అసలయిన విభజనవాది ఎవరు?

 

జగన్మోహన్ రెడ్డి తనను తాను సమైక్య ఛాంపియన్ గా ఆవిష్కరించుకొనే ప్రయత్నంలో రాష్ట్ర విభజనపై చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ, తనతో ఎవరూ కూడా కలిసి రావడం లేదంటూ ఆవేదన పడిపోతుంటారు. తనొక్కడే మిగిలిన వారందరి కంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చాలా ఎక్కువగా కష్టపడుతున్నట్లు పదేపదే గట్టిగా చెప్పుకొంటారు. పనిలోపనిగా తనకు ప్రధాన పోటీదారులయిన చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలను ప్రజల ముందు దోషులని సర్టిఫై చేయడం కూడా మరిచిపోరు.

 

కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను ఎంత తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నపటికీ, ఆయన ఆ ప్రక్రియకు ఎక్కడా అడ్డుతగలకుండా పరోక్షంగా సహకరిస్తున్నందున ఆయనను అనుమానించక తప్పదు.

 

అయితే చంద్రబాబు నోట ఇంతవరకు సమైక్యాంధ్ర రాలేదనే జగన్ ఆరోపణ కేవలం ఆయనను సీమాంధ్ర ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకే. రాష్ట్ర విభజనకు తెదేపా అంగీకరించిన మాట వాస్తవం. అయితే చంద్రబాబు వ్యక్తిగతంగా, మానసికంగా కూడా రాష్ట్ర విభజనకు వ్యతిరేఖమనే సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ రెండు ప్రాంతాలలో పార్టీని బ్రతికించుకోవాలనే తపనతోనే ఆయన ఇంతవరకు జై తెలంగాణా! అనిగానీ, జై సమైక్యాంధ్ర! అనిగానీ అనలేకపోతున్నారని ప్రజలందరికీ తెలుసు. ఆ కారణంగానే తెదేపా తెలంగాణాలో తీవ్రంగా నష్టపోతున్నదని చంద్రబాబుకి తెలిసి ఉన్నపటికీ, ఎటూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు.

 

కానీ, తెలంగాణాలో రాత్రికి రాత్రి దుకాణం బంద్ చేసుకోచ్చేసిన జగన్మోహన్ రెడ్డికి ఈ సమస్య లేదు గనుక ఒట్టొట్టి సమైక్యరాగామాలపిస్తూ చంద్రబాబుని కూడా తనతో కోరస్ పాడమని బలవంతం చేస్తూ, ఆయన పాడట్లేదు గనుక ఆయన సీమాంధ్ర ద్రోహి అని ప్రచారం చేసుకొని, తనొక్కడే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డిని తెలంగాణా ప్రజలు ఇంతకంటే ఎక్కువగానే అసహ్యించుకొంటున్న సంగతి ఆయనకి కూడా తెలిసే ఉంటుంది.

 

రాష్ట్ర విభజనకు మానసికంగా వ్యతిరేఖిస్తున్నపటికీ, దానివల్ల తన పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తెలిసి ఉన్నపటికీ తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు విభజనకు అంగీకరిస్తే, రాష్ట్ర విభజన జరిగితేనే తనకు రాజకీయ లబ్ది కలుగుతుందని మనసులో తీయని కలలు కంటూ, పైకి మాత్రం జగన్ సమైక్యరాగం ఆలపిస్తున్నారు. నిజానికి నేతి బీరకాయలో నెయ్యి వంటిది జగన్ సమైక్యవాదం. అందువల్ల అసలయిన విభజనవాది ఎవరో ప్రజలే తేల్చి చెప్పాలి.       

 

మడమ తిప్పని వంశమని, విస్వసనీయత తమ ఇంటి పేరని, నీతి నిజాయితీలు తన లోటస్ పాండ్లో విరబూసే కలువలని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఆ మాటలు పలికేందుకు కూడా ఇబ్బందిపడుతున్నారు. తనను నమ్ముకొన్న తెలంగాణా నేతలకి హ్యాండిచ్చేసి ఇప్పుడు సమైక్య ముసుగులో రాష్ట్ర విభజన కోరుకొంటున్న జగన్మోహన్ రెడ్డి కంటే రాష్ట్ర విభజనను అయిష్టంగా అంగీకరిస్తున్న చంద్రబాబే మేలు కదా!