Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేసిన డీజీపీ
posted on: Mar 17, 2026 8:17PM

బలిమెల రిజర్వాయర్ లో మావోయిస్టులు దాడి చేసి 38 మందిని హత్య చేసిన ఆనాటి దారుణ మారణకాండ పోలీస్ యంత్రాంగానికి తీరని వేదనను మిగిల్చిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి అన్నారు. బలిమెల సంఘటనలో అమరులైన పోలీసు కుటుంబ సభ్యులకు ఇళ్లస్థలాల పట్టాలను మంగళవారం నాడు డీజీపీ కార్యాలయంలో ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ....2008 జూన్ 29న మావోయిస్టులు జరిపిన ఆకస్మిక దాడిలో 32 మంది గ్రేహౌండ్స్ విభాగపు వీర జవాన్లు సహా మొత్తం 38 మంది మరణించిన సంఘటన రాష్ట్ర పోలీసు శాఖను విషాదంలో ముంచిందన్నారు. ఆ సమయంలో తాను ఎస్ఐబీ డిఐజిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల కాలంలోనే ఇటువంటి భారీ విషాదం ఎదురవ్వడం ఇప్పటికీ ఒక చేదు జ్ఞాపకంగా వెంటాడుతోందని డీజీపీ విచారం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ఆ వీరుల కుటుంబాలను అక్కున చేర్చుకోవాలనే ఆకాంక్షతో హైదరాబాద్ శివారులో భూమి కేటాయింపు కోసం చేసిన ప్రయత్నాలు సుదీర్ఘ కాలం పాటు కొనసాగాయన్నారు.
దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు నేడు తెరపడటం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అమరవీరుల వారసులకు అండగా నిలవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లే ఈ సమస్య పరిష్కారమైందని, బాధితులకు తగిన న్యాయం చేకూరిందని వెల్లడించారు. ఇన్నేళ్ల తర్వాత అమరుల కుటుంబాల చిరకాల వాంఛను నెరవేర్చినందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ తరపున, అమరుల కుటుంబ సభ్యుల పక్షాన ముఖ్యమంత్రికి డీజీపీ కృతజ్ఞతలు తెలియజేశారు.
2008 జూన్ 29న ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ వద్ద బలిమెల రిజర్వాయర్‌లో లాంచీపై వెళ్తున్న 60 మంది గ్రేహౌండ్స్ కమాండోలు, పోలీసులపై మావోయిస్టులు మెరుపుదాడి చేసిన విషయం విధితమే. కొండల పైనుంచి మావోయిస్టులు జరిపిన కాల్పులు, గ్రెనేడ్ల దాడిలో లాంచీ మునిగిపోయింది. ఈ దారుణ ఘటనలో 32 మంది గ్రేహౌండ్స్ కమాండోలు సహా మొత్తం 38 మంది మరణించారు. వీరి త్యాగానికి గుర్తింపుగా నాటి ప్రభుత్వం అమరవీరుల వారసులకు 200 గజాల చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ 2013లో జీవో నంబర్ 339 జారీ చేసింది. తొలుత కుతుబుల్లాపూర్ మండలం గజులరామారం గ్రామంలోని సర్వే నంబర్ 23, 27లలో రెండెకరాల భూమిని కేటాయించారు.
అయితే ఆ భూమిలో ఆక్రమణలు ఉండటంతో, ప్రత్యామ్నాయంగా అదే గ్రామంలోని సర్వే నంబర్ 16లో 3.10 ఎకరాలను గుర్తించారు. జీవోలో ఉన్న సర్వే నంబర్లకు, క్షేత్రస్థాయిలో ఉన్న స్థలానికి మధ్య వ్యత్యాసం ఉండటంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో అమరవీరుల కుటుంబాలు దాదాపు 13 ఏళ్లుగా పట్టాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం స్పందిస్తూ గత ఏడాది అక్టోబరు 18న సవరణ ఉత్తర్వులు (జీవో నం. 132) జారీ చేసింది. గాజులరామారంలోని సర్వే నంబర్ 16లో భూమి కేటాయింపును క్రమబద్ధీకరించింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులైన 33 మంది వారసులకు మంగళవారం నాడు డీజీపీ చేతుల మీదుగా అధికారికంగా ఇళ్ల స్థలాల పట్టాలు అందజేశారు.
కార్యక్రమంలో ముందుగా గ్రేహౌండ్స్ అడిషనల్ డిజిపి అనిల్ కుమార్ మాట్లాడుతూ.... వివిధ కారణాల వల్ల గ్రేహౌండ్స్ అమరవీరుల కుటుంబ సభ్యులకు ఇళ్ల స్థలాల పంపిణీ ఆలస్యమైందన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ,రెవిన్యూ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటెలిజెన్స్ అడిషనల్ డిజిపి విజయ్ కుమార్, ఎస్‌ఐబి, ఐజిపి బి. సుమతి, గ్రేహౌండ్స్ కమాండర్ రాఘవేందర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో అశోక్ కుమార్ లతోపాటు అమరవీరుల కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గ్రేహౌండ్స్ అధికారులకు ప్రత్యేక ఆపరేషన్ మెడల్స్
గ్రేహౌండ్స్‌లో ప్రతిభ కనబరిచిన నలుగురు అధికారులకు 2024 సంవత్సరానికి గాను 'కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్' (స్పెషల్ ఆపరేషన్ మెడల్) లభించింది. గ్రూప్ కమాండర్ జాజాల రాఘవేందర్ రెడ్డి, సీనియర్ కమాండోలు తిప్పని రాకేష్, ఉడుతనూరి మల్లయ్య, జూనియర్ కమాండో గంటా సాయి కుమార్ ఈ పురస్కారాలకు ఎంపికైన సందర్భంగా వారిని డిజిపి అభినందించారు.






