యువతిపై కత్తితో దాడి.. ఉన్మాదిని చిత‌క్కొట్టిన స్థానికులు..

మృగాలు రెచ్చిపోతూనే ఉన్నారు. ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చినా.. ఎంత క‌ఠినంగా శిక్షించినా.. ప్రేమోన్మాదుల ఆగ‌డాలు ఆగ‌డం లేదు. ప్రేమంటూ వెంట‌బ‌డ‌టం.. కాదంటే దాడుల‌కు తెగ‌బ‌డ‌టం. ప్రేమ పేరుతో అరాచ‌కం సృష్టిస్తున్నారు కొంద‌రు. తాజాగా హైద‌రాబాద్ గ‌చ్చిబౌలి ప‌రిధిలో ఇలాంటి ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. 
  
గచ్చిబౌలి పీఎస్‌ పరిధి వట్టినాగులపల్లిలో యువతిపై ఓ యువకుడు కత్తితో దాది చేశాడు. ఇంటికొచ్చి మ‌రీ హత్యకు ప్ర‌యత్నించాడు. యువతి అరుపులతో కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. స్థానికులు ప‌రుగున వ‌చ్చారు. హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన యువ‌కుడిని ప‌ట్టుకొని చిత‌క్కొట్టారు. అనంత‌రం పోలీసుల‌కు అప్ప‌గించారు. 

వట్టినాగులపల్లికి చెందిన ప్రేమ్‌సింగ్‌ డిగ్రీ చదువుతున్నాడు. ప్రేమించాలంటూ బాధిత యువ‌తిని కొంతకాలంగా వేధిస్తున్నాడు. స‌డెన్‌గా బుధ‌వారం అర్థ‌రాత్రి య‌వ‌తి ఇంటికొచ్చిన ప్రేమ్‌సింగ్ ఆమెపై క‌త్తితో అటాక్ చేశాడు. ఆ దాడిని యువ‌తి ఎదుర్కోవ‌డంతో స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డింది. ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. 

దాడి స‌మ‌యంలో ప్రేమ్‌సింగ్ ఫుల్‌గా తాగి ఉన్నాడు. మ‌ద్యం మ‌త్తులోనే ఈ ఘాతుకానికి ప్ర‌య‌త్నించాడు. స్థానికులు వాడిని కుమ్మేయ‌డంతో.. ప్రేమ్‌సింగ్‌కు బాగా గాయాల‌య్యాయి. వైద్యం కోసం ప్రేమ్‌సింగ్‌ను సైతం హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.