కేంద్రాన్ని మెచ్చుకున్నా కౌంటర్లేనా! బీజేపీకి ఆ నేత భారమేనా! 

ప్రజలు బాగోగులు, రాష్ట్ర అభివృద్ధి వారికి పట్టదా? వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీనే ఫణంగా పెడుతున్నారా? సొంత పార్టీ కార్యకర్తలు ఛీదరించుకుంటున్నా తమ తీరు మార్చుకోరా?. ఆంధ్రప్రదేశ్  బీజేపీలోని  కొందరు నేతల తీరుతో ఇప్పుడు ప్రజల నుంచి ఇలాంటి ప్రశ్నలే వస్తున్నాయి. 

ఏపీ బీజేపీ నేతలు సొంత పార్టీకే సున్నం పెట్టేలా తయారవుతున్నారనే చర్చ జరుగుతోంది. అధికార వైసీపీకి మద్దతు పలుకుతూ తమ రాజకీయ పబ్బం గడపుకుంటున్న కొందరు కమలం నేతలు..  రోజురోజుకు మరింత దిగజారుతున్నరనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్దన్ రెడ్డి తీరు మరీ విచిత్రంగా ఉంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ ను ప్రశంసించిన వారిని ఆయన టార్గెట్ చేయడం రాజకీయ వర్గాలను విస్మయ పరుస్తోంది. వైసీపీ ప్రాపకం కోసం మోడీ చేసిన అభివృద్ధిపైనా విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్లు చేయడం ఏపీ కమలం దుస్థితికి అద్ధం పడుతోంది. 
   

టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ పరోక్షంగా వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేలా ఎప్పుడూ మాట్లాడుతుంటారు విష్ణువర్ధన్ రెడ్డి. ఇటీవల ఆయన మరీ బరి తెగిస్తున్నారు. బీజేపీ కంటే వైసీపీ అధికార ప్రతినిధి మాట్లాడుతున్నట్లుగానే ఆయన ప్రెస్ మీట్లు ఉంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఆయన కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తూ విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టడం  కాక రేపుతోంది. బెజవాడ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభంపై ప్రకటన చేసిన నాని.. ఏపీ అభివృద్ధి విషయంలో 2014-19 మధ్యకాలం ఏపీకి స్వర్ణయుగమని, ఆ అయిదేళ్లు రాష్ట్రం ముఖచిత్రం మారిపోయే ప్రాజెక్టులు వచ్చాయని చెప్పారు. ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబుతోపాటు నాటి కేంద్రమంత్రులకు దక్కుతుందని, బీజేపీ చాలా సపోర్ట్ గా నిలిచిందని చెప్పుకొచ్చారు.

 

అయితే చంద్రబాబు, టీడీపీపై ఎప్పుడెప్పుడు విమర్శలు చేయాలా అనే చూసే విష్ణువర్ధన్ రెడ్డి వెంటనే స్పందించారు. కేశినేని నానికి కౌంటరిచ్చారు. ఏమండోయ్ నాని గారు.. మీ బాబు గతంలో బిజెపి గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఏమి చేయలేదని, అందుకే నేను నారక్తం మరిగిపోయి నాడు బిజెపిని, కేంద్రాన్ని విభేదించి బయటకు వచ్చానని చెప్పారు.. నేడు మీరెమేూ గతఐదేళ్లు స్వర్ణ యుగం కేంద్రమంత్రులందరు రాష్ట్రానికి అండగా నిలిచారని చెబుతున్నారంటూ ట్వీట్ చేాశారు. ఎంపీ కేశినేని నాని కామెంట్లకు కౌంటర్ గా విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ బీజేపీతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

కేశినేని నాని మోడీ సర్కార్ ను ప్రశంసిస్తూ కామెంట్లు చేయడం విష్ణువర్ధన్ రెడ్డి నచ్చడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. నానిని తప్పుపడుతున్నారంటే.. గత ఐదేండ్లలో ఏపీకి మోడీ సర్కార్ ఏం చేయలేదని విష్ణువర్ధన్ రెడ్డి అభిప్రాయంగా ఉన్నంటుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీకి బీజేపీ ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చిందని చెబితే అభినందించాల్సింది పోయి కార్నర్ చేయడమేంటనీ కొందరు బీజేపీ నేతలు కూడా ఫైరవుతున్నారట. చంద్రబాబును విమర్శించాలనే ఆతృతతో మోడీ సర్కార్ ను కేశినేని ప్రశంసించిన విషయాన్ని..  విష్ణువర్ధన్ రెడ్డి పక్కనపెట్టారనే వ్యాఖ్యలు కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. చంద్రబాబును టార్గెట్ చేయడంలో తప్పు లేదు కాని.. తమ పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యవహరించడమేంటనే చర్చ ఏపీ కమలనాధుల్లో కనిపిస్తోంది. మొత్తంగా విష్ణువర్ధన్ రెడ్డి తీరుతో ఏపీ బీజేపీ తీవ్రంగా నష్టపోతుందనే చర్చ   ఆ పార్టీలో జరుగుతోంది. ఆయన్ను కంట్రోల్ చేయకపోతే పార్టీకి పూడ్చలేని నష్టం జరుగుతుందని కొందరు బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.