ మెంట్లు ద‌క్క‌కుండా వ్యూహాన్ని అమ‌లు చేస్తోంద‌ట‌. ఇందుకు సంబంధించి వైసీపీ కీల‌క నేత‌ల‌తో పాటు ఇటీవ‌లే ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారుగా నియ‌మితులైన ఓ కీల‌క రిటైర్డ్ ఐఏఎస్ సేవ‌ల‌ను కూడా జ‌గ‌న్ స‌ర్కారు వినియోగిస్తోంద‌ట‌. చంద్రబాబు ఏం చేస్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారు.. వాళ్ల నుంచి ఆయనకు ఎలాంటి స్పందన వస్తుందన్న వివరాలను కూడా సేకరించేందుకు ప్రత్యేక బృందాలను వైసీపీ రంగంలోకి దింపిందని అంటున్నారు. 

ఏపీ సీఎం జ‌గ‌న్ తీరును నిర‌సిస్తూ టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్ ఆవేశ‌పూరిత వ్యాఖ్య‌లు చేయ‌డం, వాటికి బ‌దులుగా వైసీపీ శ్రేణులు టీడీపీ కేంద్ర కార్యాల‌యంతో పాటుగా ప‌లు జిల్లాల్లోని ఆ పార్టీ కార్యాల‌యాల‌పైనా, కీల‌క నేత‌ల‌పైనా దాడుల‌కు తెగ‌బ‌డ‌టం తెలిసిందే. ఈ దాడుల‌ను నిరసిస్తూ టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు 36 గంట‌ల దీక్ష‌కు దిగితే.. ఆ దీక్ష‌కు వ్య‌తిరేకంగా వైసీపీ జ‌నాగ్ర‌హ దీక్ష‌ల‌కు తెర తీయ‌డం.. టీడీపీ నేత‌ల‌పై వైసీపీ నేత‌లు ప‌రుష ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ‌టం, వైసీపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌ల ఎదురు దాడి.. వెర‌సి ఏపీలో ఈ వారమంతా ఉద్రిత్త‌తో కూడిన ప‌రిస్థితులే నెల‌కొన్నాయి. ఏపీలో జ‌గ‌న్ పాల‌న మొద‌ల‌య్యాక అరాచ‌కం రాజ్య‌మేలుతోంద‌ని, మంగ‌ళ‌వారం నాటి దాడులు, ఆ త‌ర్వాతి ప‌రిణామాలే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని చంద్రబాబు విమ‌ర్శించారు.  ఏపీలో రాష్ట్రప‌తి పాల‌న అమ‌లు చేయాల‌ని కూడా ఆయ‌న డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో చంద్ర‌బాబు ఢిల్లీకి వెళ్లారు.