ఎన్డీఏలోకి జగన్ రెడ్డి? కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ఓడిచేందుకు వైసీపీకి బీజేపీ సహకరించిందనే టాక్ ఉంది. సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా కేంద్రంతో సఖ్యతగానే ఉంటున్నారు. బీజేపీ పెద్దల మద్దతు జగన్ కు ఉందనే చర్చ ఉంది. అంతేకాదు వైసీపీ కేంద్ర ప్రభుత్వంలో చేరబోతుందనే ప్రచారం జరిగింది. అందుకే ఆంధ్రుల హక్కుగా పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నా.. జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేక హోదాపై మాట తప్పినా, విభజనతో నష్టపోయిన ఏపీని నిర్లక్ష్యం చేస్తున్నా మోడీ సర్కార్ ను జగన్ రెడ్డి పల్లెత్తు మాట అనడం లేదనే విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి.

తాజాగా వైసీపీ కేంద్ర ప్రభుత్వంలో చేరడానికి సంబంధించి కేంద్ర మంత్రి చేసిన ప్రకటన సంచలనంగా మారింది.ఎన్డీయేలో వైసీపీ రావాలంటూ  కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు.  కేంద్రం భాగస్వామ్యంతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టులు, రహదారులు పూర్తిచేసుకోవచ్చని ప్రతిపాదించారు. పరిశ్రమల ప్రైవేటీకరణ కాంగ్రెస్ హయాంలోనూ జరిగిందని అథవాలే  అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు అథవాలే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపైనా స్పందించారు కేంద్రమంత్రి. ఏపీకి  మూడు రాజధానుల అంశం కేంద్రం పరిధిలో లేదని స్పష్టం చేశారు. 

ఏపీ రాజధాని, ఎన్డీఏలోకి వైసీపీ చేరిక అంశంపై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు ఏపీలో కాక రేపుతున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న చర్చల ఆధారంగానే ఆయన ఈ ప్రకటన చేసి ఉండవచ్చని అంటున్నారు. గతంలో సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు ఎన్డీఏ చేరికపై చర్చలు జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.