అయ్యయ్యో వద్దమ్మా.. సినిమా ఆఫ‌ర్లు.. చిత‌క్కొట్ట‌డాలు..

‘‘అయ్యయ్యో వద్దమ్మా’’.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న డైలాగ్ ఇది. ఓ యాడ్ డైలాగ్‌ ఈ రేంజ్‌లో వైర‌ల్ కావ‌డానికి కార‌ణం శ‌ర‌త్‌. అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా అంటూ శ‌ర‌త్ చేసిన డ్యాన్స్‌తో అత‌ను ఓవ‌ర్‌నైట్ స్టార్ అయిపోయాడు. మీమ్స్‌కు మంచి స‌రుక‌య్యాడు. హైద‌రాబాద్ పోలీసులు సైతం అయ్య‌య్యో వ‌ద్ద‌మ్మా అంటూ యాడ్ తీశారు. అందుకే, సోషల్ మీడియా మొత్తం శ‌ర‌త్ ఫోటోల‌తో, ఆ డైలాగ్‌తో నిండిపోతోంది. ఈ పాపులారిటీనే ఇప్పుడు అత‌నికి మంచి-చెడు రెండూ చేసింది. 

మంచి ఏంటంటే.. శ‌ర‌త్ పాపులారిటీ చూసి రెండు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వ‌చ్చాయి. చిన్నా రోలే అయినా ఛాన్స్ ఇస్తామ‌న్నారు. ఇక‌, మ‌రో టీవీ యాడ్ కోస‌మూ శ‌ర‌త్‌ను సంప్ర‌దించారు. ఇలా అత‌ని లెవ‌ల్ పెరుగుతుండ‌డం.. సెల‌బ్రిటీగా మారుతుండ‌డం.. అత‌ని ప్ర‌త్య‌ర్థులు త‌ట్టుకోలేక పోయారు. క‌ళ్ల మంట‌తో శ‌ర‌త్‌పై విచ‌క్ష‌ణ ర‌హితంగా దాడి చేసి కొట్టారు. 

శ‌ర‌త్ ముక్కు నుంచి ర‌క్తం కారేలా దారుణంగా కొట్టారు. క‌న్నుకు సైతం తీవ్ర గాయ‌మైంది. గాయ‌ప‌డిన శ‌ర‌త్ ఫోటోలు సైతం సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. మొద‌ట హిజ్రాలే అత‌నిపై అటాక్ చేశారంటూ ఫేక్ న్యూస్ వ‌చ్చింది. కానీ, త‌న‌పై దాడి చేసింది త‌న శ‌త్రువులేనంటూ కాస్త కోలుకున్నాక తాజాగా శ‌ర‌త్ క్లారిటీ ఇచ్చారు. 

‘‘నా వ్యతిరేక వర్గం నాపై దాడి చేసింది. గతంలో నా చెల్లిని వేధింపులకు గురిచేస్తుంటే సాయి, హరి వర్గంపై దాడి చేశాను. ఆ కేసులో నేను గతంలో జైల్‌కు వెళ్లి, బెయిల్‌పై బయటికి వచ్చాను. నేను బెయిల్‌పై జైలు నుంచి బయటకు రాగానే నాకు రెండు సినిమా ఆఫర్లు వచ్చాయి. ఒక యాడ్ చేయడానికి కూడా ఆఫర్ వచ్చింది. దీన్ని జీర్ణించుకోలేక, నా ఎదుగుదలను ఓర్చుకోలేక నాపై విచక్షణ రహితంగా దాడి చేశారు’’ అని శర‌త్‌ చెప్పారు. త‌న‌పై దాడి చేసిన సాయి, హరి వర్గంపై రామగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయ‌గా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.