యూపీలో ఆర్జీవీపై కేసు.. అరెస్టు తప్పదా?

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే సినీ దర్శకుడు రామగోపాల వర్మ నేడో రేపో అరెస్టవుతారా? ఆయన అరెస్టు నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇంతకూ ఆయనను ఏపీ పోలీసులో, తెలంగాణ పోలీసులో అరెస్టు చేయబోవడం లేదు. ఉత్తర ప్రదేశ్ నుంచి పోలీసులు వచ్చి ఆయనను అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంతకీ యూపీ పోలీసులు రామగోపాల వర్మను ఎందుకు అరెస్టు చేస్తారంటారా? అయితే ఈ విషయం తెలియాల్సిందే. రామగోపాల వర్మ ఇటీవల ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ట్వీట్టర్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె పేరును దృష్టిలో పెట్టుకుని పాండవులు, కౌరవులు అంటూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన జ్వాలలు ప్రజ్వరిల్లాయి. అన్ని వైపుల నుంచీ విమర్శలు వెల్లువెత్తడంతో రామ గోపాల వర్మ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు పేర్కొంటూ సదరు ట్వీట్ ను తొలగించారు.

అయితే ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ నేతలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో యూపీ పోలీసులు రామగోపాల వర్మపై కేసు నమోదు చేశారు. ఇటువంటి ఫిర్యాదులు తెలుగు రాష్ట్రాలలోనూ వచ్చినా..అవేవీ కేసు నమోదు వరకూ వెళ్లలేదు. అయితే యూపీలోని లక్నోలో మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడే అందరికీ ఆయన అరెస్టు అనివార్యమని అనిపిస్తోంది. ఎందుకంటే.. యూపీలో బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడం, పోలీసులు వెంటనే కేసు నమోదు చేయడంతో బీజేపీ రామగోపాల వర్మ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుందని అర్ధమౌతోంది.

ముఖ్యంగా రామగోపాల వర్మ వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆగ్రహంతో ఉన్నారనీ, ఇష్టారీతిన సామాజిక మాధ్యమంలో తోచిన వ్యాఖ్యలు పోస్టు చేయడం సరికాదని అర్ధమయ్యే రీతిలో బుద్ధి చెప్పాలని ఆయన తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు. పైగా స్వయంగా ప్రధాని మోడీ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థిపై రామ్ గోపాల్ వర్మ ఆకతాయిలా వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతలకు ఆగ్రహం కలిగించిందనీ, అందుకే కఠినంగా వ్యవహరించే యోగి సీఎంగా ఉన్న రాష్ట్రాన్ని ఎంచుకుని మరీ రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేసి కేసు నమోదయ్యేలా చూశారనీ పరిశీలకులు అంటున్నారు.

కేసు ఎటూ నమోదైంది కనుక ఇక నేడో రేపో యూపీ పోలీసులు ఆయనను అరెస్టు చేసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ముర్ముపై వ్యాఖ్యల విషయంలోనే కాకుండా... రామ్ గోపాల వర్మ గతంలో హిందూ దేవుళ్లపై సెటైర్లు వేస్తూ చేసిన ట్వీట్లపై కూడా బీజేపీ ఆగ్రహంగా ఉంది. ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ హిందూ దేవుళ్లపై సెటైర్లను సహించరని అంటారు. ఈనేపథ్యంలోనే  ఆర్జీవీ ద్రౌపది ముర్ముపై చేసిన అనుచిత వ్యాఖ్యలను అవకాశంగా తీసుకుని ఆయనకు గుణపాఠం చెప్పాలని బీజేపీ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.