బీజేపీ, వైసేపీలది సహజీవనం బంధం!

ఒక్కప్పుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  రాజకీయాలలో కమ్యూనిస్ట్ పార్టీలు కీలక భూమికను పోషించాయి. అయితే, అంతతా గతించిన చరిత్ర. ఈరోజు, ఏపీలోనే కాదు,దేశంలో (ఒక్క కేరళలో మినహా) కమ్యూనిస్ట్ పార్టీలు పూర్వ వైభాన్ని పూర్తిగా కోల్పోయాయి. ఒకప్పుడు వామపక్ష కూటమికి కంచు కోటలుగా నిలిచిన, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలలోనూ లెఫ్ట్ ఫ్రంట్ అధికారం కోల్పోయింది. ఒక్క కేరళలో మాత్రమే కమ్యూనిస్టులు ఇంకా అధికారంలో ఉన్నారు. 

ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, లెఫ్ట్ పార్టీలు పూర్వ వైభవాన్ని ఎప్పుడో  కోల్పోయాయి. అయినా, ఇటు  ఏపీలో అటు తెలంగాణాలో లెఫ్ట్ పార్టీ నేతలు, చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా, టీవీ చర్చల్లో, ఇతరత్రా  సంచలన వ్యాఖ్యలు చేస్తూ, వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ-బీజేపీ స్నేహం మరోసారి చర్చనీయాంశమైన నేపధ్యంలో సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి, రామకృష్ణ ఆ రెండు పార్టీల రిలేషన్ షిప్ పై కొంచెం చాలా ఘాటుగా స్పందించారు, సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజమే, బీజేపీ, వైసీపీల మధ్య రాజకీయ సంబంధాలు ఎలా ఉన్నప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మాత్రం మూడు ముద్దులు, ఆరు హగ్గులు లెక్కన సీక్రెట్ లవ్ స్టొరీలా సాగిపోతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులతోనే ఏపీ సీఎం జగన్ రెడ్డిని సిబిఐ, ఈడీలు  దత్తపుత్రునిగా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషించడమే కాదు, జనబాహుల్యం సైతం అనుకుంటున్నారు.  అదలా ఉంటే, తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సంయుక్తంగా భీమవరంలో ఏర్పాటు చేసిన  అల్లూరి జయంతి వేడుకల్లో అదే విషయం మరోమారు స్పష్టమైంది. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటుగా, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, కేంద్ర  మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కేఆర్ రోజా పాల్గొన్న ఈ కార్యక్రమం విప్లవ వీరుని జయంతి వేడుకలా కాకుండా, రెండు పార్టీల మ్యారేజ్ రిసెప్షన్ లా ఉందనే విమర్శలు కూడా వచ్చాయి.

అయితే, ఈ విమర్శలకు సిపిఐ రామకృష్ణ మరింత మసాల కలిపి చేసిన విమర్శ, కొంత వివాదస్పదం అయింది. నిజమే, వైసీపీ-బీజేపీ బంధంపై వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ అందులో దాపరికమేమీ లేదని చేసిన వ్యాఖ్యల ఆధారంగా, సీపీఐ రామకృష్ణ ఘాటుగా స్పందించారు. వైసీపీ-బీజేపీ బంధం పెళ్లి కాకుండా సహజీవనం చేస్తున్నట్లుగా ఉందన్నారు. అలా అని వదిలేస్తే ఎలా ఉండేదో కానీ, ఆయన వైసీపీ-బీజేపీ పొత్తుపై మరో ఆసక్తికర, అనుచిత పోలిక కూడా తెచ్చారు.

వైసీపీ-బీజేపీ బంధం నరేష్-పవిత్ర మాదిరిగా పెళ్లి కాకుండా సహజీవనం చేస్తున్నట్లుగా ఉందన్నారు. మూడు సంవత్సరలుగా బీజేపీ, వైసీపీ రంకు రాజకీయం నడుపుతున్నారని రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో, బీజేపీ, వైసీపీల బంధం గురిచి, రామకృష్ణ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, ఓకే కానీ, రాజకీయాలతో సంబంధం లేని, నరేష్-పవిత్రలను రాజకీయ రొంపిలోకి లాగడం ఏమిటని, సోషల్ మీడియాలో  నెటిజనులు ప్రశ్నలు సంధిస్తున్నారు.