బ్రేకింగ్ న్యూస్‌.. బుద్దా వెంక‌న్న అరెస్ట్‌.. హైటెన్ష‌న్‌..

ఏపీ పోలీసుల ఒంటెత్తు పోకడలు కొనసాగుతూనే ఉన్నాయి. విచారణ పేరుతో విజయవాడ టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్నను అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి, కొడాలి నాని, ఏపీ డీజీపీలపై విమర్శలు గుప్పించారన్న కారణం మీద పోలీసులు బుద్ధా వెంకన్న ఇంటికి చేరుకొని అరెస్టు చేసి వన్ టౌన్ ఠాణాకు తరలించారు. వెంకన్న అరెస్టుతో టీడీపీ శ్రేణులు  ఆందోళనకు దిగారు. వెంకన్న అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రాష్ట్రంలో విపరీతమైన అణచివేత కొనసాగుతోందని, పోలీసులు కూడా అధికార పార్టీ కనుసన్నల్లోనే వ్యవహరిస్తున్నారని నినాదాలు చేశారు. గుడివాడ ఘటన తరువాత టీడీపీ నేతల విమర్శలను కూడా జీర్ణించుకోలేకపోతున్న పోలీసులు.. తామేం చేసినా చూస్తూ ఉండాల్సిందే తప్ప ఎదురు ప్రశ్నిస్తే ఎందాకైనా వస్తామన్నట్టుగా వారి ప్రవర్తన ఉందన్న వ్యాఖ్యానాలు ఈ అరెస్టు తరువాత వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కె.కన్వెన్షన్ ఎపిసోడ్ కు కొనసాగింపుగా కొడాలి నానిపై, రాష్ట్ర పోలీసు బాసు డీజీపీ గౌతమ్ సవాంగ్ పై విమర్శలు ఎక్కుపెట్టినందుకు బుద్ధా వెంకన్నను అరెస్టు చేశారు. ఇందుకోసం ఖాకీ యంత్రాంగం అంతా వెంకన్న ఇంటికి పెద్దసంఖ్యలో కదిలివచ్చింది. 

పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారంటూ తీవ్రస్థాయిలో ఆక్రోశం వెళ్లగక్కిన టీడీపీ నేతలను వివరణల పేరుతో అరెస్టు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ అరెస్టులు ఒక్క వెంకన్నతోనే ఆగిపోవని, మరిన్ని అరెస్టులతో ప్రతిపక్షంలో భయాందోళనలు రేపే కుట్ర జరుగుతోందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వెంకన్న కామెంట్లను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు అసలు కొడాలి నాని కామెంట్లను ఎందుకు కౌంట్ లోకి తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు. పార్టీ అధినేత మీద ఎంత దారుణంగా మాట్లాడాడో ప్రపంచమంతా చూసింది. అయినా పోలీసులకు ఆ విషయమే తెలియనట్టు.. కేవలం బుద్ధా వెంకన్న కామెంట్లను మాత్రమే కౌంట్ లోకి తీసుకోవడం విడ్డూరమన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వెంకన్న అరెస్టు తరువాత టీడీపీ నేతల భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉంటుందన్న విషయం ఆసక్తికరంగా మారింది.