ఈటలకు బీజేపీ హ్యాండిచ్చిందా? అనారోగ్యానికి అదే కారణమా? 

తెలంగాణ రాజకీయం మొత్తం హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతుంటే.. హుజూరాబాద్ రాజకీయం మొత్తం మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్ధి, ఈటల రాజేందర్ చుట్టూ తిరుగుతోంది. ఈ ఉప ఎన్నికకు మూల కారణం ఆయనే కావడం అందుకు ఒక కారణం. ఇంతవరకు అధికార తెరాస సహా ఇతర పార్టీలు ఏవీ ప్రత్యక్ష ప్రచారంలో పెద్దగా కాలుపెట్టక పోవడంతో అందరి దృష్టి ఈటల మీదనే వుంది. నిజానికి ఈటలకు థీటుగా నిలిచే అభ్యర్ధి కోసం తెరాస, కాంగ్రెస్  ఇక్కడా అక్కడా వెతుక్కుంటున్నాయి. ఇంకా ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందనే విషయంలో స్పష్టత లేక పోవడం వలన కూడా ఇతర పార్టీలు నింపాదిగా పావులు కదుపుతున్నాయి. ప్రత్యర్ధుల బలబలాను బేరీజు వేసుకుంటూ వ్యూహాత్మకంగా ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. 

ఈటల రాజేందర్ కొంత గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్నారు. కార్యకర్తల సమావేశాలు, పెద్దలతో మీటింగులు పూర్తి చేసుకున్నారు. ప్రజా దీవెన పేరిట పాదయాత్రను ప్రారంభించారు. అయితే అనుకోకుండా ఆయన అనారోగ్యానికి గురికావడంతో పన్నెండు రోజులు (222 కిలోమీటర్లు) సాగిన పాదయాత్రకు బ్రేక్ పడింది. అయితే ఆరోగ్యం సహకరించగానే పాదయాత్ర ఎక్కడ (వీణ‌వంక మండ‌లం పోతిరెడ్డిప‌ల్లి గ్రామం) ఆగిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభిస్తానని ఈటల ప్రకటించారు.  

ఎన్నికల షెడ్యూలు దూరమయ్యే కొద్దీ, ఈటల రాజేందర్ లో ఆందోళన పెరుగుతోందని, ఆయన అనారోగ్యానికి అది కూడా ఒక కారణం కావచ్చని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ముఖ్యంగా, బీజేపీ నుంచి ఆయన ఆశించిన మేరకు సహకారం లభించడం లేదని అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ  రాష్ట్ర నాయకులలో ఒక వర్గం అంతగా చొరవ చూపడం లేదని అంటున్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం పట్ల బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేసిన హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పార్టీ మారకుండా చేయడంలో పార్టీ నాయకత్వం విఫలమైందని ఈటల అనుచరులు భావిస్తున్నారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్, కరీంనగర్ జిల్లాకు చెందిన బీజీపీ సీనియర్ నాయకుడు సీహెచ్ విద్యాసాగర రావు కొంత చొరవ తీసుకుని పెద్ది రెడ్డిని తమ వద్దకు పిలిపించుకుని సముదాయించి, పార్టీలో కొనసాగేందుకు ఒప్పించారు. అయినా  పార్టీ రాష్ట్ర నాయకులు ఆశించిన రీతిలో స్పందించక పోవడం వల్లనే పెద్ది రెడ్డి, తెరాసలో చేరారని ఈటల అనుచరులు అంటున్నారు. 

ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా ఈటల ఎంట్రీ విషయంలో బీజేపీలో భిన్నాభిప్రాయమే ఉందని, అదే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోందని ఈటల అనుచరులు, అభిమానులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన జిల్లా  స్థాయి నాయకుల మొదలు రాష్ట్ర స్థాయి నేతల వరకు కొందరు ఈటలకు దూరంగానే ఉంటున్నారని, రోజులు గడిచే కొద్దీ దూరం ఇంకా పెరుతోందనే మాట కూడా వినిపిస్తోంది.  దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూపిన చురుకుదనం, చొరవ హుజూరాబాద్ లో కనిపించడం లేదని ఈటల అనుచర వర్గం అంటోంది. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. జిల్లాకు చెందిన  జాతీయ నాయకుడు మురళీధర రావు ఇతర సీనియర్ నాయకులు ఎవరూ ఇంతవరకు నియోజకవర్గంలో కాలు పెట్టలేదు. ఈటల పాదయాత్రకు మద్దతుగా ఆయనతో కలిసి పదడుగులు నడవలేదు. పాదయాత్ర పూర్తిగా ఈటల వ్యక్తిగత వ్యవహరంగానే సాగుతోంది. రాష్ట్ర నాయకులు ఎవరూ ఆసక్తి చూపక పోవడంతో, స్థానిక నాయకులు కార్యకర్తలు కూడా పాదయాత్ర తమ ఇంటిముందు నుంచి వెళుతున్నా పట్టించుకోవడంలేదని.. అందుకే  బీజేపీలో చేరి  ఈటల తప్పు చేశారా అన్న అనుమానం కలుగుతోందని, ఈటల సన్నిహిత నేత ఒకరు అనుమానం వ్యక్తపరిచారు.    

దుబ్బాక ఉపఎన్నిక,హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒకటి కాదు, ఏ ఎన్నికకు ఆ ఎన్నిక ప్రత్యేకం. దేని వ్యూహం దానికుంటుంది. అదీగాక, హుజూరాబాద్ ఉప ఎన్నిక కుంపటి ఇంకా రాజుకోలేదు ... ఒకసారి రాజుకుంటే ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవడం ఉండదు. అమిత్ షా సహా కేంద్ర నాయకులు ప్రచారానికి వస్తారు. ఆగష్టు 13తో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. ఈలోగా, ఉప ఎన్నికల  షెడ్యూలు విషయంలోనూ కొంత స్పష్టత వస్తే  వస్తుంది. ఇక, ఆ తర్వాత ఏది జరగాలో అది జురుగుతుంది. అయితే, కొదరు రాజకీయ ప్రత్యర్ధులు, ముఖ్యంగా తెరాస సోషల్ మీడియా పుకార్లు పుట్టిస్తోంది.. కానీ, మాకు క్లారిటీ ఉంది. ఈటలకు విశ్వాసం వుంది. చివరకు ధర్మం విజయం సాధిస్తుంది,అని అయన ముక్తాయింపు నిచ్చారు. అయితే, ఇప్పటికైతే ఈటల ఒంటరిగా ఫీల్ అవుతున్నారు . ఆయన అనుచర వర్గం బీజేపీని, బీజేపీ అనుచరులు అయన అనుచర గణాన్ని అనుమానంగా చూస్తున్నారు. ఇది మాత్రం నిజం.