తెలంగాణలో చంద్రబాబుకు పాలాభిషేకం...కేసీఆర్ జీ చూస్తున్నారా...!

 

ఒకటిగా ఉన్న రాష్ట్రం విడిపోయింది. ఏపీ, తెలంగాణ అంటూ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాయి. ఇక ఎవరి రాజకీయాలు వారివి.. ఒకరి రాష్ట్రంలో మరొకరు వేలు పెట్టే అవకాశం లేదు. నిజం చెప్పాలంటే అసలు రాజకీయాల కోసమే ఒకటిగా ఉన్న రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది ఇప్పుడు తెలంగాణలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. అదేంటంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి తెలంగాణలో అభిషేకం చేశారు. విచిత్రంగా ఉంది కదా.. నమ్మడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా.... ఇది నిజమే. అసలు తెలంగాణలో చంద్రబాబు ఫొటోకి ఎందుకు పాలాభిషేకం చేశారో.. ఎవరు పాలాభిషేకం చేశారో తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.

 

చంద్రబాబు ఏపీలో డీఎస్సీ నోటిఫికేష‌న్ రిలీజ్ చేశారు.  కేవ‌లం 13 జిల్లాల‌కు క‌లుపుకుని ఏకంగా 12370 ఉపాధ్యాయ పోస్టుల‌ను భ‌ర్తీ చేయనున్నారు. అంటే ఏపీలోని 13 జిల్లాల‌కు చూస్తే ఒక్కో జిల్లాకు స‌గ‌టున 1000 వ‌ర‌కు ఉపాధ్యాయ పోస్టులు భ‌ర్తీ కానున్నాయి. చంద్ర‌బాబు ఇక్క‌డ సీఎం అయ్యాక ఇది రెండో డీఎస్సీ నోటిఫికేష‌న్ కావ‌డం విశేషం. దీనికి కాను.. మహబూబ్‌నగర్‌లో డీఎస్సీ నిరుద్యోగులు చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. దీనికి కారణం లేకపోలేదు. నిజానికి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో వేలాది ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పార‌ని ఎప్పుడో చెప్పారు. కానీ దానికి సంబంధించిన చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. దీంతో ఇప్పుడు ఇక్క‌డ రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతోంద‌ని అక్క‌డ నిరుద్యోగులు ఆవేద‌న‌తో ఉన్నారు. పొరుగు తెలుగు రాష్ట్రంలో రెండో నోటిఫికేష‌న్ వ‌చ్చినా ఇక్క‌డ తొలి నోటిఫికేష‌నే పూర్తి కాలేద‌న్న అసంతృప్తి తెలంగాణ నిరుద్యోగుల్లో ఎక్కువైంది. ఇక త‌మ‌కు ఉద్యోగాలు క‌ల్పించ‌కుండా టీఎస్‌పీఎస్సీకి మాత్రం మూడు రెట్లు జీతాలు పెంచార‌టూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యార్థుల ఉద్యమాలతో గద్దెపై కూర్చున్న దొంగలు ఇప్పటికైనా మారాలని తెలంగాణ విద్యార్థులు డిమాండ్ చేశారు. దీనికి భారీ ఎత్తున స్పంద‌న రావ‌డం చూస్తుంటే తెలంగాణ విద్యార్థుల్లో నిరుద్యోగ స‌మ‌స్య‌పై తీవ్ర అసంతృప్తి ఉంద‌ని తెలుస్తోంది.

 

మరి కేసీఆర్ గారు ఇప్పటికైనా పరిస్థితిని గమనించుకోకపోతే ముందు ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే... ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడుతుంది. రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలానికే.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు అండగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులే ఆయనకు వ్యతిరేకం అయ్యారు. ఇప్పుడు అదే ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన.. కోదండరామ్ కూడా కేసీఆర్ కు వ్యతిరేకం అయ్యారు. ఇప్పుడు నిరుద్యోగులు కూడా వ్యతిరేకం అయ్యారు. అంతేకాదు ఒక మెట్టు ఎక్కి ఏకంగా చంద్రబాబు ఫొటోకే పాలాభిషేకం చేసి కేసీఆర్ కు షాకిచ్చారు. కేసీఆర్ గారు ఇప్పటికైనా కళ్లు తెరిస్తే మంచిది మరీ. ఏమైనా చంద్రబాబుకు పొరుగురాష్ట్రంలో పాలాభిషేకం అంటే గొప్ప విషయమే..