కాసినో.. అదో మాయాలోకం!

ఒక పెద్ద హాలు, కళ్లు జిగేల్ మనే లైటింగ్,  మధ్యలో పెద్ద గ్రీన్ కలర్ టేబుల్.. దానిపై రకరకాల రంగుల్లో కాయిన్స్, కార్డులు... టేబుల్ చుట్టూ మనుషులు... ఒక చేతిలో గ్లాసు... మరొక చేతిలో కాలుతున్న సిగరెట్.. ఇంత‌లో ఎంట్రీ ఇస్తాడు ఆరు అడుగుల పైచిలుకు ఎత్తున్న వ్య‌క్తి, చురుక‌యిన చూపుల‌వాడు, మ‌హా తెలివిమంతుడు.. జేమ్స్బాండ్‌.. ఒక్క‌సారి అంతా ప‌రికించి చూసి టేబుల్ ద‌గ్గ‌రికి వెళ‌తాడు..వెనకి మేడ మీది గ‌ది ర‌హ‌స్య ద్వారం నుంచి ఒంటిక‌న్ను విల‌న్ అంతా గ‌మ‌నిస్తూంటాడు.. ఇది తెర‌మీద కాసినో దృశ్యం. ఆడ‌తారు, పాడ‌తారు, తాగుతారు, ఆన‌క కొట్టుకు ఛ‌స్తారు. సినిమా అయిపోతుంది.. కానీ ఆ కాసినో సీన్ మాత్రం ప్రేక్ష‌కుల మ‌దిలో చాలాకాలం ప్రింట‌యిపోతుంది. మ‌రి ఇంతే రిచ్‌గా రియ‌ల్ లైఫ్ లో క్యాసినో సెట‌ప్ ఉంటుందా అంటే ఔన‌నే అనాలి. తెలుగువారికి కాసినో ర‌హ‌స్యాల‌న్నీ తెలిపింది  ఇటీవ‌లి చీకోటి భాగోతం!

క్యాసినో అంటే డబ్బు కోసం ఆటలు ఆడే ఒక ప్లేస్. ఇక్కడ ప్రధానంగా జరిగేది గ్యాంబ్లింగ్. కాసా(ఇల్లు) అనే ఇటాలియన్ పదం నుంచి వచ్చిందే క్యాసినో. ల‌క్ష‌ల బెట్టింగ్‌తో ఆడే ఆట అంతా కూడా అదృష్టం మీద‌నే ఆధాప‌డుతుంది. మీ ఊళ్లో చాలా తెలివిగా చెస్ బోర్డు ఆడిన‌దానికి దీనికి అస్స‌లు పొంత‌నే ఉం డ‌దు. పెద్ద‌పెద్ద ప్లేయ‌ర్లు కూడా ఇక్క‌డ బోల్తాప‌డే అవ‌కాశాలే ఎక్కువ‌.. అలా చేస్తారు, అందుకు ఏర్పాట్లూ ఉంటాయి... వెర‌సి ఇదో గాంబ్లింగ్ డెన్‌! క్యాసినోలలో అలాగే రెస్టారెంట్, బార్, కచేరీలు, డ్యాన్స్ షోలు వంటి ఇతర వినోదాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు. బెట్టింగ్, లాటరీ గేమ్స్ ఆడే మెషీన్లు కూడా ఉంటాయ్. పోకర్బ్  జాక్ పాట్‌,  బాక్రా, క్రాప్, తీన్‌పత్తి, అందర్ బాహర్ అనేవి ప్రధానమైన ఆటలు.

కొందరు డబ్బులు సంపాదించడానికైతే మరికొందరు వినోదం కోసం క్యాసినోలకు వెళ్తుంటారు. ఇంకొం దరికి అదొక అలవాటు కూడా. క్యాసినోలకు వచ్చే వారిని అలరించడానికి పాట కచేరీలు, పోల్ డ్యాన్స్, డ్యాన్స్ షో లూ  ఉంటాయి. అన్నిరకాల మద్యం అందుబాటులో ఉంటుంది. మొత్తానికి క్యాసినోలో ఆటలు ఆడొచ్చు.. తినొచ్చు, తాగొచ్చు... మ్యూజిక్, డ్యాన్స్ షోలు చూసి ఆనందిం చొచ్చు... అలసిపోతే మసాజ్ చేయించుకుంటూ రిలాక్స్ కావొచ్చు. హోటళ్లు, నైట్ క్లబ్బులు, రెస్టారెంట్లు, స్పాలు, రిసార్టులు, షాపింగ్ సెంటర్లు ఈ క్యాసినోలకు కేంద్రాల‌వుతున్నాయి. ఈవెంట్స్, వేడుకలు, ఉత్సవాల్లో కూడా క్యాసినోలను టెంపరరీగా నిర్వహిస్తుంటారు.

కోట్ల‌లో సుల‌భంగా సంపాదించేందుకు, కాసింత ఆనందంగా జీవితాన్ని కొన్నాళ్లు గ‌డ‌ప‌డానికి  భార‌తీయు లు చాలామంది విదేశీ ప‌ర్య‌ట‌న‌ల పేరుతో క్యాసినో అట్రాక్ష‌న్‌తోనే వెళుతున్నారు.  చికోటి ప్రవీణ్ వంటి వారు ప్రత్యేకంగా విమానాలు నడుపుతున్నారంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా క్యాసినోలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగానే ఉందని అర్థం చేసుకోవచ్చు. మకావు, సింగపూర్, లాస్ వెగాస్, మాంటే కార్లో వంటి ప్రాంతాలకు ఎక్కువగా భారతీయులు క్యాసినోల కోసం వెళ్తుంటారు.

నిజానికి విదేశాల‌కే ప్ర‌త్యేకించి అందుకోసం వెళ్ల‌న‌వ‌స‌రం లేదు. ఈ ఆధునిక కాలంలో మ‌న దేశంలోనూ క్యాసినోలు గోవా, సిక్కిం, డామన్ డయ్యూలలో  ఉన్నాయి. గోవాకి రిలాక్సింగ్ కోసం వెళుతున్నామ‌నే వారిలో చాల‌మంది ఈ రిలాక్సింగ్ కూడా ఆశించే వెళుతున్న‌ట్టు స‌మాచారం.  కానీ,  చ‌ట్ట‌విరుద్ధంగనుక ఇక్క‌డి  గ్యాంబ్లింగ్ ఆటల్లో బెట్టింగ్ ఉండ‌దు. 

బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అనే వాటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు నిషేధించాయి. కాబట్టి క్యాసినో లను పెట్టడం అనేది ప్రస్తుతానికి ఇక్కడ సాధ్యం కాదు.  గోవాలో 21 ఏళ్లు నిండిన వారే క్యాసినో గేమ్స్ ఆడ టానికి అర్హులు. సిక్కింలో 18 ఏళ్లు నిండిన వారిని అనుమతిస్తారు అందువల్లే బెట్టింగ్ గేమ్స్ ఆడాలనుకు నే తెలుగు వాళ్లు గోవా లేదా నేపాల్, శ్రీలంక వంటి ప్రాంతాలకు వెళ్తుంటారు.

అయితే ఆదాయం పెంచుకునేందుకు విశాఖపట్నంలో ఫ్లోటింగ్ క్యాసినోలకు అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ భావిస్తున్నట్లుగా గతంలో మీడియా పేర్కొన్న‌ది. ఇండియాలో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అనేవి రాష్ట్ర జాబితాలో ఉంటాయి. వాటిని అనుమతించాలా? లేక నిషేధించాలా?  అనేది రాష్ట్రాలే  నిర్ణయి స్తాయి..

భారత్‌లో గ్యాంబ్లింగ్  రెండు ర‌కాలు.. 'గేమ్ ఆఫ్ చాన్స్', 'గేమ్ ఆఫ్ స్కిల్స్‌. మొద‌టిది అదృష్టం మీద ఆధారపడి ఆడే ఆటలు ఈ కేటగిరిలోకి వస్తాయి. ఈ ఆటలు ఆడాలంటే స్కిల్ పెద్దగా అవసరం లేదు. ఫలితం పూర్తిగా చాన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక రెండ‌వ‌ది..ఈ ఆటలు ఆడాలంటే నైపుణ్యం కావాలి. వీటిని ఆడేవాళ్లకు ఒక వ్యూహం అంటూ ఉంటుంది. ప్లేయర్స్‌కు లాజికల్ థింకింగ్, ఎనలిటిక్ స్కిల్స్ వంటివి కావాలి. కాగా, భారత్‌లో చాలా వరకు రాష్ట్రాలు, స్కిల్ ఆధారంగా నడిచే ఆటలను అను మతిస్తున్నాయి. అదృష్టం మీద ఆధారపడి ఉండే ఆటలను నిషేధిస్తున్నాయి. 

ఆట‌ల విష‌యంలోనూ రాష్ట్రాల మ‌ధ్య వ్య‌త్యాసం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రమ్మీని నిషేధించారు. కానీ తమిళనాడులో అది లీగల్. ఇలా ఒకే ఆట విషయంలోనూ రాష్ట్రాల మధ్య భిన్న అభిప్రాయాలు కనిపిస్తు న్నాయి. 2012లో మద్రాస్ హైకోర్టు గ్యాంబ్లింగ్ ఆటగా పరిగణిస్తూ ఆన్‌లైన్ రమ్మీని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని సంబంధిత కంపెనీలు సుప్రీం కోర్టులో సవాలు చేశాయి. చివరకు రమ్మీని 'గేమ్ ఆఫ్ స్కిల్'గా పరిగణిస్తూ ఆ నిషేధాన్ని ఎత్తి వేసింది సుప్రీం కోర్టు. పోకర్ విషయంలోనూ ఇదే వివాదం ఉంది. దీన్ని 'గేమ్ ఆఫ్ స్కిల్'‌గా చూడాలని కొందరు 'గేమ్ ఆఫ్ చాన్స్‌'గా చూడాలని మరికొందరు వాదిస్తున్నారు.

ఇంత‌టీ రంగుల జిగేల్ లోకంల్లోకి అలా తీసికెళ్లి వారికి జీవితంలో రుచిచూడ‌కూడ‌ని మ‌త్తెక్కించి వారు తెలుసుకునేలోగా పాప‌ర్ల‌ను చేయ‌డంలో ఆరితేరిన గ‌జ ఆట‌గాడు చీకోటి.  కోట్ల‌తో వ్యాపారం చేసేడు, కోటీశ్వ‌రుల‌కు గ‌తిలేకుండా చేసేడు, చివ‌రికి బంగారుప‌ళ్లెం, వెండి స్పూను దూర‌మై  పోలీసుల‌కు చిక్కాడు. అంత‌టి ఘ‌నుడికి ఇప్పుడు ప్రాణ‌భీతి నిజంగానే చంపేస్తోంది. త‌న‌కు ప్రాణ భ‌యం ఉంద‌ని కోర్టు కీ విన్న‌వించుకున్నాడు.  చ‌ట్ట‌వ్య‌తిరేక ప‌నులు చేసిన‌వాడు ఎంత‌టి కాసినో కింగ్ అయినా దొర‌క‌ నంత‌ వ‌ర‌కే, దొరికితే జేబుదొంగ లా ఒణిపోవాల్సిందే!