బీహార్ సీఎం రాజీనామా.. కుప్పకూలిన ఎన్డీయే సర్కార్

బీహార్ లో ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలింది. ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో బీజేపీ-జూడీయూ సంకీర్ణ ప్రభుత్వం పతనమైంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు అంద జేశారు.  ఇక జేడీయూ, ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతా దళ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి.

కాగా రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకూ నితీష్ కుమార్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. రాష్ట్రంలో జేడీయూ-ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు దిశగా నితీష్ అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. మళ్లీ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  నితీష్ కుమార్ రాజీనామాతో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చినట్లైంది.  కాగా గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని అందజేసిన అనంతరం ఆయన రాజ్‌భవన్ వద్ద విలేకరులతో మాట్లాడారు.

ఎన్డీఏ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉందంటూ జేడీయూ  లోక్‌సభ, రాజ్యసభ, శాసన సభ్యులు చెప్పారనీ,  వారి నిర్ణయం మేరకే తాము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని చెప్పారు.  భవిష్యత్ కార్యాచరణపై కసరత్తు చేస్తున్నామని వివరించారు. రాజీనామా చేసిన అనంతరం నితీష్ రాజ్ భవన్ నుంచి  నేరుగా మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి నివాసానికి బయలుదేరి వెళ్లారు.  దారి పొడవునా ఆయనకు ఆర్జేడీ-జేడీయూ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు   స్వాగతం పలికారు. రెండు పార్టీలకు చెందిన జెండాలను పట్టుకుని హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.

రబ్రీ దేవి నివాసంలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌తో నితీష్ కుమార్ భేటీ అయ్యారు.   ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై చర్చించారు.  ఇలా ఉండగా మంగళవారం నాడే ( ఆగస్టు9) నితీష్ కుమార్ మరోసారి గవర్నర్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఆర్జీడీ నాయకుడు తేజస్వి యాదవ్‌తో కలిసి ఆయన గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతారని చెబుతున్నారు.

రాజీనామాకు ముందే నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ ఫోన్‌లో సంభాషించారు. పొత్తు విషయాన్ని నిర్ధారించుకున్నారు. పొత్తు ఖరారైన తరువాతే నితీష్ కుమార్ రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. ఎన్డీఏ నుంచి బయటికి వస్తే తాము మద్దతు ఇస్తామంటూ ఆర్జేడీ, కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి విదితమే. . బీజేపీయేతర ప్రభుత్వం గనక ఏర్పాటైతే తాము బేషరతుగా మద్దతు ఇస్తామని బీహార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజిత్ శర్మ సైతం తెలిపారు.