పాపం శ్రీలక్ష్మి!

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పరిస్థితి చూస్తే ఎవరికీ అయ్యో పాపం అని కూడా అనాలని అనిపించదు.  ఎందుకంటే గతంలో ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి జైలుకు వెళ్లారు. జగన్ క్విడ్ ప్రొకో కేసులలో విచారణను ఎదుర్కొన్నారు. ఆ అరెస్టులు, విచారణల ఒత్తిడి కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై చాలా కాలం వీల్ చైర్ కే పరిమితమయ్యారు. అయితే అప్పటి తప్పిదాల నుంచి ఆమె ఎటువంటి పాఠాలూ నేర్చుకోలేదు. 2019 ఎన్నికలలో విజయం సాధించి జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత.. ఆమె తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. అలా వచ్చిన ఆమెకు జగన్ కీలక పోస్ట్ ఇచ్చారు.  సీనియర్ ఐఏఎస్ అధికారిణి యర్రా శ్రీలక్ష్మి ఓబుళాపురం మైనింగ్ కేసులో జైలుకు వెళ్లి జగన్ క్విడ్ ప్రోకో కేసుల్లో విచారణను ఎదుర్కొన్నారు. అప్పట్లో, కేసుల ఒత్తిడి ఆమె ఆరోగ్యం క్షీణించింది మరియు చాలా నెలలు ఆమెను వీల్ చైర్‌కు పరిమితం చేసింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను తెలంగాణ క్యాడర్ నుంచి తీసుకొచ్చి ప్రభుత్వంలో కీలక పోస్టింగ్ ఇప్పించారు.  ఆమె జగన్ కోసం మళ్లీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఏ పోస్టింగ్ లేకుండా ఉన్నారు. అది పక్కన పెడితే  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరబ్ కుమార్ ప్రసాద్ మరి కొద్ది రోజులలో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తదుపరి సీఎస్ ఎవరు అన్న చర్చకు వచ్చింది. సీనియారిటీని బట్టి చూస్తే నీరబ్ కుమార్ ప్రసాద్ స్థానంలో  శ్రీలక్ష్మి నియమితురాలు అవ్వాల్సి ఉంటుంది. అయితే  జగన్ తో మఅంటకాగి నింబంధనలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కారణంగా ఆమెకు ఆ పదవి దక్కే అవకాశాలు ఇసుమంతైనా లేవు.  దీంతో ప్రతి ఐఏఎస్ కలలు కనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి శ్రీలక్ష్మికి అందే అవకాశం లేకుండా పోయింది. అయితే ఇందుకు కారణం ఆయన స్వయం కృతాపరాధమేనని ఏపీ సెక్రటేరియెట్ లో చర్చ జరుగుతోంది.  జగన్  కోసం నిబంధనలను తుంగలోకి తొక్కినందుకు శ్రీలక్ష్మి మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అంటున్నారు.  ఆమె మూల్యం చెల్లిస్తోందని ఏపీ సెక్రటేరియట్ లాబీల్లో చర్చ జరుగుతోంది.  ఏది ఏమైనా శ్రీలక్ష్మికి సీఎస్ పదవి దక్కకపోవడానికి అన్యాయాలకు కొమ్ము కాసి, అధికార పార్టీ అవకతవకలు, ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి వంత పాడటమే కారణమని అంటున్నారు. 
Publish Date: Dec 25, 2024 2:01PM

అల్లు అర్జున్ కు తత్వం బోధపడినట్లేనా?

అల్లు అర్జున్  తన సినీమాలు వరుస విజయాలు అందుకుంటుండటంతో ఆయన యాటిట్యూడ్ మారిందన్న విమర్శలు గత కొంత కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్ లో  అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం మాత్రం పెను వివాదానికి దారి తీసింది. అప్పటి వరకూ కలిసిమెలిసి ఉన్న అల్లు, మెగా కుటుంబాల మధ్య వివాదాలకు, విభేదాలకు అది కారణమైందన్న వాదనా ఉంది. మొత్తం మీద అల్లు అర్జున్ నంద్యాల ప్రచారం తరువాత నుంచి   అల్లు, మెగా అభిమానుల మధ్య  వైరం ప్రస్ఫుటంగా తెరమీదకు వచ్చింది. మెగా అభిమానులు అల్లు అర్జున్ కు దూరం అయ్యారు. ఆ ప్రచారం పుష్ప2పై తీవ్ర ప్రభావం చూపుతుందన్న అనుమానాలు కూడా అప్పట్లో వ్యక్తం అయ్యాయి. సినిమాపై ప్రభావం సంగతి పక్కన పెడితే ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నంద్యాలలో ప్రచారం చేసిన నాటి నుంచి అల్లు అర్జున్ కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు.   ఇక అప్పుడు పుష్ప2 బెనిఫిట్ షో లేదా ప్రీమియర్ షో  సందర్భంగా  సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట సంఘటనను  వైసీపీ తనకు అంది వచ్చిన అవకాశంగా భావించి అల్లు అర్జున్ కు బాసటగా నిలిచింది. అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ వైసీపీ అధినేత జగన్ కూడా స్పందించారు.  అల్లు అర్జున్ కు సంఘీభావం తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.  దీనిని ఆంధ్రప్రదేశ్ లో మెగా ఫ్యామిలీ పరపతిని తగ్గించేందుకు, అలాగే కాపు ఓటు బ్యాంకులో చీలిక తెచ్చి తనకు అనుకూలంగా మలచుకునేందుకు వైసీపీ నానా ప్రయత్నాలూ చేసింది. వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీ అనుకూల, సొంత మీడియా కూడా అల్లు అర్జున్ కు మద్దతుగా కథనాలు వండి వార్చింది. అల్లు అర్జున్ అరెస్టు వెనుక మెగా రాజకీయం ఉందన్న భావాన్ని ప్రజలలో నటేందుకు ప్రయత్నాలు చేసింది.  మరో వైపు తెలంగాణలో అధికారానికి దూరమై అసహనంతో ఉన్న బీఆర్ఎస్ కూడా అల్లు అర్జున్ అరెస్టు అంశాన్ని తనకు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే అంశంగానే భావించి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ కు వ్యతిరేకంగా పెద్ద పెద్ద ఆరోపణలనే గుప్పించింది. బీఆర్ఎస్ ట్రాప్ లో అల్లు అర్జున్ పడ్డారా అన్న అనుమానం కలిగే విధంగా అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ లో సంధ్యా ధియోటర్ తొక్కిసలాటకు కారణం జనాలను నియంత్రించడంలో పోలీసుల వైఫల్యమే కారణం అన్నట్లుగా మాట్లాడారు. అయితే పోలీసులు అల్లు అర్జున్ రోడ్ షో వీడియోలను విడుదల చేయడంతో ఆయన నేల మీదకు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. పోలీసుల విచారణలో ఆయన తన తప్పు ఒప్పుకున్నారనీ, సారీ చెప్పారనీ వార్తలు వినవస్తున్నాయి. అదంతా పక్కన పెడితే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో వైసీపీ అత్యుత్సాహం ఆ పార్టీని ప్రజలలో మరింత పలుచన చేసింది.  ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టై విడుదలైన తరువాత మీడియాతో మాట్లాడిన  ఏ సందర్భంలోనూ ఆయన జగన్ ప్రస్తావన కానీ, వైసీపీ ప్రస్తావన కానీ తీసుకురాలేదు. అంతే కాకుండా అల్లు అర్జున్ స్వయంగా  చిరంజీవి నివాసానికి, నాగబాబు ఇంటికి వెళ్లి మరీ తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ణతలు తెలిపి వచ్చారు. దీనిని బట్టే తన నంద్యాల ప్రచారం తొందరపాటేనని అల్లు అర్జున్ పరోక్షంగా అంగీకరించినట్లైంది.  అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీతో మరింత కలివిడిగా ఉండేందుకే ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని తేటతెల్లం చేసింది. దీంతో జగన్ పార్టీ అత్యుత్సాహం మీద అల్లు అర్జున్ నీళ్లు చల్లినట్లైంది.
Publish Date: Dec 25, 2024 1:16PM

శ్రీశైలంలో అన్యమత ప్రచారంపై నిషేధం

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయాల పవిత్రత పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. జగన్ హయాంలో రాష్ట్రంలో ఆలయాలపై జరిగిన దాడులు, జరిగిన అపచారాల సంగతి తెలిసిందే. సాక్షాత్తూ కలియుగ వైకుఠం అనే తరుమలలోనే పవిత్రతకు భంగం వాటిల్లే సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార పగ్గాలు చేపట్టిన తరువాత తిరుమల వెళ్లిన చంద్రబాబు రాష్ట్రంలో తిరుమల నుంచే ప్రక్షాళన ఆరంభిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అన్న మాట ప్రకారం ఆయన తిరుమల ప్రక్షాళనకు నడుంబిగించారు. తిరుమలలో భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడమే కాకుండా, పారిశుద్ధ్య పరిస్థితిని చక్కదిద్దారు. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకుండా చర్యలు చేపట్టారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్న, జల ప్రసాద వితరణను పునరుద్ధరించారు. కొండపై హోటళ్లలో పారిశుద్ధ్య పరిస్థితులను చక్కదిద్దారు. ఆహారం నాణ్యత విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో  కొలువులు చేస్తున్న అన్యమతస్థులను బదలీ చేశారు. అలాగే కొండపై అన్యమత చిహ్నాలను తొలగింపచేశారు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధించారు. అలాగే తాజాగా శ్రీశైలంలో కూడా అన్య మత ప్రచారాన్ని నిషేధించారు. అలాగే శ్రీశైలంలో అన్యమతాలకు సంబంధించిన కార్యకరాలపాలు, బోధనలపై నిషేధం విధించారు. అలాగే అన్యమత చిహ్నాలు కూడా శ్రీశైలంలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.   అన్యమతానికి సంబంధించిన ఫోటోలు కలిగిఉన్న వాహనాలు కూడా క్షేత్ర పరిధిలోకి అనుమతింబోమని ఈవో స్పష్టం చేశారు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ అన్యమత ప్రచారాలకు, అన్యమత కార్యక్రమాలకు సహకరించడం కూడా చట్టం ప్రకారం శిక్షార్హమే అని శ్రీశైలం దేవస్థాన కార్యనిర్వహణాధికారి తెలిపారు. 
Publish Date: Dec 25, 2024 11:57AM

మాజీ మంత్రి బాలినేని.. ఏరీ? ఎక్కడా?

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మౌనం ప్రస్తుతం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ, అధికారం కోల్పోయిన తరువాత ఆయన జనసేన గూటికి చేరేంత వరకూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి నిత్యం వార్తల్లో నిలిచేవారు. ఆయన మాట్లాడితే ఒక సంచలనం అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. ఎవరు ఔనన్నా కాదన్నా బాలినేని ప్రకాశం జిల్లాలో తిరుగులేని నాయకుడు. ఇందులో సందేహం లేదు.  జిల్లా వ్యాప్తంగా ఆయనకు ప్రజలలో పరపతి ఉంది. జగన్ తొలి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న బాలినేని. ఆ తరువాత మూడేళ్లకు జరిగిన మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో కేబినెట్ లో స్థానం కోల్పోయారు. అప్పట్లో ఆయన వ్యక్తం చేసిన అసంతృప్తి జగన్ ను గాభరా పెట్టింది. సజ్జల వంటి వారి రాయబారాలు కూడా ఫలించకపోవడంతో జగనే స్వయంగా రంగంలోకి దిగి బాలినేనిని బుజ్జగించాల్సి వచ్చింది. జగన్ కు బంధువు కూడా అయిన బాలినేని.. ఇక అప్పటి నుంచీ జగన్ ప్రభుత్వం పతనమయ్యే వరకూ వైసీపీలోనే కొనసాగినా.. నిత్య అసమ్మతి వాదిగా మిగిలిపోయారు. ఒక దశలో ఆయన జగన్ పాలిట రెండో ఆర్ఆర్ఆర్ (అప్పటి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు)లా మారిపోతారా అన్న చర్చ కూడా రాజకీయవర్గాలలో జోరుగా సాగింది. ఏది ఏమైనా తన మాట చెల్లినా చెల్లకపోయినా బాలినేని మాత్రం ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలయ్యేంత వరకూ పార్టీలోనే ఉన్నారు. అయితే జగన్ తో ఆయన తీరు టామ్ అండ్ జెర్రీని తలపించేది. అలగడం, అవమానాలు భరించడం, అప్పుడప్పుడు ధిక్కార స్వరం వినిపించడం ద్వారా ఆయన అప్పట్లో జగన్ కు నిత్య తలనొప్పులు తెచ్చి పెట్టారు. మంకు పట్టు పట్టి మరీ ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి వైసీపీ నుంచి టికెట్ సాధించుకున్నా.. తాను కోరిన విధంగా మాగుంటకు ఒంగోలు లోక్ సభ టికెట్ ఇప్పించుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. సరే ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా ఒంగోలులో పరాజయాన్ని  చవి చూశారు. ఆ తరువాత ఆయన వైసీపీని వీడి జనసేన గూటికి చేరారు.  అక్కడి వరకూ బానే ఉంది. ఆయన జేనసేనలో చేరే సమయంలో పెద్ద ఎత్తున హంగామా చేయాలని భావించినప్పటికీ జనసేనాని పడనివ్వలేదు. బుద్ధిగా ఒక్కడిగా వచ్చి పార్టీ కండువా కప్పుకోవాలని విస్ఫష్టంగా చెప్పడంతో ఆయన జేనసేనలో చేరిక నిరాడంబరంగా జరిగిపోయింది.  ఒంగోలులో భారీ సభ ఏర్పాటు చేసి.. మందీ మార్బలంతో ఆర్బాటంగా జనసేన కండువా కప్పుకోవాలని ఆయన భావించినా జనసేనాని అంగీకరించలేదు. మంగళగిరి వచ్చి ఒక్కడిగా పార్టీ కండువా కప్పుకోవాలని ఆదేశించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన ఆ పని చేశారు. అప్పట్లో కొంత విరామం తరువాత జనసేన తరఫున ఒంగోలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జనసేనానినిని తీసుకువస్తానని అప్పట్లో బాలినేని చెప్పినప్పటికీ నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా పడలేదు. అలాగే పార్టీ పదవి, మండలి సభ్యత్వం ఆశించిన బాలినేనికి జనసేనాని వాటిని ఆవిరి చేశారని బాలినేని అనుచరులు చెబుతున్నారు. నాగబాబుకు మండలి సభ్యత్వం, కేబినెట్ లో స్థానం అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక బాలినేనికి రాజ్యసభ స్థానం జనసేన ద్వారా అందని ద్రాక్షేనని తేలిపోయింది. అసలు ఆయన జనసేన చేరికను ఆ పార్టీ మిత్రపక్షం తెలుగుదేశం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయన చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల నుంచి తెలుగుదేశం అభ్యంతరం చెప్పింది. వాటన్నిటినీ అధిగమించి ఎలాగోలా జనసేన తీర్థం పుచ్చుకున్న బాలినేనికి ఆయన ఆశించిన ప్రాధాన్యతా పార్టీలో దక్కకపోవడం నిరాశనే మిగిల్చింది. అయితే ఎలాగోలా జనసేనలో ఒకింత ప్రాధాన్యత సాధించుకోవాలన్న తాపత్రయంతో అదానీ నుంచి జగన్ కు ముడుపులు అందినట్లు అమెరికాలో కేసు నమోదైన సందర్భంలో బాలినేని మీడియా ముందుకు వచ్చి అప్పట్లో తాను మంత్రిగా ఉన్నానని గుర్తు చేసి మరీ అప్పట్లో తనను అర్ధరాత్రి లేపి మరీ సంతకాలు చేయమని జగన్ ఒత్తిడి చేశారని చెప్పి ఒకింత సంచలనం సృష్టించారు. అయితే అదేమీ ఆయనకు జనసేనలో పెద్ద పీట వేయడానికి దోహదపడలేదు. పార్టీ అధిష్ఠానం బాలినేనిని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో  బాలినేని గత్యంతరం లేని పరిస్థితుల్లో మౌనాన్ని ఆశ్రయించారు.  ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. దీంతో పొలిటికల్ సర్కిల్స్ లో బాలినేని ఏరీ? ఎక్కడా అంటూ చర్చ జరుగుతోంది. 
Publish Date: Dec 25, 2024 11:25AM

ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు?

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు నోటీసులు జారీ కానున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే ఐఏఎస్ అధికారి దాన కిశోర్ ను విచారించారు. సుదీర్ఘంగా దాదాపు ఏడు గంటల పాటు దానకిశోర్ ను విచారించిన ఏసీబీ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆయన విచారణ సందర్భంగా వెల్లడించిన వివరాల ఆధారంగా మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దాన కిశోర్ నుంచి పలు కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో  మరో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు కూడా నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశలు ఉన్నాయని చెబుతున్నారు.   ఫార్ములా ఈ-రేస్‌ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారి దానకిషోర్ ప్రభుత్వానికి ఇప్పటికే వివరాలు సమర్పించారు.  అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి  కేటీఆర్‌ ఆదేశాల మేరకే హెచ్‌ఎండీఏ నుంచి నిధులు బదిలీ అయినట్టు దానకిశోర్ ప్రభుత్వానికి వెల్లడించిన సంగతి విదితమే. ఇక ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ2గా అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను పేర్కొన్న సంగతి విదితమే. ఇలా ఉండగా ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కూడా ఫార్ములా ఈ రేస్ విషయంలో నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేపట్టిన సంగతి తెలసిందే. ఈడీ కూడా ఇదే కేసులో కేటీఆర్ కు త్వరలో నోటీసులు జారీ చేసే అవకాశాలున్నా యంటున్నారు.  
Publish Date: Dec 25, 2024 10:23AM

హస్తినను కమ్మేసిన పొగమంచు.. చలికి గజగజలాడుతున్న ఉత్తర భారతం

దేశ రాజధాని నగరం హస్తినను పొగమంచు కమ్మేసింది. చలి తీవ్రతతో మొత్తం ఉత్తర భారతం గజగజలాడుతున్నది. హస్తినలో అయితే ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. బుధవారం ఉదయం రాజధాని నగరంలో  9.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పొగమంచు కారణంగా ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వాయు కాలుష్యం మరోసారి పీక్స్ కు చేరడంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే పొగమంచు కారణంగా ఢిల్లీలో విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు రద్దు చేయగా, మరి కొన్నిటిని రీ షెడ్యూల్ చేశారు. అలాగే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.   
Publish Date: Dec 25, 2024 9:33AM