Top Stories

వేధిస్తున్నాడని యువకుడికి నిప్పెట్టిన యువతి

యువతులపై ప్రేమోన్మాదంతో యాసిడ్ దాడులు, కత్తులతో పొడవడాలు, హత్యాయత్నాల గురించి వింటూనే ఉన్నాం. అయితే ఒక యువతి తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ యువకుడిపై పెట్రోలు పోసి తగలబెట్టే ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది. పల్నాడు జిల్లాలోని క్రోసూరు మండలం ఉయ్యందనలో ఒక మహిళ తనను మానసికంగా వేధస్తున్నాడంటూ ఒక యువకుడిపై ప్రతీకారానికి దిగింది. చిరంజీవి అనే యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది ఓ యువతి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని కోపంతో తమ్మిశెట్టి చిరంజీవి (35)పై దేవళ్ళ శ్రీలక్ష్మి (30) పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. ఈ ఘటనలో యువకుడి వీపు కాలిపోవడంతో స్థానికులు వెంటనే సత్తెనపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాధితుడిని సత్తెనపల్లి నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. తనపై హత్యాయత్నం చేసిన యువతిపై బాధితుడు చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  గ్రామానికి చెందిన చిరంజీవి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, తన వ్యక్తిత్వంపై నిందలు వేస్తున్నాడని శ్రీలక్ష్మీ వాపోయింది. ఎన్నిసార్లు హెచ్చరించినా చిరంజీవి తన ధోరణిని మార్చుకోకపోవడంతో అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించింది ఆ మహిళ. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో చిరంజీవి కేకలు వేశాడు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు మంటలను ఆర్పివేసి అతడిని హుటాహుటాన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తనపై హత్యాయత్నానికి పాల్పడిన యువతిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.  కేసు నమోదు చేసిన పోలీసులు.. చిరంజీవి, శ్రీలక్ష్మీ మధ్య గొడవ ఏంటి.. పెట్రోల్ పోసి నిప్పుపెట్టేంత వివాదం ఏంటి.. మహిళ గురించి చిరంజీవి ఏ విధమైన ప్రచారం చేశాడనే దానిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. అయితే చిరంజీవిపై మహిళ పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన గ్రామంలో సంచలనంగా మారింది.
వేధిస్తున్నాడని యువకుడికి నిప్పెట్టిన యువతి Publish Date: Apr 2, 2025 7:50AM

వల్లభనేని వంశీకి మరో షాక్

రోజుల తరబడి రిమాండ్ ఖైదీగా మగ్గుతున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసలు స్వరూపం,  అదేనండి ఒరిజనల్ రూపం బయటపడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. తెల్ల జుట్టుతో, దీన వదనంతో విజయవాడ సబ్‌జైలు నుంచి కోర్టులకు తిరుగుతున్న వంశీకి వరుస కేసులు, కోర్టు ఉత్తర్వులు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. తాజాగా ఆయనకి మరోసారి షాక్ తగిలింది. వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు మంగళవారం (మార్చి 1) రిమాండ్ పొడిగించింది. తమ భూమిని బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలపై అత్కూరు పోలీసు‌స్టేషన్‌లో వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఇదే కేసులో వంశీని ఒకరోజు పాటు న్యాయస్థానం ఇటీవల కస్టడీకి ఇచ్చింది. ఈ నెల 15 వరకు వంశీకి రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.  గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రధాన అనుచరుడు, ఏ1 నిందితుడు  మోహన్ రంగాను సీఐడీ కస్టడీలోకి తీసుకుంది. తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో మూడు రోజుల పాటు సీఐడీ అధికారులు విచారించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అజ్ఞాతంలోకి వెళ్లిన మోహన్ రంగాను ఇటీవల   పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. సీఐడీ కస్టడీకి అనుమతి ఇస్తూ విజయవాడ  కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
వల్లభనేని వంశీకి మరో షాక్ Publish Date: Apr 2, 2025 7:43AM

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడుముక్కలాట!

మంత్రుల పర్యటన వేళ అధికారులకు అష్టకష్టాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నతాధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లా తయారైంది.  ముగ్గురు మంత్రుల పర్యటనల నేపథ్యంలో వారి పరిస్థితి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న సామెతను తలపిస్తోంది.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురికి అవకాశం లభించింది. ఈ ముగ్గురిలో తుమ్మల నాగేశ్వరావుకు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. మిగిలిన ఇద్దరూ మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తొలిసారిగా మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండటంతో జిల్లా వాసులు ఆనందం వ్యక్తంచేశారు. కార్యకర్తలు కూడా తమ నాయకులు మంత్రులు అయ్యారనే సంతోష పడుతున్నారు.  ఇంతవరకు బాగానే ఉంది కానీ మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మాత్రం అధికారులు హైరానా పడుతున్నారు.  ముగ్గురులో ఎవరు జిల్లా పర్యటనకు వచ్చినా కలెక్టర్ తోపాటు జిల్లా స్థాయి అధికారులంతా కార్యక్రమాలకు హాజరు కావాల్సిందే. ఒక్కోసారి ముగ్గురూ జిల్లాలో ఉంటే అధికారులు పరుగులు పెట్టాల్సిందే. ఎవరి కార్యమంలో పాల్గొనకపోతే  ఎమవుతుందోనని హడలిపోతున్నారు. అంతే కాకుండా మంత్రులు వరుస పర్యటనలతో అధికారులకు వారి కార్యక్రమాలకు హాజరు కావడానికే సమయమంతా సరిపోతోంది. వారంలో ముగ్గురు మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చారంటే అధికారులు ఆఫీసులకు వెళ్లకుండానే పర్యటనలకు హాజరవుతున్నారు. జిల్లా స్థాయి అధికారులు నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాల్సి ఉండటంతో పాటు కార్యాలయంలో ముఖ్యమైన ఫైళ్లు చూడాల్సి ఉంటుంది. ఎన్ని పనులు ఉన్నా మంత్రులు పర్యటనలకు వచ్చారంటే తప్పనిసరిగా హాజరుకావాల్సిందే.  ఇక అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కొరవడుతున్నది. ఈ పరిస్థితి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం రెండు జిల్లాల అధికారులు ఎదుర్కొంటున్నారు.. మరో వైపు ఖమ్మం పట్టణంలో ఏ మంత్రి పర్యటించినా పోలీసు, అధికార యంత్రాంగం అంతా మంత్రి కాన్వాయ్ లోనే ఉంటున్నారు.. దీంతో పట్టణ ప్రజలు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కాన్వాయ్ లో భారీగా వాహనాలు ఉండటం వల్ల కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు ప్రజల వాహనాలను నిలిపివేస్తున్నారు. కాన్వాయ్ లో మంత్రుల వాహనాలతో పాటు అనుచరగణం భారీగానే పాల్గొంటున్నారు. జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది. తుమ్మల నాగేశ్వరావు మాత్రం సీతారామ ప్రాజెక్టు వెంటపడి  సాగర్ కాలువలకు లింక్ చేశారు. భట్టి, పొంగులేటి గ్రామీణ రహదారులను బాగుచేసే పనిలో ఉన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడుముక్కలాట! Publish Date: Apr 2, 2025 7:28AM

రంజాన్ ప్రార్థనలో పువ్వాడకు అవమానం!

రంజాన్ పర్వదినం రోజున మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కు అవమానం జరిగింది. రంజాన్ పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఈద్గా మైదానంలో ప్రార్థనలు చేస్తున్నారు. ఇదే సమయంలో పువ్వాడ అజయ్ అక్కడికి చేరుకున్నారు. ప్రార్థనలో పాల్గొనే ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ఒక షామియానా వేశారు. ఈ షామియానా లో కేవలం ముస్లిం సోదరులే కూర్చోవాలని ఇతరులు వేరే షామియానాలో కూర్చోవాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలియని అజయ్ ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా వేసిన షామియాలోకి వెళ్లి కూర్చున్నారు. దీంతో ముస్లిం పెద్దలు అజయ్ ను అక్కడ నుంచి లేచి వెళ్లి మరో షామియానా కింద కూర్చోవాలని సూచించారు. దీంతో అజయ్ కాస్త ఇబ్బంది పడుతూ తాను మంత్రిగా ఉన్నప్పుడు ముస్లిం సోదరులకు , ఆ కమ్యూనిటీ కి ఎంతో సేవచేశానని చెబుతూ అక్కడి నుండి వెళ్లిపోయారు. కూర్చునే ముందు చెప్పకుండా కూర్చున్న తరువాత లేచిపోవాలని చెప్పడం అజయ్ అవమానంగా భావించి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
రంజాన్ ప్రార్థనలో పువ్వాడకు అవమానం! Publish Date: Apr 2, 2025 7:19AM

మాజీ మంత్రి కాకాణికి హైకోర్టు షాక్.. ఇక అరెస్టేనా?

అక్రమ మైనింగ్ కేసులో వరుసగా రెండు సార్లు పోలీసు విచారణకు డుమ్మా కొట్టిన కాకాణి ఇప్పుడు మరింత చిక్కుల్లో కూరుకుపోయారు. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు ఆయనకు షాక్ ఇచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు మంగళవారం (ఏప్రిల్ 1) కొట్టివేసింది.  ఈ కేసులో అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించజాలమంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఏ క్షణమైనా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేసులకు భయపడనంటూ గంభీర ప్రకటనలు చేసిన కాకాణి తీరా పోలీసులు నోటీసులు అందజేయడానికి వస్తే అజ్ణాతంలోకి వెళ్లి పోవడం తెలిసిందే.   వైసీపీ అధికారంలో ఉండగా  ఆయన నెల్లూరు జిల్లాలో అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను ఆధారం చేసుకుని  పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణిని ఏ4గా పోలీసులు చేర్చారు. వరుసగా రెండు సార్లు పోలీసులు ఇచ్చిన నోటీసులను ఖాతరు చేయకుండా విచారణకు డుమ్మా కొట్టిన కాకాణి, మంగళవారం (ఏప్రిల్ 1)న తాను బుధవారం తరువాత అంటే గురువారం అందుబాటులో ఉంటాను అంటూ సమాచారం పంపారు.  అదే సమయంలో కాకాణి బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణకు రాగా, పోలీసులు కాకాణి విచారణకు గైర్హాజర్ అయిన విషయాన్నీ అలాగే రెండు రోజులుగా నోటీసులు తీసుకోకుండా కాకాణి తప్పించుకు తిరుగుతున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.  
మాజీ మంత్రి కాకాణికి హైకోర్టు షాక్.. ఇక అరెస్టేనా? Publish Date: Apr 1, 2025 5:30PM

నృత్య రీతుల్లో అత్యంత క్లిష్టమైనది కూచిపూడి!

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎనిమిది క్లాసికల్ నృత్య రీతులలో  కూచిపూడి నృత్యం అత్యంత క్లిష్టమైనది. దీనిలో కాలి వేళ్లనుండి ఆపాదమస్తకం డాన్స్ లో భాగం గా స్పందించి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతటి గొప్ప కళ ప్రపంచంలో మరెక్కడా లేదని ఆల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ,సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చలాది  పూర్ణచంద్ర రావు పేర్కొన్నారు . ఉగాది ఉత్సవాల సందర్భంగా మచిలీపట్టణం సమీపంలోని  కూచిపూడి నాట్యకళకు జన్మ స్థలం  కూచిపూడిలో  రెండురోజులపాటు  నాట్యగురు,కేంద్ర సాహిత్య,నాటక అవార్డు గ్రహీత డా. వేదాంతం రాధే శ్యామ్ నేతృత్వం లో  జరుగుతున్న "కూచిపూడి నాట్య శిల్పారామం"  నృత్యోత్సవాలలో  మొదటిరోజు ముఖ్య అతిధిగా  పాల్గొన్న వేదాంతం రాధేశ్యామ్   జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు.  పేద మధ్య తరగతి విద్యార్థులు ఈ అపురూపమైన నృత్యం నేర్చుకున్నప్పటికీ పలువురు ప్రదర్శనలు ఇచ్చేందుకు అవసరమైన ఖరీదైన కాస్ట్యూమ్స్,ఇమిటేషన్ ఆభరణాలు కొనలేని స్థితిలో  వున్నారనీ, అటేవంటివవారికి ప్రభుత్వం, దాతలు నృత్య దుస్తులు, ఇమిటేషన్ ఆభరణాలు  సమకూర్చాలని కోరారు.  నాట్య గురు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ బాల కొండలరావు   విశాఖపట్నం లో తానూ స్థాపించిన కూచిపూడి నాట్య అకాడెమి ద్వారా వేలాది మంది నృత్య కళాకారిణులను తీర్చి దిద్దినట్లు ఆమె తెలిపారు.  విశాఖపట్నం, పార్వతీపురం,హైదరాబాద్,లతో పాటు పలు ప్రాంతాలనుండి వచ్చిన విద్యార్థులు, నాట్య గురువు లతో కూచిపూడి లొ ఉగాది నాట్య ఉత్సవం వైభవంగా జరిగింది.  
నృత్య రీతుల్లో అత్యంత క్లిష్టమైనది కూచిపూడి! Publish Date: Apr 1, 2025 5:19PM