Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...2021నాటి అసెంబ్లీ ఘటనపై నారా భువనేశ్వరి భావోద్వేగం.!
posted on: Jul 29, 2026 4:38PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ సంస్థల అధినేత్రి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో శాసనసభలో తనపై వ్యక్తిగత విమర్శల చేసి, అవమానకరంగా వైపీపీ నేతలు వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా నాటి అసెంబ్లీ ఘటనను మహాభారతంలోని ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కుప్పం నియోజకవర్గ అభివృద్ధి వ్యవహారాలు, స్థానిక కార్యకర్తల సంక్షేమాన్ని పర్యవేక్షించేందుకు నారా భువనేశ్వరి మూడు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా.. ఓ స్థానిక ఆలయాన్ని దర్శించారు. ఆ ఆలయంలో ద్రౌపది అమ్మవారిని దర్శించుకున్న తరువాత నాటి పరిణామాలను గుర్తుచేసుకుంటూ, ఒక మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడే హక్కు ఏ పురుషుడికీ లేదన్నారు.
2021 నవంబరులో అసెంబ్లీ వేదికగా అప్పటి అధికార పక్ష నాయకులు ప్రతిపక్ష నేత చంద్రబాబును మానసికంగా దెబ్బతీసేందుకు తన పేరును లేవనెత్తారన్న భువనేశ్వరి, తన భర్తపై రాజకీయంగా పై చేయి సాధించలేక.. తనను అనవసరంగా రాజకీయ రచ్చలోకి లాగారన్నారు. అసెంబ్లీ వంటి పవిత్రమైన సభలో ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.
మహాభారతంలో ద్రౌపదికి అవమానం జరిగిన సమయంలో శ్రీకృష్ణుడు అండగా నిలిచినట్లే, తమ కుటుంబానికి పరాభవం జరిగిన సమయంలో రాష్ట్ర ప్రజలే దేవుడి రూపంలో అండగా నిలబడ్డారని భువనేశ్వరి చెప్పారు. ప్రతి మహిళకు తన గౌరవాన్ని కాపాడుకునే శక్తి ఉంటుందని, ఎవరూ వచ్చి రక్షించాల్సిన అవసరం లేదన్నారు. తమకు నిరంతరం మద్దతుగా నిలిచిన ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు.
సాధారణంగా నారా భువనేశ్వరి వ్యాపార, సామాజిక సేవా కార్యక్రమాలకే పరిమితమవుతుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
అయితే ఆలయ సందర్శన వేళ ద్రౌపది విగ్రహాన్ని చూడటంతో భువనేశ్వరి నాడు అసెంబ్లీలో తనపై వైసీపీయులు చేసిన వ్యాఖ్యలను గుర్తుకు వచ్చి భావోద్వేగానికి లోనయ్యారని పరిశీలకలు విశ్లేషిస్తున్నారు. ప్రత్యక్షంగా ఏ పార్టీ పేరూ ప్రస్తావించకుండానే భువనేశ్వరి నాటి అధికార పక్ష తీరును తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో చంద్రబాబు కూడా నాటి ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురై అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి కన్నీటిపర్యంతమైన సంగతి తెలిసేదే. ఐదేళ్ల క్రితం నాటి ఘటనను నారా భువనేశ్వరి మరల ప్రస్తావించడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మహిళల ఆత్మగౌరవం, అసెంబ్లీలో నైతిక విలువలపై ఈ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి.
Nara Bhuvaneswari, Kuppam Tour, AP Assembly Incident, Chandrababu Naidu Wife, Andhra Pradesh Politics, TeloguOne






