Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇంటర్వ్యూలో సెలెక్టైతేనే అసెంబ్లీ టికెట్.. స్టాలిన్ కొత్త పంధా
posted on: Mar 22, 2026 10:06AM
.webp)
ఏ రాజకీయపార్టీ నుంచైనా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలంటే ఆ పార్టీ టికెట్ ఇవ్వాలి. అలా టికెట్ దక్కించుకోవాలంటే ఆ పార్టీలో పై స్థాయి నాయకుల ఆశీస్సులు, అలాగే సమాజిక సమీకరణాలూ కీలకం. అయితే తమిళనాడులో మాత్రం అధికార పార్టీ అందుకు భిన్నంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో వినూత్న పంధా అనుసరిస్తోంది. త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి అధికార డీఎంకే పార్టీ టికెట్ దక్కాలంటే వారు నేరుగా ముఖ్యమంత్రి స్టాలిన్ ఎదుట ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందే. ఇందు కోసం సదరు ఆశావహ అభ్యర్థులు నిర్ణీత రుసుము చెల్లించి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్లికేషన్ పెట్టుకోవడానికి విభాగాల వారీగా రెండు రకాల ఫీజులను డీఎంకే నిర్ణయించింది. అదెలా అంటే రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్.
ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూకు అభ్యర్థులు తమ సొంత ఖర్చుతో రావాలి. ఇంతకీ ఈ ఇంటర్వ్యూ ఎందుకంటే.. సీఎం స్టాలిన్ స్వయంగా చేసే ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థుల సమార్థ్యాన్ని, అతడికి రాజకీయాల పట్ల ఉన్న అవగాహనను, ప్రజాసేవ పట్ల ఉన్న తపనను పరిశీలిస్తారు. అలాగే సదరు క్యాండిడేట్ ఆర్థిక నేపథ్యం తదితర విషయాలను కూడా పరిశీలిస్తారు. ఈ ఇంటర్వ్యూ ఐదారు నిముషాల పాటు ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే యువత, విద్యావంతులు కూడా ఈ ఇంటర్వ్యూల కోసం బారులు తీరుతున్నారు.
గతంలో దివంగత నేత కరుణానిధి కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇదే పంథా అవలంబించేవారు. ఇప్పుడు సీఎం స్టాలిన్ కూడా తండ్రి బాటనే అనుసరిస్తున్నారు. ఇదే తరహాలో అభ్యర్థులను వడపోసేవారు. ఇప్పుడు స్టాలిన్ అదే సంప్రదాయాన్ని మరింత పక్కాగా అమలు చేస్తున్నారు. అర్హులైన, సమర్థులైన నాయకులను గుర్తించడమే కాకుండా ఇంటర్వ్యూల కోసం వసూలు చేసే ఫీజు ద్వారా పార్టీకి నిధులు సమకూర్చుకోవడం కూడా జరుగుతుందని స్టాలిన్ ఈ పద్ధతిని ఎంచుకున్నారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి.
కాగా పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం డీఎంకే అనుసరిస్తున్న ఈ అభ్యర్థుల ఎంపికపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. అభ్యర్థులను సీఎం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం అన్న పద్ధతి పారదర్శకతకు నిదర్శనంగా కొందరు, ఫీజుల వసూలు అంటూ సొమ్ములు దండుకునే వ్యూహంగా మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం స్వయంగా ముఖ్యమంత్రి స్టాలినే ఇంటర్వ్యూ చేయడం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.


.webp)
.webp)


