వచ్చాడు వచ్చాడు ఒక లీడరు! దక్కన్ రాష్ట్రం 'కాసే' దమ్మున్నోడు!

కేటీఆర్… 2014కి ముందు కేసీఆర్ తనయుడు మాత్రమే! మరిప్పుడు? ఇప్పుడు కూడా ఆయన కేసీఆర్ వారసుడే … కానీ… జూలై 24 ఆయన 42వ పుట్టిన రోజు సందర్భంగా జరుగుతోన్న హంగామా చూస్తోంటే తాజా పరిస్థితి అర్థం అవుతుంది! ఆదివారం నుంచీ జ్వరం, బహుశా వయస్సు మీద పడుతున్నందుకేమో… అంటూ కేటీఆర్ ట్విట్టర్ లో సరదాగా పోస్టు చేశారు! అనారోగ్యం వల్ల తెలంగాణ ఐటీ మంత్రి బయట ఎక్కడా కనిపించకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఆయన బర్త్ డే హోరు జోరుగానే వుంది. పొలిటీషన్స్, సినిమా వారు, ఇతరులు అన్న తేడా లేకుండా వరస పెట్టి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. అసలు ఎవరెవరు ఈ 42 ఏళ్ల యంగ్ అండ్ డైనమిక్ కి హ్యాపీ బర్త్ డే చెప్పారో ఓ సారి చూస్తే క్రేజ్ ఏంటో అర్థమవుతుంది…

 

 

ఐటీ మినిస్టర్ కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో బావ హరీష్ రావు కూడా వున్నారు. అలాగే మంత్రి జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ రాములు నాయక్, దర్శకుడు ఎన్. శంకర్, కేథరిన్ హడ్డా, ఇజ్రాయెల్ అంబాసిడర్ డేనియల్ కార్‌మాన్, నటుడు మహేశ్ బాబు, బ్రహ్మజీ, ప్రియదర్శితో పాటు ఇంకా చాలా మందే వున్నారు. ఏపీ ఐటీ శాఖా మంత్రి లోకేష్ కూడా తన సహచర రాజకీయ వారసుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు!

 

 

ఒకవైపు తనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుంటే మరో వైపు కేటీఆర్ కేకులు కోసి, కటౌట్లు కట్టి డబ్బులు వృథా చేయకండి అంటూ పిలుపునిచ్చారు. మొక్కలు నాటమని చెప్పారు. ఆయన పిలుపునందుకుని టీఆర్ఎస్ శ్రేణులు భారీగానే మొక్కలు నాటుతూ, పళ్లు పంచిపెడుతూ సేవ కార్యక్రమాలు చేశాయి. ఓ కేటీఆర్ అభిమాని అయితే 42 ఏళ్ల తమ నేత మీద అభిమానంతో 42 మొక్కలు నాటారట! ఇదంతా పక్కన పెడితే కేటీఆర్ బర్త్ డే అసలు హై లైట్ ‘వీడియో సాంగ్’! స్వయంగా హైద్రాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ వీడియో సాంగ్ ని ప్రజెంట్ చేయటం మరింత విశేషం! తెలంగాణ భవన్ లో కేటీఆర్ పై రూపొందించిన పాటని టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు విడుదల చేశారు!

 

 

ఒక రాజకీయ నేత బర్త్ డే అన్నాక ఇలాంటి హంగామా సహజమే. కాకపోతే, ఎన్నికల ముందు సంవత్సరంలో కేసీఆర్ వారసుడు కేటీఆర్ పై ఈ శుభాకాంక్షల జల్లు కాస్త ప్రత్యేకమని కూడా ఒప్పుకోవాల్సిందే. కేసీఆర్ తరువాత సీఎం పీఠంపై ఆయన కూర్చుంటారా? ఇప్పుడైతే ఆ చర్చ లేదు కానీ… రేపు ఎప్పుడైనా తెలంగాణ సీఎం అవ్వాలి అంటే ఆ అవకాశాలు టీఆర్ఎస్ లో కేటీఆర్ కే ఎక్కువగా వున్నాయి. హరీష్ వర్గం కూడా ఒకటి వుండవచ్చు. అయినా కేటీఆర్ పట్టు పార్టీపై రోజు రోజుకి పెరుగుతుండటం ఎవరూ కాదనలేని సత్యం! అందుకు ఆయన బర్త్ డే హంగామా మరో ఉదాహరణ! అంతే కాదు… ఆయన పై రూపొందించిన పాటలో కూడా తొలి లైనే… ‘’ వచ్చాడు వచ్చాడు ఒక లీడరు! దక్కన్ రాష్ట్రం కాసే దమ్మున్నోడు!’’ అంటూ సాగుతుంది! ఈ రాష్ట్రాన్ని కాయటం అంటే ఏంటి అంతరార్థం? ఇప్పుడే రకరకాల విశ్లేషణలు అవసరం లేనప్పటికీ… కేటీఆర్ … కేసీఆర్ తరువాత అంతటి వాడవుతున్నారు పార్టీలో అన్నది మాత్రం విస్పష్టం!