Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మంచితనం ఒక్కటే చాలదు బాబూ.. కాఠిన్యమూ ఉండాలి!
posted on: Jul 23, 2024 8:21AM
రాజ్యాన్ని పాలించే రాజుకు మంచితనం మాత్రమే ఉంటే సరిపోదు.. ఎప్పుడూ ప్రజల అభివృద్ధికోసం ఆలోచించడమే కాదు.. రాజ్యంపై దండెత్తే ప్రత్యర్థులపైనా, దోపిడీ దారులపైనా కఠినంగానూ ఉండాలి. అప్పుడే రాజ్యంలోని ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా సంతోషంగా జీవనం సాగిస్తారు. వ్యాపారాలు అభివృద్ధి చెంది ఆ రాజ్యం ఆర్థికంగానూ బలోపేతం అవుతుంది. ఆ సూత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పట్టించుకున్నట్లు లేదు. ఫలితంగా ప్రతిపక్ష హోదా సైతం కోల్పోయిన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా పూర్తి కాకముందే.. రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అవుతోందనీ.. శాంతిభద్రతలు క్షీణించాయనీ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తమకు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులకు సైతం వార్నింగ్ లు ఇస్తున్నారు. రాష్ట్రంలో జగన్, వైసీపీ నేతల ప్రవర్తన చూస్తున్న ప్రజలు ఏపీలో అధికారంలో ఉంది వైసీపీనా, తెలుగుదేశం కూటమి ప్రభుత్వమా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనంతటికి చంద్రబాబు నాయుడు మంచితనమే కారణమని కొందరు తెలుగుదేశం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు, అభివృద్ధే ముఖ్యంకాదు.. తప్పుడు ప్రచారం చేసే ప్రతిపక్ష పార్టీ నేతలపై కొరడా ఝుళిపించి వారిని అదుపులో పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
గత ఐదేళ్ల జగన్ మోహన్ రెడ్డి పాలనలో కక్షపూరిత రాజకీయాలతో ప్రజలు వణికిపోయారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులుపెట్టి జైళ్లకు పంపించారు. ఫలితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపార వేత్తలు వెనుకడుగు వేశారు. ఏపీ ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింది. ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగాఅడుగంటి పోయింది. అప్పులతోనే ఐదేళ్లు రాష్ట్రాన్ని జగన్ నడిపిస్తూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టారు. పాలనాపరంగా సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు.. తొలుత రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నారు. ఘర్షణలకు, దౌర్జన్యాలకు పాల్పడితే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీ నేతలు అనే తేడాలేకుండా కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మరోవైపు అభివృద్ధి పనుల్లో వేగం పెంచారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై దృష్టి సారించారు. మొత్తంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం 50రోజుల పాలనలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. ఇది జీర్ణించుకోలేని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలను తమకు అనుకూలంగా మార్చకుంటూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని తమ అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న వ్యాపారులను భయాబ్రాంతులకు గురిచేసేలా జగన్, వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు ఇష్టానుసారంగా రెచ్చిపోవటానికి సీఎం చంద్రబాబ నాయుడు మంచితనం కూడా కారణమని పలు వర్గాల ప్రజలు వాపోతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై లాఠీలు ఝుళింపించాలని, అప్పుడే జగన్ మోహన్ రెడ్డి లాంటి వారు, వైసీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడుతారని పేర్కొంటున్నారు. అసెంబ్లీ వద్ద జగన్ మోహన్ రెడ్డి పోలీసులపై వ్యవహరించిన తీరును చూస్తుంటే టీడీపీ, జనసేన నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అసెంబ్లీ వద్ద నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వైసీపీ ఎమ్మెల్యేలకు అడ్డు చెప్పినందుకు జగన్ మోహన్ రెడ్డి పోలీసులపై చిందులేశాడు. అధికారంలో ఉంది వైసీపీ.. నేనే సీఎంను అన్నట్లుగా అహంకార పూరితంగా మాట్లాడారు. ఐదేళ్లు అవినీతి, అక్రమాలతో రాష్ట్రాన్ని దోచుకున్న జగన్, వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కొరడా ఝుళిపించి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి ఉండేది కాదని కొందరు తెలుగుదేశం, జనసేన నేతలు అంటున్నారు.
జగన్ మోహన్ రెడ్డి తాజాగా ట్విటర్ లో షేర్ చేసిన పోస్టును చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ రెడ్డిని జైలుకు పంపిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కేవలం 50 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని జగన్ ట్వీట్ చేయడం గమనార్హం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అరాచక పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ జగన్ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. అంతేకాదు.. చంద్రబాబు జగన్ మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నాడట. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో ప్రశ్నిస్తారన్న భయంతో కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం లేదంటూ జగన్ ట్వీట్ లో పేర్కొనడం గమనార్హం. మరో అడుగు ముందుకేసి.. చంద్రబాబునాయుడి పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది అంటూ జగన్ ట్వీట్ చేయడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సుదీర్ఘ పాలనా అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు అభివృద్ధే లక్ష్యంతో పాటు.. రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించే వైసీపీ మూకల పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.


.webp)



