హోదాపై కేంద్రం పాత పాట.. జగనన్న మౌనమే శాపమా? 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ముగిసిన అధ్యాయం. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు హోదా ఇవ్వనందునే...కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజికి అంగీకారం తెలిపింది.. ఇదే  పాత పాటను కేంద్ర ప్రభుత్వం మరోసారి పార్లమెంట్ లో పాడి వినిపించింది. తెలుగు దేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ఈ మేరకు  లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అంతే కాదు, విభజన చట్టంలో చాలా అంశాలు అమలయ్యాయని, మౌలిక వసతులు, విద్యాసంస్థల ఏర్పాటు వంటి వాటికి దీర్ఘకాల సమయం ఉందన్నారు.విభజన అంశాల పూర్తి కోసం చట్టంలోనే పదేళ్ల గడువు ఉందని వివరించారు. చట్టంలో పేర్కొన్న అన్ని పూర్తి చేసేందుకు కేంద్ర హోం శాఖ ఎప్పటికప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో పాటు.. ఏపీ, తెలంగాణ ప్రతినిధులతో సమీక్ష చేస్తోందని వెల్లడించారు. ఇప్పటి వరకు 25 సమీక్షా సమావేశాలు జరిగయాని, ద్వైపాక్షిక సమస్యల సామరస్యపూర్వక పరిష్కారం కోసం 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు మంత్రి తన సమాధానంలో చెప్పారు.14వ ఆర్థిక సంఘం సిఫారసులతో ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయిన వ్యవహారమని ఉద్ఘాటించారు. 

కేంద్ర ప్రాయోజిత పథకాలను 90:10 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచి ఉంటే.. ఏపీకి 2015-16 నుంచి 2019-20 సంవత్సరాల మధ్య కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత అదనపు సాయం లభించేదో.. ఆ మొత్తాన్ని ప్రత్యేక సాయం కింద అందించడానికి అంగీకరించినట్లు చెప్పారు. 2015-16 నుంచి 2019-20 వరకు కుదుర్చుకున్న విదేశీ రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీని కేంద్రమే చెల్లించేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసిందని లోకసభకు ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు.మొత్తానికి, కేంద్ర మంత్రి ఏపీకి ఇంకేమీ చేసేది లేదని, చేయవలసిందీ లేదని నిర్లక్ష్యపూరితంగా సమాధానం ఇచ్చారు. అయినా 22 మంది వైసేపీ ఎంపీల్లో ఎవరు నోరు విప్పలేదు. ఇదెక్కడి అన్యాయమని అడిగే సాహసమే చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం,  మాట తప్పని, మడమ తిప్పని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అయితే అసలు కేంద్రం చేసిన అవమానాన్ని అసలు గుర్తించినట్లే లేదు. 

అయితే తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న అయిదేళ్ళలో ప్రత్యేక హోదా కోసం అంతులేని పోరాటం చేసింది. చివరకు కేంద్రం మొండి వైఖరి మారక పోవడంతో, బీజేపీతో తెగతెంపులు చేసుకుని, కేంద్రంలో మంత్రి పదవువులను వదులుకుని ఎన్డీఎ నుంచి బయటకు వచ్చింది. కేంద్రం తలపెట్టిన అన్యాయయానికి వ్యతిరేకంగా గల్లీ నుంచి డెల్లి వరకు  ధర్మ పోరాటం సాగించింది.కాంగ్రెస్ సహా ఇతర పార్టీల మద్దతుతో,ఇదే ఇష్యూ ఫై మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తెచ్చి, ఆంద్ర ప్రదేశ్ హోదా విషయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్ళింది. అయితే ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, ప్రత్యేక హోదాను పక్కన పెట్టేసింది. రాష్ట్రంలో అధికారంతో పాటుగా లోక్ సభలో 25 కు 22 సీట్లు వైసీపీకి కట్టబెట్టినా, అధికారం అప్పగిస్తే కేంద్రంతో కోట్లాది అయినా ప్రత్యేక హోదా సాధిస్తానని మాటిచ్చిన జగన్మోహన రెడ్డి ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే కాడి వదిలేశారు. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చింది కాబట్టి , హోదా అడిగే పరిస్థితే లేదని ముందుగానే సరండరై పోయారు. అయినా అడుగుతూనే ఉంటాం.. ఆ తర్వాత కేంద్రం దయ మన ప్రాప్తం, అంటూ యుద్ధానికి ముందే సంధి మంత్రం జపించారు. తెల్ల జెండా ఎగరేశారు. పార్లమెంట్ లోపలగానీ, బయట గానీ వైసేపీ ఎంపీలు ఏనాడు, ప్రత్యేక హోదా ప్రస్తావనే చేయలేదు. 

అయితే తెలుగు దేశం పార్టీ మాత్రం, ఉన్నది ముగ్గేరే ఎంపీలు అయినా లోక్ సభలో ఇంచు మించుగా ప్రతి సెషన్ లోనూ ఏదో ఒక రూపంలో ప్రత్యేక హోదా అంశాన్ని తెచ్చి, హోదా ఇష్యూ ను సజీవంగా ఉంచుతోంది.