దత్తన్న పోస్ట్ "ఊస్ట్" అవ్వడానికి కారణం అదేనా..?

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దాదాపు మూడు సంవత్సరాల తరువాత నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో చేపట్టిన భారీ మార్పులు, చేర్పులు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. త్వరలో జరగనున్న కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2019 సార్వత్రిక ఎన్నికల లెక్కలను బేరీజు వేసుకుని మోడీ ఈ మార్పులు చేపట్టినట్లు ప్రచారం జరిగింది. పునర్వ్యస్థీకరణ ప్రక్రియకు ముందు మంత్రుల పనితీరుపై నిశితంగా సమీక్ష జరిపారట మోడీ.. వారిలో కొందరు మంత్రులకు నెగిటీవ్ మార్కులు..మరికొందరికి పాజిటీవ్ మార్కులు రావడంతో వాటి ఆధారంగా సంబంధిత మంత్రుల శాఖలను మార్చడం..హోదా తగ్గించడం..మంత్రి పదవి నుంచే తప్పించడం వంటి చర్యలు చేపట్టారు ప్రధాని. వారిలో ప్రముఖంగా ఉమాభారతి, రాజీవ్ ప్రతాప్ రూఢీతో పాటు తెలుగు వ్యక్తి బండారు దత్తాత్రేయ ఉన్నారు.

 

ఉమా భారతి పనితీరు సరిగా లేదని పక్కనబెట్టగా..75 సంవత్సరాలు దాటిన వారు పార్టీ పదవుల్లో ఉండరాదనే నిబంధనను సాకుగా చూపి కల్‌రాజ్‌ మిశ్రాకు నచ్చజెప్పారు. సరే వివాదాలకు దూరంగా, సౌమ్యుడిగా, నిత్యం ప్రజలలో ఉండే దత్తన్నను పదవి నుంచి ఎందుకు తప్పించారనేది రాజకీయ విశ్లేషకుల మెదళ్లను తొలిచేస్తోంది. తెలంగాణ ప్రాంత వ్యక్తి కావడం..టీఆర్ఎస్ అధినేతతో సాన్నిహిత్యం తదితర అంశాలను బేరీజు వేసుకున్న ప్రధాని దత్తాత్రేయను సాగనంపేందుకే నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నారు. అయితే అసలు మ్యాటర్ ఇది కాదట. మోడీ ఎన్నికల హామీల్లో ప్రధానమైనది ఉద్యోగాల భర్తీ. తాను అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానన్నారు నరేంద్రుడు. ఉద్యోగాల కల్పనలో కీలకపాత్ర వహించే శాఖలైన స్కిల్ డెవలెప్‌మెంట్, పెట్రోలియం శాఖ, కార్మిక శాఖలను నిర్వహిస్తున్న.. రాజీవ్ ప్రతాప్ రూఢీ, ధర్మేంద్ర ప్రధాన్, బండారు దత్తాత్రేయల్లో ప్రధాన్ ఒక్కరే తన శాఖ నుంచి మెరుగైన ఫలితాలు సాధించినట్లు మోడీ రిపోర్టులో తేలిందని నీలాంజన్ ముఖోపాధ్యాయ అనే రాజకీయ విశ్లేషకుడు తాను రాస్తున్న మోడీ బయోగ్రఫీ పుస్తకంలో పొందుపరచడం సంచలనం కలిగించింది. దీంతో ధర్మేంద్రకు ప్రమోషన్ ఇచ్చి మిగిలిన ఇద్దరిని మంత్రివర్గం నుంచి ప్రధాని తప్పించారని నీలాంజన్ పేర్కొన్నారు.

 

కానీ గత ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతం నుంచి బీజేపీ గెలిచిన ఏకైక ఎంపీ స్థానం దత్తాత్రేయదే. అటువంటి నేతకు ఇలా జరగాల్సింది కాదని ప్రత్యర్థులు సైతం వాదిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో తనను పదవి నుంచి తప్పించబోతున్నారని ఢిల్లీలోని అత్యంత సన్నిహితులైన జర్నలిస్టుల ద్వారా తెలుసుకున్న దత్తాత్రేయ విషయాన్ని ఆర్ఎస్ఎస్ దృష్టికి తీసుకెళ్లారట..కానీ ఏం చేస్తాం..అక్కడంతా మోడీ మేనియా నడుస్తుంటే వారు మాత్రం ఏం చేయగలరు..ఈ విషయాన్ని ఆలస్యంగా బోధపడటంతో దత్తన్న తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా సైలెంట్‌గా హైదరాబాద్ వచ్చేశారు.