మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఎప్పుడో?

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం, ఖరారు అయినట్లా, కానట్లా అంటే, అయ్యీ కానట్లుగానే ఉన్నట్లు తెలుస్తోంది. అవును, వారం రోజుల క్రితం, మార్చి 24న మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సమయంలో ఏప్రిల్ 3 ముహూర్తం  అని కూడా ప్రచారం జరిగింది. అలాగే  కొత్త మంత్రులు వీరే అంటూ నాలుగు పేర్లు, నాలుగు ముఖాలు తెరపైకి వచ్చాయి.  అయితే  రోజు రోజుకూ సీన్ మారుతున్న సంకేతాలు వస్తున్నాయి. నిజానికి, ఓ వంక రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో, కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను రాత్రికి రాత్రి ఢిల్లీ పిలిపించుకుని మరీ మంత్రివర్గ విస్తరణపై చర్చించి నిర్ణయం తీసుకోవలసిన అవసరం, అర్జెన్సీ ఏమొచ్చింది అన్న అనుమానాలు  వచ్చాయి. మంత్రి వర్గ విస్తరణ కాదు  మరేదో  ఉందనే  కథనాలూ వచ్చాయి. అయితే  ఆ అనుమానాలు అంతగా నిలవలేదు.  అయితే ఈ ఐదారు రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ స్వరూప స్వభావాలు మెల్ల మెల్లగా మారుతూ వస్తున్నాయి. నిజానికి  రేపు  ఎప్పుడైనా  జరిగేది  కేవలం మంత్రి వర్గ విస్తరణ మాత్రమే కాదు. మంత్రి వర్గంలో ఉన్న ఖాళీలను నింపే క్రతువు మాత్రమే కాదు, మంత్రి వర్గంలో  భారీగానే   మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. అవును జరిగేది, మంత్రి వర్గ విస్తరణ కాదు,   మంత్రి వర్గ పునర్వ్యవస్తీకరణ అంటున్నారు. తెలంగాణ విషయంలో పార్టీ అధిష్టానం  ఇంతవరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క అనే నిర్ణయానికి వచ్చిందని కాంగ్రస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, దీర్ఘకాల ప్రణాళికతో దేశ వ్యాప్తంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు నడుం బిగించిన రాహుల్ గాంధీ  కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను, ముఖ్యంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారని  తెలంగాణను రోల్ మోడల్ గా చూపించాలని రాహుల్ సంకల్పించారని అంటున్నారు.  ఈ నేపధ్యంలో అధికారంలోకి వచ్చి పట్టుమని పదిహేను నెలలు అయినా  కాకముందే  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్త మవుతున్నట్లు వస్తున్న వార్తల విషయంలో అధిష్టానం సీరియస్ గా ఉందని అంటున్నారు. అందుకే  మంత్రి వర్గం సర్జరీ కి సిద్దమయినట్లు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఒక విధంగా, డిఫరెంట్ సోర్సెస్  నుంచి సేకరించిన   గ్రౌండ్  రిపోర్ట్స్ ఆధారంగా మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు  చేపట్టేదుకు కాంగ్రెస్ అధిష్టానం భారీ కసరత్తే చేసినట్లు చెపుతున్నారు.  అంతే కాదు  మార్చి 24న ఢిల్లీలో జరిగిన చర్చల్లోనే, మంత్రి వర్గ పని తీరును సమీక్షించినట్లు చెపుతున్నారు. కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య సరైన సమన్వయం లేక పోవడంతో ఈ శాఖల్లో మార్పులు తప్పవని  కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి  అన్నిటికంటే ముఖ్యంగా మంత్రివర్గంలో సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న నేపధ్యంలో కొందరు మంత్రుల శాఖలు మార్చడంతో పాటుగా  అవసరమైతే ఉద్వాసనలు వెనకాడరాదనే నిర్ణయానికి అదిస్థానం వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.  అదొకటి అలా ఉంటే, మూడవ తేదీ ముహూర్తం విషయంలోనూ ఇంకా పూర్తి స్పష్టత రాలేదని అంటున్నారు. ముఖ్యంగా ఇటీవల ఢిల్లీకి దగ్గరైన రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు కీలక మార్పుల విషయంలో  తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో, అధిష్టానం పునారలోచనలో పడిందని అంటున్నారు. ఈ సందర్భంగా సదరు సీనియర్ నాయకుడు గతంలో ఫిర్యాదుల ఆధారంగా నిర్ణయాలు తీసుకుని భారీ మూల్యం చెల్లించిన విషయాన్నీ గుర్తు చేసిన మీదట, మరో సారి రాష్ట్ర నాయకులతో మరింత లోతుగా చర్చించిన తర్వాతనే  ముహూర్తం ఖరారు  చేయాలనే ఆలోచనకు అధిష్టానం వచ్చిందని అంటున్నారు. అదే జరిగితే, మూడవ తేదీ ముహూర్తం మిస్సయ్యే అవకాశం లేక పోలేదని అంటున్నారు.ఏప్రిల్ 8,9 తేదీల్లో అహ్మదాబాద్ లో జరగనున్న ఏఐసీసీ  రెండు రోజుల సమావేశాలు ముగిసిన తర్వాతనే, ముహూర్తం ఖరారు అవుతుందని అంటున్నారు.
మంత్రి వర్గ విస్తరణ  ముహూర్తం ఎప్పుడో? Publish Date: Mar 29, 2025 11:04PM

కొలికపూడి యాక్షన్ ఓవర్ అయ్యిందా?

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఆలవాల రమేష్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హడావుడి చేస్తున్నారు. ఓ గిరిజన మహిళ పై లైంగిక వేధింపుల ఆడియో ఇటీవల సంచలనంగా మారింది. ఆ గిరిజన మహిళను వేధించిన రమేష్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలంటూ కొలికపూడి డిమాండ్.  గంటల్లో రమేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని  అల్టిమేటం జారీ చేశారు. టీడీపీ  అధిష్ఠానానికి 48 గంటల డెడ్‌లైన్‌ విధిస్తూ అల్టిమేటం జారీ చేసిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యల దుమారం కాక రేపింది.  కొలికపూడి యాక్షన్‌పై అధిష్ఠానం వెంటనే రియాక్ట్‌ అయ్యింది. టీడీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ను రంగంలోకి దింపిన రాష్ట్ర నాయకత్వం వెంటనే నివేదిక కోరింది. ఏఎంసీ మాజీ చైర్మన్‌ రమేశ్‌రెడ్డిపై ఆరోపణలు, ఎమ్మెల్యే కొలికపూడి వ్యాఖ్యలపై ఆయన వివరాలు సేకరించి అధిష్ఠానానికి నివేదిక పంపారు. అంతేకాదు.. రాష్ట్ర కార్యాలయం నుంచి తిరువూరు నాయకులకు ఫోన్లు వస్తుండటంతో ఇక్కడి రాజకీయంపై సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది. తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో పోలీసుల భారీగా మోహరించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఎపిసోడ్ టీడీపీలో హీట్ పుట్టిస్తోంది. మాజీ ఏఎంసీ చైర్మన్ రమేశ్ రెడ్డిపై 48 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే  రాజీనామా చేస్తానని రెండు రోజుల క్రితం కొలికపూడి అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 11 గంటలతో కొలికపూడి డెడ్ లైన్ పూర్తి అయింది. దీంతో ఎమ్మెల్యే ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు కొలికపూడి తీరుపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉంది. ఇప్పటికే ఐవిఆర్ఎస్, ముగ్గురు సభ్యులతో కూడిన నివేదికను అధిష్టానం తెప్పించుకుందంట. తిరువూరు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో 1994 నుంచి నల్లగట్ల స్వామిదాసు టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు .. రెండు సార్లు ఎమ్మెల్యేగా  పనిచేశారు.. స్వామిదాసు గత ఎన్నికల ముందు కేశినేని నాని వెంట వైసీపీలో చేరడంతో టీడీపీకి అభ్యర్ధి కరువయ్యారు. దాంతో ప్రస్తుత విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని తన అన్న నాని టీమ్‌ని ఓడించడానికి కొలికపూడి పేరు అధిష్టానానికి సిఫార్సు చేశారు. కొలికిపూడి వాగ్ధాటి చూసి పార్టీకి పనికొస్తారని భావించి చంద్రబాబునాయుడు అతనికి టికెట్ ఇచ్చారు. కూటమి వేవ్‌లో కొలికపూడి మంచి మెజార్టీతో గెలిచారు. అమరావతి ఉద్యమ నేతగా ఫోకస్ అయిన ఆయన్ని తిరువూరు ఓటర్లు అంతలా ఆదరిస్తే, గెలిచాక ఆయన తనలోని మరో కోణం చూపిస్తున్నారంట.  తాజాగా కొలికపూడి తనకు రాజకీయ భిక్ష పెట్టిన కేశినేని చిన్ని అనుచరుడు రమేష్‌రెడ్డిని టార్గెట్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కొలికపూడి వ్యవహారం వైసీపీకి ఆయుధంగా మారుతోంది. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య కమిషన్ల పంచాయితీ సాగుతోందని,  వైసీపీ ఆరోపిస్తోంది. అందుకే పరోక్షంగా చిన్నిని కొలికపూడి టార్గెట్ చేస్తూ,  చిన్ని అనుచరుడైన రమేష్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హడావుడి చేస్తున్నారని వైసీపీ ప్రచారం మొదలు పెట్టింది.  అదలా ఉంటే టీడీపీ శ్రేణుల్లో మరో వాదన కూడా వినిపిస్తోంది. ఏవో అవసరాల కోసం రమేష్‌రెడ్డిని కొలికపూడి అప్పుగా సాయం చేయమని కోరారంట. అయితే రమేష్‌రెడ్డి రియాక్ట్ అవ్వకపోవడంతో తిరువూరు ఎమ్మెల్యే కోపమొచ్చి కొత్త డ్రామా మొదలుపెట్టారంట. ఈ క్రమంలో టీడీపీలో కొలికిపూడికి బ్యాడ్‌టైమ్ స్టార్ట్ అయిందని... ఇక ఆయనకు పార్టీలో సీన్ ఉండదన్న టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి ఈ ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో
కొలికపూడి యాక్షన్ ఓవర్ అయ్యిందా? Publish Date: Mar 29, 2025 10:39PM

నైట్ రైడర్స్ మ్యాచ్‌కి రాములోరి బ్రేక్.. !

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు శ్రీరాముడు చిన్నబ్రేక్ వేశారు. శ్రీరామనవమి ఎఫెక్ట్‌తో ఒక మ్యాచ్ పోస్టు పోన్ అయింది. ఐపీఎల్ హైటెన్షన్ మ్యాచులతో ఉర్రూత లూగిస్తోంది లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్, భారీ స్కోర్లు.. వెరసి అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతోంది. ఈ తరుణంలో ఐపీఎల్ షెడ్యూల్‌లో సడన్ చేంజెస్ చేసింది బీసీసీఐ. అయితే అదేమంత పెద్ద మార్పు కాదనీ,  కేవలం ఒక మ్యాచ్ విషయంలో మాత్రమే మార్పు చోటుచేసుకుందని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.  ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్స్ మధ్య ఏప్రిల్ 6వ తేదీన మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే అదే రోజు శ్రీ రామ నవమి కావడంతో కోల్‌కతాలో భారీ ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీంతో సెక్యూరిటీ ఇష్యూస్ తప్పవని, ఫుల్ ప్రొటెక్షన్ కల్పించలేమని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు కోల్‌కతా పోలీసులు స్పష్టం చేశారు.  ఈ నేపథ్యంలో షెడ్యూల్‌లో చేంజెస్ చేసింది బీసీసీఐ. ఏప్రిల్ 8వ తేదీన అదే ఈడెన్ గార్డెన్స్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. దీంతో ఏప్రిల్ 6న డబుల్ హెడర్ స్థానంలో కేవలం సన్‌రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో పైఒక్క మ్యాచ్‌లో తప్పితే ఇతర మార్పులేవీ లేవు.
 నైట్ రైడర్స్ మ్యాచ్‌కి రాములోరి బ్రేక్.. ! Publish Date: Mar 29, 2025 10:21PM

తెలుగోడి ఆత్మగౌరవం నినాదానికి 43 ఏళ్లు

అన్న నందమూరి తారకరామారావు ఆత్మగౌరవం నినాదంతో  జన్మించి, విజనరీ నారా చంద్రబాబునాయుడు  చేతుల్లో రూపు దిద్దుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి  43 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంది. తెలుగుదేశం పిలుస్తోంది.. రా.. కదలిరా నినాదంతో ఎన్టీఆర్ 1982 మార్చి 29న స్థాపించిన పార్టీ తెలుగు రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల అతిగతి మార్చేసింది. ఎన్టీఆర్ తన చైతన్య రధంపై సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అప్పటికే సినిమా రంగంలో సాధించిన అనితరసాధ్యమైన ఆదరణతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. తెలుగు వారి "ఆత్మగౌరవ" నినాదంతొ, పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి  తెలుగుదేశం  చరిత్ర సృష్టించింది. సినిమావాళ్ళకు రాజకీయాలేమి తెలుసన్న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎగతాళి మాటలకు ఎన్టీఆర్ గట్టి జవాబు చెప్పారు. అంతే కాదు అప్పట్లో ఏపీలోని 42 లోక్‌సభ స్థానాలకుగాను 35 స్థానాలను గెలుచుకుని తొలిసారే లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించి చరిత్ర సృష్టించింది. 1983లో దేశం మొత్తం మీద 544 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ హవా కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగుదేశం ప్రభంజనం సృష్టించింది. తెలుగుదేశం పదవిలోకి వచ్చిన తరువాత తొలిసారి ప్రవేశపెట్టిన  రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం పేదవాడి కడుపు నింపుతూ.. అన్ని పార్టీలకూ ఆదర్శ మైంది. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ రూపుమాపి, మండల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన టీడీపీ రాజకీయ ఓనమాలు తెలియని వారిని లీడర్లుగా తయారు చేసి పొలిటికల్ యూనివర్సిటీగా పేరు గాంచింది.  పేద ప్రజల గుండెలలో ఛిర స్థాయిగా నిలిచిపోయే గొప్ప పేరు సాధించిన నాయకుడు రామారావు. ముఖ్యంగా "మదరాసీ"లుగా మాత్రమే గుర్తింపబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజ పరిచి, ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన తెలుగు తల్లి ముద్దుబిడ్డ, యుగపురుషుడు నందమూరి తారక రామారావు. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసినా, "ఒక్క రూపాయి" మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భృతిగా స్వీకరించినా, అది ఆయనకు మాత్రమే చెల్లింది. నాదెండ్ల భాస్కరరావు 1983 ఆగస్టులో దొడ్డి దారిన ఇందిరాగాంధీ సాయంతో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు తెలుగోడి ఆవేశాన్ని, చైతన్యాన్ని యావత్తు ప్రపంచం చూసింది. అప్పట్లో పార్టీ నేతలను సమన్వయపరుస్తూ, ప్రజాందోళనలతో కేంద్రంపై వత్తిడి తీసుకువచ్చిన చంద్రబాబునాయుడు తన రాజకీయ చాణక్యాన్ని చాటుకున్నారు. 1985లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి 200కి పైగా స్థానాలతో ఎన్టీఆర్‌ను రెండోసారి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కించడంలో సీబీఎన్ కీరోల్ పోషించారు.  1994లో టీడీపీ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పుడు లక్ష్మీపార్వతి పెత్తనం కారణంగా పార్టీలో ఎన్టీఆర్ శకం ముగిసి, చంద్రబాబు మార్క్ మొదలైంది. జాతీయ రాజకీయాల్లో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం వీపీ సింగ్‌ను ప్రధానిని చేసి కాంగ్రెస్ ఆధిపత్యానకి గండి కొట్టగలిగింది. 1998లో టీడీపీ హయాంలో చంద్రబాబు విజన్‌తో సాంకేతికత పరుగు పెట్టడం ప్రారంభించి, సైబర్ టవర్స్‌తో హైటెక్ సిటీకి అంకురార్పణ జరిగింది. 1999లో టీడీపీ నాలుగోసారి అధికారంలోకి వచ్చినప్పుడు హైటెక్ స్పీడ్‌తో అభివృద్ధి పరుగులు పెట్టి, చంద్రబాబుకి హైటెక్ సీఎం బ్రాండ్ ఇమేజ్ సాధించిపెట్టింది.  తర్వాత పదేళ్లు టీడీపీ అధికారానికి దూరమవ్వడం, రాష్ట్ర విభజన జరగడం, చంద్రబాబు రెండు ప్రాంతాలు ముఖ్యమేనంటూ రెండు కళ్ల సిద్దాంతం ఎత్తుకోవడంతో  తెలుగుదేశం పనైపోయిందని ప్రత్యర్ధులు ప్రచారం చేశారు. అయితే రాజధాని లేకుండా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి కాముకుడు, హైటెక్ దార్శనికుడు చంద్రబాబునే నెత్తినపెట్టుకుని, 2014లో తెలుగదేశానికే అయిదో సారి పట్టం కట్టారు. అటు తెలంగాణలోనూ రాష్ట్ర విభజన తర్వాత 12 ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానం గెలుచుకున్న టీడీపీ ఉనికి చాటుకోగలిగింది. ప్రస్తుతం ఏపీలో ఆరో సారి రికార్డు మెజార్టీతో గెలిచిన టీడీపీ నుంచి చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ , అటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారులో కీరోల్ పోషిస్తూ తెలుగువాడి ఆత్మాభిమానాన్ని చాటుతున్నారు.  మొత్తం 43 ఏళ్ల ప్రస్థానంలో టీడీపీ ఆరు సార్లు అధికారంలోకి వచ్చి, కేవలం నాలుగు సార్లు మాత్రమే అధికారానికి దూరమైందంటే ఆ పార్టీ ప్రజల మనస్సుల్లో ఎంతగా పాతుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు రెండు తెలుగురాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొని, జై ఎన్టీఆర్, జైజై చంద్రబాబు అన్న నినాదాలు హోరెత్తాయి.
తెలుగోడి ఆత్మగౌరవం నినాదానికి 43 ఏళ్లు Publish Date: Mar 29, 2025 10:11PM

టీటీడీ ట్రస్టులకు 10 రోజుల్లో 30 కోట్ల విరాళాలు

గత పది రోజులలో తిరుమలేశునికి దాదాపు 30 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో దాతలు సమర్పించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న పది ట్రస్టులకు గత పది రోజుల్లో భారీ విరాళాలు అందాయి. వాటిలో శ్రీవేంకటేశ్వర ఆలయ  నిర్మాణం ట్రస్ట్ కు 11 కోట్ల 67 లక్షల 15 వేల 870 రూపాయలను దాతలు విరాళంగా ఇచ్చారు. అలాగే అన్నప్రసాదం ట్రస్ట్ కు గత పది రోజులలో దాతలు 8 కోట్ల 14 లక్షల 90 వేల958 రాపాయలు విరాళంగా అందాయి.  ఇక శ్రీ బాలాజీ ఆరోగ్య ప్రసాదిని ట్రస్ట్ కు 4 కోట్ల 88 లక్షల 50 వేల 391రూపాయలు,  శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ కు రూ. 1,15,83,653లు దాతల నుంచి విరాళంగా అందాయి. అదే విధంగా శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కు రూ 1,14,36,016లు.  శ్రీ వెంకటేశ్వర విద్యా దాన ట్రస్ట్ కు రూ.1,65,85,417లు బర్డ్ ఆసుపత్రి ట్రస్ట్ కు రూ. 54,92,050లు విరాళంగా అందాయి. ఇక  శ్రీ వెంకటేశ్వర సర్వ శ్రేయస్సు ట్రస్ట్ కు రూ. 37,48,526లు, శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు రూ, 29,60,968లు స్విమ్స్ ఆసుపత్రి ట్రస్ట్ కు రూ. 2,05,326లను దాతలు విరాళంగా ఇచ్చారు. అదే విధంగా శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ ట్రస్ట్ కు కూడా విరాళాలు అందాయి. మొత్తం పది ట్రస్టులకు కలిపి పది రోజుల వ్యవధిలో 29 కోట్ల, 90 లక్షల, 71 వేల 331రూపాయలు విరాళాల రూపంలో జమ అయ్యాయి.  
టీటీడీ ట్రస్టులకు 10 రోజుల్లో 30 కోట్ల విరాళాలు Publish Date: Mar 29, 2025 5:16PM

లైంగిక వేధింపుల కేసులో  యూట్యూబర్ శంకర్ అరెస్ట్ 

లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ శంకర్ ను హైద్రాబాద్  అంబర్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు.  ఓ మహిళ తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యా దు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా శంకర్ ను అరెస్ట్ చేశారు. తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత శంకర్ తనకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నట్లు ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను పార్ట్ టైం లెక్చరర్ గా పని చేస్తున్న సమయంలో పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్టు చెప్పారు. పెళ్లి ప్రస్తావన తెస్తే సోషల్ మీడియాలో బయటపెట్టాడని ఆ మహిళ ఫిర్యాదు పేర్కొన్నారు. తన  తెలంగాణ పిల్ల  అనే ట్విట్టర్  అకౌంట్ ను హ్యాక్ చేసినట్టు ఆమె ఆరోపించారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేసినట్టు ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. శనివారం అంబర్ పేట పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. న్యూస్ లైన్ అనే ఈ యూట్యూబ్ చానల్ గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసారాలు చేస్తోంది. 
లైంగిక వేధింపుల కేసులో  యూట్యూబర్ శంకర్ అరెస్ట్  Publish Date: Mar 29, 2025 5:12PM