సీఎం మాత్ర‌మే సేఫ్‌! సామాన్యుల ర‌క్ష‌ణ మాటేంటి? బ‌్లేడ్ బ్యాచ్ దొరికేనా?

తాడేప‌ల్లిలో ముఖ్య‌మంత్రి నివాసం. ఆయ‌న ప్యాలెస్ మాత్రం ఫుల్ సేఫ్‌. ప్ర‌జావ్య‌తిరేక‌త విప‌రీతంగా ఉండ‌టంతో సీఎం ఇంటి చుట్టుప‌క్క‌ల ‌టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పోలీసుల క‌న్నుగ‌ప్పి చీమ కూడా అటువైపు వెళ్ల‌లేదు. సీఎం ఇల్లు మాత్ర‌మే సేఫ్‌గా ఉంటే స‌రిపోతుందా? రాష్ట్రమంతా సుర‌క్షితంగా ఉండాల్సిన ప‌నిలేదా? ఎక్క‌డి వ‌ర‌కో ఎందుకు.. ముఖ్య‌మంత్రి ఇంటికి జ‌స్ట్ కిలోమీట‌రున్న‌ర దూరంలోనే దారుణ అత్యాకాండ జ‌రిగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ ప్రాంతం అరాచ‌క శ‌క్తుల‌కు అడ్డాగా మారడంపై ఎందుకు ఉదాసీనంగా ఉంటోంది ఈ ప్ర‌భుత్వం. తాడేప‌ల్లి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో, కృష్ణాన‌ది తీరంలో ఇటీవ‌ల కాలంలో వ‌రుస‌గా నేరాలు-ఘోరాలు జ‌రుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్న‌ట్టు? జ‌గ‌న్ ఇంటికి మాత్ర‌మే కాప‌లా కాస్తే స‌రిపోతుందా? ఆ ప‌క్క‌నే అఘాయిత్యాలు జ‌రిగినా, హ‌త్య‌లు జ‌రిగినా ప‌ట్టించుకోరా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు ప్ర‌జ‌లు.

తాడేపల్లి పుష్కరఘాట్‌లో జ‌రిగిన అత్యాచార ఘ‌ట‌న‌లో నిందితులెవ‌రో ఇంకా గుర్తించ‌లేక‌పోయారు పోలీసులు. ప్ర‌త్యేక బృందాల‌తో గాలిస్తున్నా.. బ్లేడ్ బ్యాచ్‌పై అనుమానం ఉన్నా.. ద‌ర్యాప్తు ముందుకు సాగ‌డం లేదు. ఇప్పటికే విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లోని రౌడీషీటర్లు, ఇతర అనుమానితులను విచారిస్తున్నారు. ఒక అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే బాధితురాలికి కాబోయే భర్తను కూడా విచారించినా.. అతని పాత్ర ఏమీ లేదని తేల్చినట్టు సమాచారం.

ఘటనపై సీఎం జ‌గ‌న్ తీరిగ్గా స్పందించారు. పోలీస్ అధికారులను ఆరాతీశారు. హోంమంత్రి సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితను జీజీహెచ్ కు పంపారు. ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించి ధైర్యం చెప్పారు మ‌హిళా మంత్రులు. బాధితురాలికి 5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించింది ప్ర‌భుత్వం. మహిళల భద్రత కోసం అనేక చట్టాలున్నా ఉన్మాదులు రెచ్చిపోతున్నారని హోంమంత్రి సుచరిత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్ వినియోగం ఎక్కువైందన్న సమాచారం ఉంద‌న్నారు హోంమంత్రి. ఆ ప్రాంతంలో నిఘా పెంచినట్లు సుచరిత చెప్పారు. 

స్వ‌యాన హోంమంత్రే తాడేప‌ల్లి పరిస‌ర ప్రాంతాల్లో గంజాయి, డ్ర‌గ్స్ బ్యాచ్‌లు ఉన్నాయ‌ని అన‌టం ప్ర‌భుత్వ చేత‌గానిత‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని ప్ర‌తిప‌క్షం మండిప‌డుతోంది. ప్ర‌మాదం ఉంద‌ని తెలిసినా.. నేరం జ‌రిగే వ‌ర‌కూ ఎందుకు ఉపేక్షించార‌ని నిల‌దీస్తున్నారు. తాగుబోతులు, దోపిడీ ముఠాలు, బ్లేడ్ బ్యాచ్‌లు.. సీఎం ఇంటి స‌మీప ప్రాంతాల్లోనే సంచ‌రిస్తుండ‌టం.. ముఖ్య‌మంత్రి ఇంటి చుట్టుప‌క్క‌ల ప్రాంతాలు అరాచ‌క‌, అసాంఘీక కార్య‌క‌లాపాల‌కు అడ్డాగా మారడం దారుణ‌మైన విష‌య‌మ‌ని నిందిస్తున్నారు. 

ఇక ఆదివారం జ‌రిగిన ఉదంతం అత్యంత దారుణం. కాబోయే భ‌ర్త‌తో క‌లిసి సీతానగరం పుష్కరఘాట్‌లో విహారానికి వెళ్లిన యువ‌తిపై ఇద్ద‌రు దుండ‌గులు అత్యాచారానికి పాల్ప‌డ‌టం క‌ల‌క‌లం రేపింది. ఆ జంట‌పై ఇద్ద‌రు దుర్మార్గులు వెనుక నుంచి దాడి చేయ‌డం.. యువకుడి చేతులు కాళ్లు కట్టేసి... బ్లేడ్‌తో గొంతు కోస్తామ‌ని బెదిరించి.. యువతిని ఇసుక‌లో వేసి ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అత్యాతారం చేయ‌డం దారుణం. ఆ త‌ర్వాత దుండ‌గులు బాధితురాలి‌ చెవి రింగులు, డబ్బులు, సెల్ ఫోన్ తీసుకొని.. నాటుపడవలో నదిలోంచి విజ‌య‌వాడ‌వైపు పారిపోగా.. వారికోసం విస్తృతంగా గాలిస్తున్నారు పోలీసులు. ఎలాంటి ఆధారాలు లేని ఈ కేసును చేధించ‌డం ఖాకీల‌కు స‌వాల్‌గా మారింది. పాత నేర‌స్తుల‌ను, అనుమానితుల‌ను ప్ర‌శ్నిస్తూ.. ఆ దిశ‌గా కేసును కొలిక్కితెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా తాడేప‌ల్లి ప‌రిస‌ర ప్రాంతాల‌ను నేర ర‌హితంగా, ప్ర‌శాంతంగా మార్చాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. 
సీఎం మాత్ర‌మే సేఫ్‌గా ఉంటే స‌రిపోదు.. సామాన్యులూ సుర‌క్షితంగా ఉండేలా చేయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిదే. మ‌రి, మ‌రో దారుణం జ‌ర‌గ‌కుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటారా? పుష్క‌ర‌ఘాట్ కేసును వెంట‌నే సాల్వ్ చేస్తారా?