ఆస్తుల్లో కమలం.. అప్పుల్లో హస్తం

ఒకప్పుడు దేశంలో సంపన్న రాజకీయ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పేరే వినిపించేంది. ఆ తర్వాత పేదల పార్టీ కమ్యూనిస్ట్ పార్టీల వార్షిక టర్నోవర్ కొంత ఘనంగానే ఉండేదని అంటారు. అయితే ఇప్పుడు దేశ రాజకీయం కొత్త మార్గంలో ముందుకు సాగుతున్న నేపధ్యంలో  ప్రజాదరణ, ఓట్లు సీట్ల లెక్కలు మారినట్లుగానే, ఆదాయ వ్యయం లెక్కలు కూడా మరాయి. మారుతున్నాయి. ఒకప్పుడు ఆదాయంలో అగ్ర స్థానలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పు అప్పుల్లో ఫస్ట్ ప్లేస్’లో ఉంది. దేశాన్ని,మూడింట రెండు వంతుల రాష్ట్రాలను పాలిస్తున్న బీజేపీ, ఆదాయం, ఆస్తులు కూడా అదే రేంజ్’లో పెంచుకుంటోంది. దేశంలోని ఏడు జాతీయ పార్టీల్లో బీజేపీ ఆస్తుల విలువ ఇంచుమించుగా రూ. 5,000 కోట్లకు చేరుకుంది.
2019-20 సంవత్సరానికి సంబంధించి దేశంలోని 7 జాతీయపార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్.. ఏడీఆర్ వెల్లడించింది.ఈ నివేదిక ప్రకారం దేశంలో బీజేపీకి అత్యధికంగా రూ. 4,847.78కోట్ల మేర ఆస్తులున్నట్లు వెల్లడైంది.ఆ తర్వాతి స్థానంలో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ నిలిచింది. ఆ పార్టీకి రూ. 698.33కోట్ల ఆస్తులున్నట్లు నివేదికలో వెల్లడైంది. ఇక రూ. 588.16 కోట్ల విలువైన ఆస్తులతో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో ఉంది. జాతీయ పార్టీల మొత్తం ఆస్తుల విలువలో బీజేపీ వాటా 69.37శాతం ఉన్నట్లు ఏడీఆర్ స్పష్టం చేసింది. ఫిక్స్డ్ డిపాజిట్లు, రుణాలు, ముందస్తు చెల్లింపులు, పెట్టుబడులు తదితర వివరాల ప్రాతిపదికన ఈ ఆస్తుల విలువ లెక్కగట్టారు.
ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే, ఉత్తర ప్రదేశ్’ను మూడు నాలుగు సార్లు పాలించిన ములాయం/ అఖిలేష్ యాదవ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఫస్ట్ ప్లేస్’లో ఉంటే, తెలంగాణలో ఉద్యమ పార్టీగా అవతరించి కుటుంబ పార్టీగా ఎదిగిన కేసీఆర్/కేటేఆర్ పార్టీ తెరాస రండవ స్థానంలో ఉంది. తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే మూడో స్థానంలో నిలిచింది. ప్రాంతీయ పార్టీలలో ఫస్ట్ ప్లేస్’లో ఉన్న ఎస్పీకి  రూ.563.47కోట్లు, సెకండ్ ప్లేస్’లో ఉన్న తెరాసకు రూ.301.47 కోట్లు, థర్డ్ ప్లేస్’లో ఉన్న అన్నా డీఎంకేకు రూ 267.61 కోట్ల ఆస్తులున్నట్లు ఏడీఆర్ రిపోర్టు వెల్లడించింది. ఆసక్తికరంగా టీడీపీ రూ.188.19 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. వైఎస్సార్‌సీపీ రూ.143.6 కోట్ల విలువైన ఆస్తులతో ఏడో స్థానంలో ఉంది.
ఇక అప్పుల విషయానికి వస్తే, జాతీయ పార్టీల్లో రూ. 49.55కోట్ల అప్పుతో కాంగ్రెస్’ ఫస్ట్ ప్లేసులో వుంది. రూ. 11.32 కోట్ల రుణాలతో తృణమూల్ కాంగ్రెస్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. ప్రాంతీయ పార్టీల్లో 30.34 కోట్ల అప్పులతో టీడీపీ టాప్ ప్లేస్ లో ఉండగా.. రూ.8.05 కోట్ల రుణాలతో డీఎంకే రెండోస్థానంలో ఉంది.తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆస్తులలో టీఆర్ఎస్ పార్టీ, అప్పులలో టీడీపీ టాప్‌లో ఉన్నాయి.