తెదేపాతో పొత్తులు మేలని భావిస్తున్న బీజేపీ

 

వాపును చూసి బలుపని భావిస్తున్నబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తాము చేసిన పోరాటాల వల్ల యావత్ తెలంగాణాలో పార్టీ చాలా బలపడిందని, అందువల్ల వచ్చేఎన్నికలలో ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి గెలిచేయవచ్చని భ్రమలో ఉన్నారు. అందుకే తెదేపాతో పొత్తులని ఆయన తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం అటువంటి వెర్రి భ్రమలలోలేదు. అందుకే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఎన్నికలలో పొత్తులు తదితర అంశాలపై పార్టీలోని కొందరు తటస్థ వ్యక్తుల ద్వారా ఒక రహస్య నివేదిక రప్పించుకొంది. పార్టీలోని విశ్వసనీయ వర్గాల ద్వారా ఆ నివేదికలోని కొన్ని ఆసక్తికరమయిన అంశాలు బయట పడ్డాయి.

 

ఎవరితో పొత్తులు లేకుండా పోటీ చేస్తే ఈసారి కాకపోయినా వచ్చేసారి ఎన్నికలకయినా పార్టీ బలోపేతం అవుతుందనే కిషన్ రెడ్డి వంటి కొందరు నేతల ఆలోచనలు కేవలం కాకి లెక్కలు కట్టుకోవడం వంటిదేనని ఆ నివేదికలో పేర్కొనబడింది. ఎందుకంటే బీజేపీ తెలంగాణా కోసం ఎంత పోరాటం చేసినప్పటికీ, ప్రజలు కాంగ్రెస్, తెరాస, తెదేపాలకే తొలి ప్రాధాన్యం ఇస్తారని, ఇక హైదరాబాద్ జంటనగరాలు, రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్, మరియు నల్గొండ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నసీమాంధ్ర ప్రజల తొలి ప్రాధాన్యత తెదేపాకే ఇస్తారనేసంగతి గత ఎన్నికలలోనే రుజువయిందని, అందువల్ల తెలంగాణాలో సైతం బీజేపీ ఒంటరిగా పోటీచేయడం శ్రేయస్కరం కాదని నివేదికలో పేర్కొనబడింది.

 

జంట నగరాలు, ఆ పరిసర ప్రాంతాలలో దాదాపు 34 నియోజక వర్గాలలో విస్తరించి ఉన్నారు. ఈజిల్లాలు, నియోఅజక వర్గాలలో నివసిస్తున్న సీమాంధ్ర ప్రజలు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ ఎక్కువ ప్రయోజనం పొందుతుంది. అయితే నేరుగా వారి ఓట్లను బీజేపీ పొందడం అసంభవం గనుక, వారి మద్దతు కలిగి ఉన్నతెదేపాతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా బీజేపీ కూడా లాభపడుతుందని, నివేదికలో పేర్కొనబడింది.

 

ఇక తెలంగాణా సెంటిమెంటు బలంగా ఉన్నవరంగల్, కరీంనగర్, మరియు మెదక్, నిజామాబాద్, నల్గొండ కొన్ని ప్రాంతాలలో తెరాసకు మంచి బలం ఉన్నకారణంగా అక్కడ బీజేపీ తనంతట తాను పోటీ చేసి గెలిచే అవకాశాలు అంతగా లేవని పేర్కొంది. గత ఉప ఎన్నికలలో బీజేపీ 11 స్థానాలకు పోటీ చేస్తే కేవలం మెహబూబ్ నగర్ సీటు మాత్రమే గెలుపొందడం బీజేపీ వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోందని పేర్కొంది.

 

అప్పుడు పరకాల్ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్ధికి కేవలం 9,000 ఓట్లు మాత్రమే రాగా, తెదేపా బలపరచిన అభ్యర్ధి తెరాస అభ్యర్ధికి గట్టి పోటీ ఇచ్చి 31,000 సాధించగా, తెరాస కేవలం 2,000 ఓట్ల మెజారిటీతో గెలిచారని, అందువల్ల బీజేపీ చాలా బలంగా ఉందని భావిస్తున్న చోట కూడా తమకంటే తెదేపా బలపరచిన అభ్యర్ధికే ఎక్కువ ఓట్లు రావడం గమనిస్తే వచ్చేఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసే కంటే తెదేపాతో పొత్తుల వలెనే ఇరువురికీ ప్రయోజనం ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది.

 

ప్రస్తుతం తెలంగాణా ప్రాంతాలలో నివసిస్తున్న సీమాంధ్ర ప్రజల ఓట్లన్నీతెదేపాకే పడే అవకాశాలు బాగా ఉన్నాయని, అందువల్ల కాంగ్రెస్, తెరాసలకు బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణాలోఎదగాలంటే తెదేపాతో పొత్తులు మేలని, తద్వారా తరువాత ఎన్నికలకి పార్టీ మరింత బలపడవచ్చని నివేదిక స్పష్టం చేసింది.

 

తమ పార్టీ చెప్పటిన తెలంగాణా ఉద్యమాల వలన సీమాంధ్రలో తన ఉనికిని కోల్పోయిన బీజేపీని కాపాడుకోవాలంటే, అక్కడ బలంగా ఉన్న తెదేపాతో పొత్తులు పెట్టుకోక తప్పదని, తద్వారా అటు తెదేపా, ఇటు బీజేపీ ఇరువురు ప్రయోజనం పొందవచ్చని నివేదికలో పేర్కొనబడింది. ఇక, కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో తెరాసతో, సీమాంధ్రలో వైకాపాతో అవగాహనకు వచ్చినట్లయితే, బీజేపీ ఒంటరిగా పోటీచేయాలనుకోవడం పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొంది.

 

తెలంగాణా కోసం బీజేపీ చేసిన పోరాటాలు, ఎన్నికలలో నరేంద్ర మోడీ ప్రభావం కారణంగా బీజేపీకి చాలా లబ్ది చేకూరే అవకాశం ఉంది. గనుక, ఇటువంటి సదవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని పూర్తి ప్రయోజనం పొందాలంటే బీజేపీ తప్పనిసరిగా తెదేపాతో పొత్తులు పెట్టుకోవడం మేలని నివేదికలో పేర్కొనబడింది.