వివేక హత్య కేసు దర్యాప్తులో చేతులెత్తేసిన సీబీఐ?!

రాష్ట్ర ప్తంగా పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ సొంత బాబాయ్ హత్య కేసు విచారణలో సీబీఐ చేతులెత్తేసిందా? కోర్టుకు ఆ దర్యాప్తు సంస్థ చెప్పిన విషయం వింటే ఔననే అని పించక మానదు. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని సీబీఐ కోర్టుకు విస్పష్టంగా చెప్పేసింది.

ఇందుకు సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు రెండు కారణాలు తెలిపారు. వాటిలో ఒకటి ఢిల్లీ ఫొరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదికలు రావడంలో జాప్యం కాగా మరొకటి స్థానిక అధికారుల నుంచి సహాయ నిరాకరణ. ఈ రెండు కారణాల వల్లే వివేకా హత్య కేసులో దర్యాప్తు జాప్యం అవుతోందని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ వివరాలతో కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన సీబీఐ, తమ వాహన డ్రైవర్ ను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించిన సంగతిని కూడా తెలియజేసింది. 

హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని మాత్రం అభ్యంతరం తెలిపింది. అయితే సీబీఐ అభ్యంతరంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని స్థితిలో ఉంటే నిందితులకు బెయిలు ఇవ్వకుండా ఎంత కాలం ఆపాలని ప్రశ్నించింది.

ఫొరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదికలను వీలైనంత త్వరగా తెప్పించాలని కోర్టు ఆదేశించింది. కోర్టుకు సీబీఐ చెప్పిన విషయాలను గమనిస్తే వివేక హత్య కేసు దర్యాప్తు కథ కంచికి చేరినట్లే అనిపిస్తోందని న్యాయ రంగ నిపుణులు అంటున్నారు.