రజినీకాంత్ కు బీజేపీ గవర్నర్ తాయిలం?

రాజకీయంగా ఎత్తులు వేయడంలో బీజేపీ అందెవేసిన చెయ్యి అనడంలో సందేహం లేదు. అందులోనూ మోడీ- షా ద్వయం ఇలాంటి విషయాల్లో ప్రదర్శించే చాణక్య నీతి గురించి చెప్పనక్కర్లేదు. దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలో తప్ప ఇంకెక్కడా కాలు మోపేందుకు వీలు లేక బీజేపీ నేతలు ఎత్తుల మీద ఎత్తులు వేస్తూనే ఉన్నారు. బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన దక్షిణాది రాష్ట్రాలలో ఒకటైన తమిళనాడులో బలపడాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ కు బీజేపీ డబుల్ ఇంజిన్ గాలం వేసింది. రజినీకాంత్ కు గవర్నర్ పదవి ఇచ్చి, తమిళనాడులో పాగా వేయాలనే వ్యూహానికి పదును పెట్టిందని సమాచారం. అందుకోసం రజినీకాంత్ కూడా సరే అన్నట్లు తమిళనాడులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

నిజానికి తమిళనాడులో సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రజినీకాంత్ వస్తారనే ప్రచారం చాలా ఏళ్లుగా జరుగుతోంది. ఈ క్రమంలోనే రజినీకాంత్ తన అభిమానులు, అభిమాన సంఘాలతో పలుమార్లు భేటీలు నిర్వహించారు. ఆ తర్వాత ‘మక్కల్ సేవాయ్ కచ్చి’ పేరుతో రాజకీయ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. దానికి ఎన్నికల సంఘం ‘ఆటో రిక్షా’ గుర్తును కూడా కేటాయించింది. అయితే.. ఆ తర్వాత అది రాజకీయ పార్టీ కాదని, కేవలం తన అభిమాన సంఘాల సమాఖ్య మాత్రమే అని రజినీకాంత్ ప్రకటించారు. అనంతరం దాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు రజినీ కాంత్ తెలిపారు.

రజినీకాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా ఉండడానికి ఆరోగ్యం సహకరించకపోవడం, ఇతర సమస్యలే కారణం అంటారు. అయితే.. ఇప్పుడు బీజేపీ ఇచ్చిన ఆఫర్ ను రజినీ అంగీకరించడానికి కారణం లేకపోలేదంటున్నారు. గవర్నర్ పదవి అయితే.. ఏ పార్టీలోనూ చేరే పని ఉండదనే ఉద్దేశంతోనే రజినీకాంత్ బీజేపీ ఆఫర్ కు సానుకూలంగా స్పందించారనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు రజినీకాంత్ ఇటీవల వేస్తున్న అడుగులు కూడా  బలం చేకూరుస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్న రజినీకాంత్.. ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, దేశ రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అవడం రజినీకాంత్ కు గవర్నర్ పదవి అన్న ప్రచారానికి బలం చేకూరుస్తోంది. ఆ తర్వాతి రోజున తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవితో కూడా రజినీకాంత్ భేటీ అయ్యారు. ఇలాంటి పరిణామాలన్నీ రజినీకాంత్ కు గవర్నర్ పదవి ఖాయం అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవడానికి కారణమయ్యాయి.

వాస్తవానికి ప్రధాని మోడీ- రజినీకాంత్ మధ్య మంచి స్నేహ బంధమే ఉంది. అందుకే ఇటీవల ప్రధాని మోడీ చెన్నై వెళ్లినప్పుడు రజినీకాంత్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు.  రజినీకాంత్ కు తమిళనాడులో లక్షలాది మంది అభిమానులున్నారు. వందలాది అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. ఒక్క పిలుపు ఇస్తే.. మారు మాటేదీ మాట్లాడకుండా రజినీకాంత్ ను అనుసరించే అభిమాన జనం తమిళనాడు వ్యాప్తంగా ఉన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ మోడీ-షా ద్వయం సరిగ్గా ఇదే పాయింట్ ను బీజేపీకి అనుకూలంగా మార్చేందుకు వ్యూహం పన్నిందని, రజినీకాంత్ కు గవర్నర్ పదవి కట్టబెట్టి.. తమిళ ఓట్లను పెద్ద సంఖ్యలో కొల్లగొట్టాలని, తద్వారా ఆ రాష్ట్రంలో కూడా అధికార పగ్గాలు చేపట్టాలని పావులు కదుపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.