రేవంత్ కేబినెట్ లోకి విజయశాంతి?

తెలుగు సినీ పరిశ్రమలో లేడీ అమితాబ్ గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి, తెలంగాణ రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు పొందారు. అటువంటి విజయశాంతికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలను పార్టీ అధిష్ఠానం నిర్ణయం దిగ్భ్రమకు గురి చేసిందనడంలో సందేహం లేదు. సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన విజయశాంతి ఆ ఎన్నికలలో కానీ, ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కానీ విజయశాంతి రాష్ట్ర కాంగ్రెస్ తరఫున పెద్దగా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. సరే ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఆమెకు కాంగ్రెస్ హై కమాండ్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంలోనూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రమేయం లేదు. అసలు రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచి ఆమె పేరును ఎవరూ సిఫారసు కూడా చేయలేదు. ఆమె గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన సందర్భంలో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ ఠాక్రే అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ దక్కిందన్న చర్చ కాంగ్రెస్ వర్గాలలో జోరుగా సాగుతోంది. సరే మొత్తం మీద రాష్ట్ర కాంగ్రెస్ నేతల సిఫారసు లేకుండా, అసలిక్కడి నేతలతో సంబంధం లేకుండా విజయశాంతి పేరును నేరుగా అధిష్ఠానమే ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కాంగ్రెస్ లో ఓ కొత్త చర్చకు తెరలేచింది. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత జరగనున్న రేవంత్ కేబినెట్ విస్తరణలో విజయశాంతికి బెర్త్ కన్ఫర్మ్ అంటూ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఇందుకు కారణంగా వారు.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు దీటుగా బదులిచ్చే నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ లో    చాలా తక్కువగా ఉన్నారనీ, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ వినా కేటీఆర్, హరీష్ ల విమర్శలకు దీటుగా బదులిస్తున్న దాఖలాలు లేవనీ అంటున్నారు. ఈ పరిస్థితుల్లో త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పొలిటికల్ గా యాక్టివ్ అవుతారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కేబినెట్ లో విజయశాంతి వంటి ఫైర్ బ్రాండ్ లీడర్ అవసరమని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నదని చెబుతున్నారు.  
రేవంత్ కేబినెట్ లోకి విజయశాంతి? Publish Date: Mar 10, 2025 5:39PM

మేమే పోటీ చేస్తాం.. మీరు తప్పుకోండి!

వారసులను పక్కన పెట్టే యోచనలో వైసీపీ సీనియర్లు.. వైసీపీలోని కొందరు సీనియర్లు తమ మనస్సు మార్చుకుంటున్నారట. గడచిన ఎన్నికల్లో తమకు ఈ రాజకీయాలు వద్దు.. తమ వారసులకు టిక్కెట్లివ్వండని ఆ పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చి మరీ తమ వారసులకు అసెంబ్లీ టిక్కెట్లు ఇప్పించుకున్నారు. గత ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నారాయణ స్వామి, పేర్ని నాని వంటి వారు తమ వారసులకు టిక్కెట్లు ఇప్పించుకున్నారు. ఇలా వారసులకు టిక్కెట్లు ఇప్పించుకున్న వారిలో కొందరు తిరిగి తామే పోటీ చేయడానికి సిద్దమవుతున్నట్టు సమాచారం. గడచిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలవడంతో పాటు.. వారసులెవరూ తాము అనుకున్న విధంగా రాణించ లేకపోతున్నారు. దీంతో మళ్లీ రంగంలోకి దిగాలని రాజకీయాలకు దూరం అని గతంలో చెప్పుకున్న కొందరు నేతలు భావిస్తున్నారట.  తిరుపతి నుంచి భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, గంగాధర నె ల్లూరు నుంచి కృపాలక్ష్మీ, బందరు నుంచి పేర్ని కిట్టు పోటీ చేశారు. వీళ్లంతా సైకిల్ స్పీడును, గాజు గ్లాస్ కోతను తట్టుకోలేకపోయారు.. అల్లాడిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. తాము జోక్యం చేసుకోకపోతే.. తమ కుటుంబాల రాజకీయ భవిష్యత్ కు ఇక్కడితోనే ఫుల్ స్టాప్ పడేట్టుందనే ఆందోళన ఆయా పుత్ర రత్నాల తండ్రులలో వ్యక్తమౌతోందట.  దీంతో ఆయా నియోజకవర్గాల్లో   వారసుల కంటే.. తండ్రులే ఎక్కువగా రాజకీయం చేస్తున్నారు. తెలుగుదేశం నేతలతో.. ఎమ్మెల్యేలతో ఢీ అంటే ఢీ అంటున్న పరిస్థితి కన్పిస్తోంది. గంగాధర నెల్లూరు మినహా.. వారసులు పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ తండ్రులే తిరిగి రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు.  ఇలా ఆలోచించే వారిలో ముఖ్యంగా పేర్ని నాని ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బందరు నుంచి తానే రంగంలోకి దిగాలని దాదాపు డిసైడైనట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పేర్ని నాని తన సన్నిహితుల వద్ద కూడా చెబుతున్నట్టు తెలుస్తోంది. తన వారసుడు పేర్ని కిట్టునే మళ్లీ పోటీ చేస్తే.. గెలవడం కష్టమేమోననే ఆందోళవతో ఉన్నారట పేర్ని నాని. గడచిన ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచే తాను రాజకీయాలకు దూరంగా వెళ్లిపోతానని.. ఈ రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానని..ఇలా  చాలానే చెప్పారు పేర్ని నాని. ఇంత త్వరగా రాజకీయాల నుంచి నిష్క్రమించడం కరెక్ట్ కాదని.. చాలా మంది చెప్పి చూశారు. కానీ పేర్ని నాని నాడు వినలేదు. తన కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకున్నారు. ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందారు. ఇప్పుడు మారిన పరిణామాలతో పేర్ని నాని తిరిగి పోటీ చేయడానికి దాదాపు డిసైడ్ అయిపోయినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద కూడా పేర్ని నాని ప్రస్తావిస్తున్నారని సమాచారం. పేర్ని నాని తరహాలోనే మరి కొందరు కూడా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. 2024 ఎన్నికల్లో కూడా తాము సునాయాసంగా గెలిచేస్తామనే ఓవర్ కాన్ఫిడెన్సుతో వారసులను రంగంలోకి దించారు.. కొందరు వైసీపీ నేతలు. దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలనే థియరీని అనుసరించి.. వారసులకే టిక్కెట్లు ఇప్పించుకున్నారు. కానీ.. వారు అనుకున్నదొకటైతే.. దేవుడి స్క్రిప్ట్ మరో రకంగా ఉంది. వారసులను పొలిటికల్ గా సెటిల్ చేద్దామనుకుంటే.. ఏకంగా ఫ్యామిలీయే  రాజకీయాలకు దూరమైపోయే  పరిస్థితులు వచ్చేలా చేస్తున్నారు పుత్ర రత్నాలు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి వారసులను పక్కన పెట్టి.. మళ్లీ తామే రంగంలోకి దిగాలని భావిస్తున్నారట సదురు తండ్రులు.
మేమే పోటీ చేస్తాం.. మీరు తప్పుకోండి! Publish Date: Mar 10, 2025 5:26PM

కూటమి కోటాలో సోముకు ఎమ్మెల్సీ.. రగిలిపోతున్న తెలుగుదేశం శ్రేణులు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి అవకాశం లభిస్తుందని భావించిన ఇద్దరు తెలుగుదేశం నేతలకు తీవ్ర నిరాశ మిగిలింది. వారిలో ఒకరు పిఠాపురం వర్మ కాగా మరొకరు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ. వీరిరువురూ కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించారు. ఆశించారనడం కంటే పార్టీ అధిష్ఠానమే వారికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది. అయితే కారణాలేమైనా తెలుగుదేశం అధిష్ఠానం వీరిద్దరినీ పక్కన పెట్టింది. ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, వాటిలో ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించడం పట్ల తెలుగుదేశంలో ఎవరి నుంచీ ఎటువంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. కానీ బీజేపీకి ఒక స్థానం కేటాయించడం పట్ల క్యాడర్ లోనే కాకుండా.. పార్టీ నేతలలో కూడా అభ్యంతరం, అసహనం వ్యక్తం చేస్తున్నది. బీజేపీ కోసం ప్రతి సారీ తెలుగుదేశం పార్టీయే ఎందుకు త్యాగాలు చేయాలన్న ప్రశ్న కూడా గట్టిగా వినవస్తున్నది.  గతంలో ఆర్ కృష్ణయ్య విషయంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎమ్మెల్సీ విషయంలోనూ బీజేపీ పట్టుబట్టి ఒక స్థానాన్ని తెలుగుదేశం నుంచి లాగేసుకుందన్న అభిప్రాయం తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. అదే విధంగా ఇటీవల విజయసాయిరెడ్డి తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీని కూడా బీజేపీ అభ్యర్థితోనే భర్తీ చేయాలని ఆ పార్టీ పట్టుబడుతున్నట్లుగా తెలుగుదేశం వర్గాలలో వినిపిస్తోంది. అది పక్కన పెడితే.. ప్రస్తుతం ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని తెలుగుదేశం బీజేపీ కోసం త్యాగం చేయడం వల్ల పార్టీ ప్రతిపక్షంలో ఉండగా త్యాగాలు చేసి, పోరాటాలు చేసిన నేతలకు అవకాశం దక్కకుండా పోతున్నది. వారిలో ప్రధానంగా పిఠాపురం వర్మ, దేవినేని ఉమ ఉన్నారు. గత ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన పిఠాపురం వర్మకు పార్టీ అధినేత ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా పోత్తు ధర్మంతో సీటు త్యాగం చేసిన దేవినేని ఉమకూ దాదాపు ఇలాంటి హామీయే దక్కింది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరికీ కూడా తెలుగుదేశం ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి అవకాశం ఇవ్వలేదు. దీంతో పిఠాపురం వర్మ ఓపెన్ అయిపోయారంటున్నారు. తన సన్నిహితుల వద్ద పార్టీ కోసం త్యాగాలు చేసి తప్పు చేశానని, త్యాగం చేసిన తనకు తగిన శాస్తే జరిగిందనీ వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. అయితే తరువాత మీడియా సమావేశంలో పార్టీ నిర్ణయమే శిరోధ్యర్యం అని ప్రకటించారనుకోండి అది వేరే సంగతి. ఇక దేవినేని ఉమ బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేయనప్పటికీ, తనకు ఎమ్మెల్సీ అవకాశం దక్కకపోవడం పట్ల ఆయన నిరాశకు గురైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాస్తవానికి బీజేపీలో ఎమ్మెల్సీ స్థానానికి తగిన నేత లేరనే చెప్పాలి. జగన్ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఆ పార్టీతో అంటకాగిన సోము వీర్రాజుకు ఇప్పుడు  బీజేపీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం  తెలుగుదేశం శ్రేణులలో అసంతృప్తినీ, ఆగ్రహాన్నీ కలిగిస్తున్నది. నిజానికి బీజేపీ తెలుగుదేశం, జనసేన పార్టీలతో పొత్తు కారణంగా ఇప్పటికే తనకు ఉన్న స్టేక్ కంటే ఎక్కువ లాభం పొందింది. ఇదే పరిస్థితి ముందుముందు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. వచ్చే ఐదేళ్ల కాలంలో ఖాళీ అయ్యే ప్రతి పదవీ తెలుదగుదేశం కూటమికే దక్కుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి పెంచి బీజేపీ కూడా తగుదునమ్మా అంటూ పదవుల కోసం పోటీ పడుతుందని అంటున్నారు.  మొత్తం మీద కష్టమూ తెలుగుదేశందే, త్యాగాలూ ఆ పార్టీవే  అన్నట్లుగా పరిస్థితి తయారైందన్న ఆవేదన పార్టీ శ్రేణులలో వ్యక్తమౌతోంది. 
కూటమి కోటాలో సోముకు ఎమ్మెల్సీ.. రగిలిపోతున్న తెలుగుదేశం శ్రేణులు Publish Date: Mar 10, 2025 4:23PM

విజయ శాంతికి ఎందుకంటే?

కాంగ్రెస్ పార్టీ చాలా  కాలం తర్వాత ఓ చక్కని నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో ఎంతో కాలంగా పార్టీ నాయకత్వం పట్ల  సంపూర్ణ విశ్వాసంతో, విశ్వసనీయంగా పనిచేస్తున్న అద్దంకి దయాకర్ కి టికెట్ ఇచ్చింది. ఇంచుమించుగా రెండు దశాబ్దాలకు పైగా ప్రత్యక్ష, ఉద్యమ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న అద్దంకి దయాకర్ కు చట్టసభలో ప్రవేశించే అర్హతలన్నీ ఉన్నాయి. అయినా, చట్టసభలో కాలు పెట్టాలన్న ఆయన కోరిక ఇంతవరకూ నెరవేర లేదు. కారణాలు ఏవైనా అనేక సార్లు అవకాశాలు,తలుపు తట్టి మాయమై పోయాయి. చిక్కినట్లే చిక్కి చేజారి పోయాయి. అయితే ఏదయితే ఏం కానీ, చిట్ట చివరకు, అద్దంకి దయాకర్  చిరకాల స్వప్నం సాకార మయ్యే సదవకాశం లభించింది.దయాకర్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగి వచ్చిన  నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ కు పార్టీ  టికెట్  దక్కింది. ఆ ఇద్దరి విషయంలో ఎవరికీ ఎలాంటి  అభ్యంతరం లేదు. అలాగే, సిపిఐకి ఒక సీటు ఇవ్వడం కొంచెం ఎక్కువ అనిపించినా, సరే అని సరి పెట్టుకోవచ్చును. ఈసారి కాంగ్రెస్ అభ్యర్ధుల ఎంపిక, నల్గొండ సెంట్రిక్గా సాగిన నేపధ్యంలో  సిపిఐకి ‘ఉచిత’ గ్యారెంటీల కోటాలో ఒక టికెట్ ఇవ్వడాన్ని కొంతలో కొంత అర్థం  చేసుకోవచ్చును.  కానీ  కాంగ్రెస్ పార్టీలో అని కాదు  అసలు రాజకీయాల్లో ఉన్నారో లేదో తెలియని రాములమ్మ విజయశాంతికి కాంగ్రెస్ అధిష్టానం  ఏమి ఆశించి టికెట్ ఇచ్చిందో  ఏ లెక్కన ఆమెను పెద్దల సభకు పంపాలని నిర్ణయించిందో మనకే కాదు.. కాంగ్రెస్ నాయకులు, క్యాడర్ కు కూడా అర్థం కావడం లేదు. కాంగ్రెస్ ‘ముఖ్య’ నాయకులకు అయితే అసలు మింగుడు పడడం లేదని అంటున్నారు.  అందుకే  విజయ శాంతి విషయంలో పార్టీలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీసీ నాయకులు కొందరు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్న వీహెచ్, మధుయాష్కి గౌడ్ వంటి ఐడిలాజికల్  కమిటెమెంట్ ఉన్న సీనియర్ నాయకులను కాదని, స్థిరత్వం లేని, గాలివాటం రాజకీయాలకు అలవాటు పడిన విజయశాంతికి ఏ లెక్క టికెట్ ఇచ్చారనే ప్రశ్న పార్టీ వర్గాల్లో  గట్టిగానే వినిపిస్తోంది. అంతే కాకుండా, ఓ వంక కోవర్టుల కారణంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్ట పోతోందని అంటూ, మరో వంక నిన్నమొన్నటి వరకు బీజేపీలో ఉన్న విజయ శాంతికి టికెట్ ఇవ్వడం ఏమిటని  ప్రశ్నిస్తున్నారు.   నిజమే, ఒకప్పడు విజయశాంతికి, అటు సినిమా రంగంలో లేడీ అమితాబ్ గా ఇటు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్  లీడర్ గా మంచి పేరున్న మాట నిజం. అయితే  అదంతా ఇప్పడు గతం.ఇప్పడు ఆమె సినిమాల్లో గెస్ట్ ఆర్టిస్ట్ కు ఎక్కువ, కన్నాంబ క్యారెక్టర్ కు తక్కువ   అన్నట్లు  ఉన్నారు.  అప్పుడెప్పుడో, మహేష్ బాబు సినిమాలో కాసింత గుర్తింపున్న రోల్ లో నటించారు. అంతే, ఆ తర్వాత ఆమె వెండి తెర మీదనే కాదు. బుల్లి తెర మీద కూడా కనిపించలేదు. రాజకీయాల్లోనూ అంతే  అసెంబ్లీ ఎన్నికలకు ముందు, కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమెకు  పార్టీ    స్టార్  క్యాంపైనర్  ట్యాగ్ తగిలించింది. అయినా   ఆమె పెద్దగా ప్రచారం చేసిందీ లేదు. ఒరగ పెట్టింది అంత కంటే లేదు. లోక్ సభ ఎన్నికల్లోనూ ఆమె కంట్రిబ్యూషన్ ఇంచుమించుగా జీరో. ఇక ప్రస్తుతానికి వస్తే, ఆమె అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? లేరా? అనేది కూడా ఎవరికీ తెలియదు. ఈ మధ్య కాలంలో ఆమె పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించిన దాఖాలాలు లేవు. గాంధీ భవన్   గడప అయినా తోక్కారో లేదో తెలియదు. అంతే కాదు  ఎమ్మెల్సీ టికెట్ కోసం అయినా  ఆమె రాష్ట్ర నాయకులు ఎవరినీ కలవ లేదు. రాష్ట్ర పార్టీని, రాష్ట్ర నాయకులను ఇగ్నోర్  చేస్తూ  నేరుగా ఢిల్లీ వెళ్లి  అధిష్టానం కోటాలో  టికెట్ తెచ్చుకున్నారు. నిజమో కాదో గానీ, ఆమెకు టికెట్ ఇస్తున్న విషయం రాష్ట్ర ‘ముఖ్య’ నాయకులకు కూడా చివరి నిముషం వరకూ తెలియదంటున్నారు. అందుకే  కాంగ్రెస్ అధిష్టానం, ఏ అర్హతలు చూసి ఆమెకు టికెట్ ఇచ్చింది అనేది, ఇప్పడు కాంగ్రెస్ నాయకులకు సైతం అర్థం కాని, ప్రశ్నగా మిగిలింది. అయితే., బీఆర్ఎస్, బీజేపీలను సమర్ధంగా ఎదుర్కునేందుకు, అధిష్టానం విజయ శాంతికి ఎమ్మెల్సీ టికట్ ఇచ్చిందనే ప్రచారం సాగుతోంది. కానీ  ఆమెకు అంత సీన్ లేదని, పాతికేళ్ళకు పైగా రాజకీయాల్లో ఉన్నా, బీజేపీతో మొదలు పెట్టి, సొంత పార్టీ పెట్టి, బీఆర్ఎస్ లో కలిసి, కాంగ్రెస్’ లో చేరి, మళ్ళీ బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరిన  ఆమెకు రాజకీయ నిబద్దత మాత్రమే కాదు, అవగాహన కూడా లేదంటున్నారు. రాజకీయ భాషపై పట్టు  అబ్బనే  లేదని, ఎవరో స్క్రిప్ట్ రైటర్ రాసింది, బట్టీపట్టి సినిమాటిక్ గా చెప్పడమే కానీ , అందరికీ అర్థమయ్యేలా, అందరినీ ఒప్పించేలా మాట్లాడలేరని అంటున్నారు. అందుకే  కాంగ్రెస్ అధిష్టానం ఏమి చూసి విజయశాంతికి టికెట్ ఇచ్చారు అన్నది .. పజిలింగ్ గానే మిగిలింది.
విజయ శాంతికి ఎందుకంటే? Publish Date: Mar 10, 2025 3:27PM

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోటాలో నలుగురు  నామినేషన్లు 

తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా  నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు.  కాంగ్రెస్ నుంచి   విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు. విజయశాంతి గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు. అనూహ్యంగా ఎంఎల్ సి పదవి వరించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్లను కాదని విజయశాంతికి పదవి రావడంలో తెలంగాణ ఇన్ చార్జి జయంతి నటరాజన్ కీలకపాత్ర పోషించినట్టు సమాచారం. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. కాంగ్రెస్ కు  వచ్చే నాలుగు సీట్లలో పొత్తు ధర్మం ప్రకారం కాంగ్రెస్  ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో కాంగ్రెస్ పొత్తు సీట్ల సర్దుబాటు చేసుకుంది. తమకు రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని సీపీఐ గట్టిగా పట్టుబట్టింది కొత్తగూడెం మాత్రమే  కాంగ్రెస్ కేటాయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటును కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు ఈ సీటును కేటాయించింది.
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోటాలో నలుగురు  నామినేషన్లు  Publish Date: Mar 10, 2025 3:19PM

ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది.. నవ్వులపాలైన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ట్వీట్

వైసీపీ మరో సారి నవ్వుల పాలైంది. ఈ సారి ఆ పార్టీ ఎమ్మెల్యే చేసిన ఓ ట్వీట్ మొత్తం పార్టీనే నవ్వుల పాలు చేసింది. దుబాయ్ వేదికగా ఆదివారం ( మార్చి 9) జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో టీమ్ ఇండియా న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి చాంపియన్ టీమ్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు అన్ని వర్గాల నుంచీ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే దేశం యావత్తూ ఈ చారిత్రాత్మక విజయంతో సంబరాలు చేసుకుంది.  ఈ విజయాన్ని వైసీపీ కూడా ఆస్వాదించింది. అయితే ఈ సందర్భాన్ని తమ పార్టీకి బూస్ట్ వచ్చే విధంగా మలచుకోవడానికి ఎర్రగొండ పాలెం ఎమ్మెల్యే చేసిన ఓ ట్వీట్ వైసీపీని నవ్వుల పాలు చేసింది. వైసీపీ నాయకుడు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్య టి. చంద్రశేఖర్ చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమ్ ఇండియాను అభినందిస్తూనే.. పనిలో పనిగా గత ఎన్నికలలో తమ పార్టీ గెలిచిన 11 స్థానాలను గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేశారు.  అందులో భాగంగా ఆయన టీమ్ ఇండియా ఎలాంటి పొత్తులూ లేకుండా కేవలం 11 మందితో ఆడి చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిందనీ, అదే విధంగా 2029 ఎన్నికలలో వైసీపీ విజేతగా నిలుస్తుందనీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.  వెంటనే ఈ పోస్టు ఓ రేంజ్ లో ట్రోలింగ్ కు గురైంది.  ఆటల్లో పొత్తులుండవు గురూ.. అంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ 11 సీట్లైనా గెలిచే అవకాశం ఉంటుందా అంటు మరి కొందరు ఎద్దేవా చేశారు.  ‘ఎవరి పొత్తూ లేకుండా టీమ్ ఇండియా 11 మంది సభ్యులతో నిజాయితీగా కప్ గెలిచింది. నాలుగేళ్ల తరువాత ఏపీలో ఇదే రిపీట్ అవుతుంది’ అన్నది ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే టీ. చంద్రశేఖర్ చేసిన ట్వీట్.      ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఇండియా చాంపియన్స ట్రోఫీ గెలిచిందని చెప్పడం ఆయన ఉద్దేశం అయితే కావచ్చు.. కానీ అందుకు ఆయన ఆటగాళ్ల సంఖ్యను కూడా పేర్కొనడం, అది నేరుగా గత ఎన్నికలలో వైసీపీ గెలిచిన సీట్ల సంఖ్యే కావడంతో నెటిజనులు ఓ రేంట్ లో ట్రోల్ చేశారు. పాపం ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పార్టీ క్యాడర్ లో  ఉత్సాహాన్నీ, విశ్వాసాన్ని నింపడానికి చేసిన ట్రీట్ బూమరాంగ్ అయ్యింది.  టీమ్ ఇండియా ఎప్పుడూ వైనాట్ 175 అనలేదనీ ఎన్డీయే మద్దతు దారులు ఎద్దేవా చేస్తున్నారు.  
ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది.. నవ్వులపాలైన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ట్వీట్ Publish Date: Mar 10, 2025 2:03PM