4 ద‌శాబ్దాల స్వ‌ప్నం.. హాకీలో ఒలింపిక్ ప‌త‌కం.. చెక్‌దే ఇండియా..

భార‌త జాతీయ క్రీడ ఏంటి? నేటి యువ‌త క్రికెట్ అనుకుంటారేమో. హాకీ అని ఎంత మందికి తెలుసు? అలాంటి జాతీయ క్రీడ‌ను క్రికెట్ పూర్తిగా స్వాహా చేసేసింది. దేశంలో హాకీ ప్రాభ‌వం క‌నుమ‌రుగైంది. ఆద‌ర‌ణ లేక‌పోవ‌డంతో హాకీపై ఆస‌క్తి క‌న‌బ‌రిచే వాళ్ల సంఖ్య బాగా త‌గ్గిపోయింది. నాణ్య‌మైన కోచింగ్ సైతం అందుబాటులో ఉండ‌దు. పంజాబ్ రాష్ట్రం పుణ్యమా అని హాకీ అంతోఇంతో బ‌తికే ఉంది. 41 ఏళ్లుగా ఒలింపిక్స్‌లో మ‌నోళ్లు నిరాశే మిగిలిస్తున్నారు. అలాంటిది.. ఫినిక్స్ ప‌క్షిలా టోక్యో ఒలింపిక్స్‌లో దుమ్మురేపుతూ.. హాకీలో ఇండియా స‌త్తా ఏంటో చాటుతూ.. అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేశారు. కాంస్య ప‌త‌కంతో క‌నువిందు క‌లిగించారు. పున‌ర్‌వైభ‌వం దిశ‌గా.. భార‌త‌మాత‌ మెడ‌ను బ్రాంజ్‌ మెడ‌ల్‌తో అలంక‌రించారు. 

4 ద‌శాబ్దాల తర్వాత ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందించింది హాకీ ఇండియా. ఉత్కంఠ‌భ‌రితంగా జర్మనీతో జరిగిన కాంస్య పోరులో అద్భుత‌ విజయం అందుకుంది. బలమైన ప్రత్యర్థిని 5-4 తేడాతో ఓడించింది. ఇండియా త‌ర‌ఫున సిమ్రన్‌ జీత్‌ సింగ్‌, హార్దిక్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, రూపిందర్‌ పాల్‌ సింగ్‌ గోల్స్‌ చేశారు. 

స్వర్ణం చేజారింద‌నే బాధ‌తో బ‌రిలో దిగిన టీమ్ఇండియా.. ఈ మ్యాచ్‌లో ఆద్యంతం దూకుడుగా ఆడింది. ఆట ఆరంభమైన రెండో నిమిషంలోనే జర్మనీ గోల్ కొట్టి భార‌త్‌పై ఒత్తిడి పెంచింది. రెండో క్వార్ట‌ర్‌లో భార‌త్ రెచ్చిపోయింది. ఏకంగా మూడు గోల్స్ చేసింది. ఇండియా ఆట‌గాళ్ల పొర‌బాట్ల వ‌ల్ల జ‌ర్మ‌నీకి సైతం గోల్స్ వ‌చ్చాయి. ఆట ముగిసే స‌రికి 5-4 తేడాతో హాకీ ఇండియాదే విజ‌యం. 41 ఏళ్ల త‌ర్వాత చ‌రిత్ర‌లో నిలిచేలా ఒలింపిక్స్ కాంస్య‌ ప‌త‌కం. క‌నీసం ఒలింపిక్స్ మెడ‌ల్ సాధించాకైనా.. ఇండియాలో జాతీయ క్రీడ‌కు పున‌ర్‌వైభ‌వం సాధ్య‌మేనా? క్రికెట్ క్రేజ్‌ను త‌ట్టుకుని హాకీ నిల‌బ‌డ‌గ‌ల‌దా?