మంత్రి రోజా.. ఓ బెంజి కారు.. పలు వివాదాలు!

మంత్రి రోజా కొత్త బెంజి కారు ఇప్పుడు రాజకీయ సవాళ్లు, ప్రతి సవాళ్లకు వేదిక అయ్యింది. ముచ్చటపడి కుమారుడికి గిఫ్ట్ గా ఇవ్వడం కోసం రోజా కొన్న బెంజి కారు ఆమెకు ఇప్పుడు కొత్త తలనొప్పులు తీసుకువచ్చింది.  ఫైర్ బ్రాండ్ రాజకీయాలకు పెట్టింది పేరైన రోజా ఇప్పుడు కోటిన్నర బెంజ్ కారు విషయంలో విమర్శకులకే కాదు సొంత పార్టీలోని ప్రత్యర్థులకు సైతం వివరణ ఇచ్చుకోవలసిన దుస్థితిలో పడ్డారు. కోటీ యాభై లక్షల రూపాయలు పెట్టి రోజా కొన్న కొత్త మెర్సిడీస్ బెంజ్ కారు.. ఆమెను మరోసారి వివాదాల సుడిగుండంలోకి లాగింది.  

బెంజ్ కారును కొనడాన్ని ఏకి పారేస్తూ మంత్రిగా రోజా ‘సంపాదన’ చూస్తుంటే కలెక్షన్ క్వీన్ రోజా అనాల్సి వస్తుందని తెలుగుదేశం విమర్శలు గుప్పిస్తోంది. అయితే తెలుగుదేశం విమర్శలను రోజా కొట్టి పారేస్తున్నారు. నేనేమిటి.. నా లెవెల్ ఏమిటి? అంటూ విమర్శకులను దనుమాడేస్తున్నారు. అయితే ఆమె 2019 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ కు ఇప్పుడు ఆమె కొన్న కారు ఖరీదుకు పొంతన ఎక్కడుందని తెలుగుదేశం వాళ్లే కాదు, నెటిజన్లు సైతం ప్రశ్నిస్తున్నారు. అఫిడవిట్ లో రోజా తన పేరు మీద  రూ.7,38,38,430 ఆస్తి ఉందని అందులో   స్థిరాస్తి రూ.4,64,20,669.. చరాస్తి రూ. 2,74,17,761 ఉందని పేర్కొన్నారు.

ఇక అప్పులు  .49,85,026లుగా రోజా తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.   భర్త సెల్వమణి పేరుతో ఎలాంటి స్థిరాస్తి లేదని.. చరాస్తి రూ.58,02,953.. అప్పులు రూ.22,00,000 ఉన్నట్లు చూపించారు. వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తుల విలువ: 58,80,000 కాగా   కుమార్తె అనూష, కుమారుడు కృష్ణ కౌశిక్‌ పేరుతో   రూ.50,56,191 డిపాజిట్లు ఉన్నట్లు అఫిడవిట్ లో తెలిపారు. అయితే ఆమె జబర్దస్త షోల్లో కానీ, ఇతరత్రా స్పెషల్ షోలలో కానీ.. ఒక్క సినిమా తీసి ఎంతగా నష్టపోయానో... అప్పుల పాలయ్యానో కన్నీటితో వివరించి.. ఆ అప్పలు తీర్చడానికి ఎంత కష్టపడ్డానో చెబుతూ ఉంటారు. అటు వంటి రోజా కుమారుడికి గిఫ్ట్ గా మెర్సిడీస్ బెంజ్ కారు అదీ కోటీ యాభై లక్షలు పెట్టి ఎలా కొనగలుగుతారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం నిలదీస్తోంది. అయితే ఈ ప్రశ్నలను, నిలదీతలనూ ఖండిస్తూ రోజా చెబుతున్న సమాధానం మాత్రం పొంతన లేకుండా ఉంది. మెర్సిడీస్ బెంజ్ కారు కొనడానికి ముందే ఆమె వద్ద ఏడు కార్లు ఉన్నాయి. అవి మహీంద్రా, ఫోర్డ్‌ ఇండీవర్‌, చావర్‌లెట్‌, ఇన్నోవా క్రిష్టా, ఫార్చ్యునర్‌, హూండా స్ల్పెండర్‌, మహీంద్రా స్కార్పియో ఉన్నాయన్నారు.

ఈ కార్ల విలువ రూ.1,08,16,564 ఉంటుందని కూడా రోజా అఫిడవిట్ లో పొందు పరిచారు. అటువంటప్పుడు  స్థిరాస్థులను కదపకుండా.. అప్పు చేయకుండా కోటీ 50లక్షల రూపాయలు వెచ్చించి అంత ఖరీదైన కారును కుమారుడికి గిఫ్ట్ ఇవ్వడం కోసం ఎలా వెచ్చించారన్నదే ప్రశ్న. ఈ ప్రశ్నకు రోజా పొంతన లేని సమాధానం ఇస్తుండటంతో.. కలెక్షన్ క్వీన్ రోజా అంటూ తెలుగుదేశం సెటైర్లు నెట్టింట్ వైరల్ అవుతున్నాయి. ఇక ఖరీదైన బెంజి కారు విషయంలో విమర్శల కన్నా సొంత పార్టీలో కూడా అనుమానాలు పొడ సూపడమే రోజాకు పెద్ద ఇబ్బందిగా తయారైందని అంటున్నారు. అందుకే ఆమె ముందుగా విమర్శలకు సమాధానం చెప్పడం కంటే తాను బెంజ్ కారు కొనుక్కోవడం వెనుక ‘అమాత్య’ సంపాదన ఏదీ లేదని సహచర మంత్రి పెద్ది రెడ్డికి వివరణ ఇచ్చుకున్నారని చెబుతున్నారు.

ఆ విషయం పక్కన పెడితే.. సినిమా నటిగా, ఆ తరువాత జబర్దస్త్ వంటి కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించిన ఆమె బెంజ్ కారు కొనుక్కోవడం పెద్ద విషయంగా రచ్చ అవ్వడానికి ఆమె తన ఆస్తులు, అప్పుల గురించి, తాను ఎదుర్కొన్న ఆర్థిక కష్టాల గురించీ అవకాశం వచ్చిన ప్రతి సారీ కన్నీటితో ఇచ్చిన వివరణలే కారణమని చెప్పవచ్చు. అదీ కాక గతంలో జనసేనాని ఖరీదైన కారు కొనుగోలు చేసిన సందర్బంలో ఆమె  చేసిన విమర్శలు కూడా కారణమే. నాడు ఆమె చేసిన విమర్శలే ఇప్పుడు బూమరాంగై ఆమెకు తగులుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా బెంజ్ కారు విషయంలో ఆమెపై వస్తున్న విమర్శలకు వస్తున్న స్పందన ఆమె వివరణ కు రావడం లేదు. అసలు జనం ఆమె వివరణలను పట్టించుకోవడమే లేదు.

పర్యాటక మంత్రిగా బెంజ్ కారు ఆమెకు ‘రిషికొండ’ గిఫ్ట్ అన్న విమర్శలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా మంత్రి పదవి చేపట్టిన తొలి రోజు నుంచే ఆమె క్యాష్ కౌంటర్ ఓపెన్ చేసేశారన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో అత్యాచారాలను నియంత్రించడంలో రాష్ట్ర సర్కార్ విఫలం అన్న విమర్శలు వెల్లువెత్తిన సందర్బంగా ఇంత రాష్ట్రంలో ఓ రెండు రేపులు రేపులా అని రోజా చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఒక మంత్రికి కోటిన్నర ముడుపులు ఓ ముడుపులా అని రోజా భావిస్తున్నారని   నెటిజన్లు ఆమె సంపాదనపై సెటైర్లు వేస్తున్నారు. రోజాకు తెలిసినట్లుగా సమయం విలువ మరెవరికీ తెలియదనీ, అందుకే మంత్రి పదవి రాగానే   కలెక్షన్లు ప్రారంభించేశారనీ కూడా విమర్శలు వెల్లువెత్తుతన్నాయి. ఇక అధికారం ఉండేదే రెండేళ్లు.. ఇప్పుడు మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే తరువాత పరిస్థితి ఏమిటో, మరో సారి అధికారం దక్కుతుందో దక్కదో అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా రోజా వ్యవహరిస్తున్నారని సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.