Top Stories

తెలంగాణ పంచాయతీ ఎన్నికల బరిలో తెలుగుదేశం?.. చంద్రబాబు వ్యూహమేంటి?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా మారింది. ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రికార్డులు సృష్టించింది. జగన్ ఐదేళ్ల పాలనలో అష్టకష్టాలూ పడిన జనం స్వచ్ఛందంగా తెలుగుదేశం సభ్యత్వం కోసం క్యూ కడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ గతంలో ఎన్నడూ లేనంత అధికంగా తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి స్పందన లభించింది. దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి అంతగా పట్టు లేదని భావించే రాయలసీమ జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలంగా మారింది. దీంతో ఆ పార్టీ అధినేత ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించారు. ఆ రాష్ట్రంలో కూడా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.   ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండీ సీఎం చంద్రబాబు   తెలంగాణ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు.   తెలంగాణలో నిర్వహించిన పార్టీ  సభ్యత్వ నమోదుకు అపూర్వ స్పందన లభించింది. వాస్తవానికి తెలంగాణలో పార్టీకి క్షేత్రస్థాయిలో చెప్పుకోదగ్గ బలం ఉంది. క్యాడర్ ఉంది. రాష్ట్రంలోని సగానికి పైగా నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగేంత బలం తెలుగుదేశం పార్టీకి ఉంది. అయితే  దానిని క్రియాశీలంగా మార్చేందుకు అవసరమైన నాయకత్వం మాత్రం కరవైంది. రాష్ట్ర విభజన తరువాత పార్టీని నేతలు వీడికా క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉందని పరిశీలకులు పలు సందర్భాలలో సోదాహరణగా విశ్లేషణలు చేశారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంలో తెలుగుదేశం క్యాడర్ ది చాలా కీలకమైన పాత్ర అని పరిశీలకుల భావన.  ఇక ఇప్పుడు చంద్రబాబు తాజాగా తెలంగాణపై దృష్టి సారించడంతో ఇంత కాలం వేరే వేరే పార్టీలలో ఉన్న నేతలు ఒకరి తరువాత ఒకరుగా తెలుగుదేశం గూటికి చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తీగల కృష్ణా రెడ్డి వంటి నేతలు ఇప్పటికే బాహాటంగా తెలుగుదేశం వైపు చూస్తున్నట్లు ప్రకటించారు కూడా. అలాగే మాజీ మంత్రి బాబూమోహన్ సైతం తెలుగుదేశం గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఇక  తాజా నివేదికల ప్రకారం, ఫిబ్రవరి నెలలో జరగనున్న తెలంగాణ పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పోటీ చేయడానికి సమాయత్తమౌతోంది. ఆ తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికలు, అటు పిమ్మట 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా తెలుగుదేశం పోటీ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందు కోసం త్వరలోనే చంద్రబాబు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   తెలంగాణలో పార్టీ పునరుజ్జీవనం గురించి చర్చించడానికి చంద్రబాబు నాయుడు ఇటీవల ఎన్నికల వ్యూహకర్తలు ప్రశాంత్ కిషోర్,  రాబిన్ శర్మలతో చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.  తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఇటీవల చంద్రబాబు చేయించిన సర్వేలో  గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ కేడర్   బలంగా ఉందని, అయితే క్యాడర్ కు దిశానిర్దేశం చేసే నాయకత్వమే కరవనీ తేలింది. దీంతో ఆ కొరతను తీర్చేందుకు చంద్రబాబు కసరత్తు ప్రారంభించారని అంటున్నారు.  ఇందు కోసం రాష్ట్ర విభజన తర్వాత వివిధ కారణాలతో తెలుగుదేశం పార్టీని వీడి ఇతర పార్టీల పంచన చేరిన నాయకులను సొంత గూటికి చేరేందుకు తలుపులు బార్లా తెరిచినట్లు చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. మాజీలంతా తెలుగుదేశం గూటికి చేరితే రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తథ్యమని అంటున్నారు. 
Publish Date: Dec 31, 2024 2:12PM

ఏడాది పాలనలో కానరాని రేవంత్ ముద్ర!

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పార్టీని విజయపథంలో నడిపించి, విజయం తరువాత అధిష్ఠానం ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలకు దాదాపుగా చరమగీతం పాడేశారు. సీఎంగా ఆయనకు పార్టీ నుంచీ, మంత్రివర్గ సహచరుల నుంచీ సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి సాధించిన అతి గొప్ప విజయాలలో ఇది ప్రధానమైనదిగా చెప్పవచ్చు. చివరి క్షణం వరకూ ముఖ్యమంత్రి పదవి కోసం రేవంత్ తో పోటీ పడిన ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రేవంత్ కేబినెట్ లో కీలక పదవులలో ఉన్నారు. రేవంత్ నాయకత్వంలో వారు అరమరకలు లేకుండా పని చేస్తున్నారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు కూడా రేవంత్ నాయకత్వాన్ని అంగీకరించి పని చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర కాంగ్రెస్ లో ఐకమత్యం కనిపిస్తోంది. ఇంతటి సానుకూల వాతావరణంలో రేవంత్ తనదైన దూకుడుతో పాలనలో తనదైన ముద్ర వేస్తారని అంతా భావించారు.  అయితే తన ఏడాది పాలనలో రేవంత్ అటువంటి ముద్ర వేయడంలో విఫలమైనారన్నదే పరిశీలకుల విశ్లేషణ. రేవంత్ ఏడాది పాలనలో పెద్దగా ఘనతలు ఏమీ లేవని అంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆయన పూర్తిగా సఫలీకృతుడు కాలేకపోయారు.  అలాగే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో కూడా  ఆయన అడుగులు తడబడుతున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు విషయంలో రేవంత్ పూర్తిగా సక్సెస్ కాలేదు.  కొన్ని పథకాలు ప్రారంభమయ్యాయి కానీ లబ్ధిదారుల సంఖ్య తగ్గిందని, చాలా మంది ఇబ్బందులు పడ్డారని విమర్శలు వచ్చాయి. అలాగే ఎన్నికలకు ముందు దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీకి ఇప్పటికీ మరమ్మతులు చేయకపోవడం, అత్యంత ఖరీదైన నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరం నిరుపయోగంగా మారడం కూడా రేవంత్ పై విమర్శలకు తావిచ్చింది.  ఇక మేడిగడ్డ, కాళేశ్వరంలు పూర్తిగా నిరుపయోగంగా మారడానికి, తద్వారా కేసీఆర్ ను బదనాం చేయడానికి రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా వాటిని పక్కన పెట్టేయడమే కారణమన్న విమర్శలూ గట్టిగా వినిపిస్తున్నాయి.  తెలంగాణ ముఖ్యమంత్రికి, హైదరాబాద్‌కు మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు పెట్టుబడుల ఆకర్షణ చాలా ముఖ్యమైనవి. ఆ దిశగా ముందుకు సాగాల్సి ఉంటుంది. హైదరాబాద్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులలో కొనసాగింపు ఉంది కానీ రేవంత్ రెడ్డి ముద్రను సూచించే కొత్త ప్రాజెక్టులు ఏవీ ఈ ఏడాది కాలంలో ప్రారంభం కాలేదు. ఆ దిశగా అడుగులు పడిన దాఖలాలు కూడా లేవు. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా రేవంత్ పాలనా పగ్గాలు చేపట్టిన ఈ ఏడాది కాలంలో పెద్దగా కదలిక లేదు.  ఇక పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఆ సినిమా హీరో అల్లు అర్జున్ పై కేసు, అరెస్టు విషయంలో రేవంత్ దూకుడుపై మిశ్రమ స్పందన వచ్చింది.   మొత్తం మీద 2024లో రేవంత్ పాలనలో తనదైన ముద్ర వేయడంలో విఫలమయ్యారన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. 
Publish Date: Dec 31, 2024 1:36PM

ఫణిగిరి బౌద్ధ శిల్పాలు అద్భుతం

కొనియాడిన విదేశీ బౌద్ధ పరిశోధకులు చరిత్రను వివరించిన శివనాగిరెడ్డి   నాగారం మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల  దూరంలో ఉన్న రెండు వేల ఏళ్ల నాటి ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించిన విదేశీ బౌద్ధ పరిశోధకులు, స్థానిక ప్రదర్శనశాలలోని శిల్పాలను కొనియాడారని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, బుద్ధవనం కన్సల్టెంట్, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. న్యూజిలాండ్ కు చెందిన ప్రొఫెసర్ సారా, ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్ జాఫ్రీషా ఫణిగిరి కొండల పైనున్న బౌద్ధారామాన్ని మంగళవారం(డిసెంబర్ 31) సందర్శించారు.  స్థూపం, చైత్య గృహాలు, శిలామండపాలు, విహారాలు, స్థానిక ప్రదర్శనశాలలోని సిద్ధార్థుని జననం, మహాభినిష్క్రమణం, బుద్ధుని ధర్మ చక్రప్రవర్తన, జాతక కథల బుద్ధుని శిల్పాల గురించి ఈమని శివనాగిరెడ్డి వారికి వివరించారు. క్రీస్తుపూర్వం 1- క్రీస్తుశకం 4 శతాబ్దాల మధ్య ఫణిగిరి గొప్ప బౌద్ధ క్షేత్రం గా విలసిలిందని ఆయన వారికి చెప్పారు. సర్పంచ్ గట్టు నర్సింహారావు వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఫణిగిరి మ్యూజియం సిబ్బంది వీరయ్య, యాకయ్య, కార్తీక్ పాల్గొన్నారు.
Publish Date: Dec 31, 2024 1:02PM

కేసీఆర్ మౌనం.. ప్రభావం చూపని కేటీఆర్ నాయకత్వం.. జారుడుబండ మీద బీఆర్ఎస్!

తెలంగాణ సాధించిన పార్టీగా ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి 2024 సంవత్సరం అత్యంత గడ్డుకాలంగా మిగిలిపోతుంది. 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకుని అధికారం కోల్పోయిన బీఆర్ఎస్, ఆ తరువాత ఇప్పటి వరకూ కోలుకోలేదు సరికదా రోజు రోజుకూ దిగజారుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతినడానికి ప్రధాన కారణం ఓటమి తరువాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోవడం, మరో వైపు ఆయన స్థానంలో పార్టీని ముందుండి నడిపిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ఎటువంటి ప్రభావం చూపలేకపోవడమేనని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మరింత అధ్వానంగా పెర్ ఫార్మ చేసింది. ఒక్కటంటే ఒక్క లోక్ సభ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిన ఆ పార్టీ ఓటు బ్యాంకును కూడా భారీగా పోగొట్టుకుంది. కొన్ని స్థానాలలో డిపాజిట్ కూడా కోల్పోయింది. ఇంత జరిగినా ఆ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగలేదు. అంతెందుకు ఆయన కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత అరెస్టై చాలా రోజుల పాటు జైలులో ఉన్న సమయంలో కూడా కేసీఆర్ బయటకు రాలేదు. పూర్తిగా తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కే పరిమితమైపోయారు. ఈ కష్ట కాలంలో పార్టీని నడిపించిన కేటీఆర్ ఇసుమంతైనా ప్రభావం చూపలేకపోయారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆయన చేసిన ప్రకటనలు, ఆందోళనలు, విమర్శలు పెద్దగా ప్రజలను కదిలించలేదు. ఇక ఈ ఫార్ములా రేస్ కేసులో స్వయంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్.. తనను తాను డిఫెండ్ చేసుకోవడంలో కూడా సఫలీకృతుడు కాలేకపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ ప్రతిష్ఠ కోసమే ఈ ఫార్ములా రేస్ అంటూ చెప్పుకువచ్చిన కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము బదలాయింపు విషయంలో మాత్రం తన తప్పు లేదని అధికారులపై నెట్టేసి తప్పుకోవడానికి చూడటం పార్టీ క్యాడర్ లో కూడా అసంతృప్తికి కారణమైందని చెబుతున్నారు. రుణమాఫీ, రైతు భరోసా వంటి అంశాలలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు రైతులను కదిలించడంలో విఫలమయ్యాయి. ఇక ఈ ఫార్ములా రేస్ కేసులో ఏసీబీతో పాటు ఈడీ కూడా కేసు నమోదు చేసి కేటీఆర్ కు నోటీసులు పంపింది. ఈ కేసులో ఫెమా, ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన జరిగిందని, నిబంధనలను తుంగలో తొక్కి ఫార్ములా ఈ రేసింగ్ నిర్వాహకులకు అక్రమ చెల్లింపులు జరిగాయనీ ఆధారాలు ఉన్నాయనీ ఈడీ చెబుతోంది. ఈ కేసులో కేటీఆర్ అరెస్టు అయ్యే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. అదే జరిగితే బీఆర్ఎస్ పరిస్థితి మరింత దిగజారుతుందని పార్టీ శ్రేణులలో ఆందోళన వ్యక్తం అవుతోంది. 
Publish Date: Dec 31, 2024 12:07PM

2025.. జగన్ బొమ్మను పీకి పాడేసిన కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఫొటోల పిచ్చి చాలా చాలా ఎక్కువగా ఉండేది. అది ఆయన అధికారంలో ఉండగా పీక్స్ కు చేరింది. వైసీపీ నేతలే ఎవడికైనా చూపించండ్రా.. అలా వదిలేయకండ్రా అని అప్పట్లో తమలో తాము గుసగుసలాడుకేనే వారు. వైసీపీ పరాజయం తరువాత ఆ విషయాన్ని ఆ పార్టీ నేతలే ఆఫ్ ది రికార్డుగా పలు సందర్భాలలో చెప్పారు.  జగన్ హయాంలో  ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, ఆఫీసుల్లోనే కాదు భూమి రికార్డుల్లోనూ జ‌గ‌న్ బొమ్మలతో రెవెన్యూ, స‌ర్వే శాఖ‌లు భారీ ఫోటో ఎగ్జిబిష‌న్  చేశాయి. అన్నిటి కంటే విచిత్ర‌మేమంటే ఎల్‌పీఎం రికార్డుల్లోనూ ఆయ‌న ముఖ చిత్రం ముద్రించు కున్నారు.చివరాఖరకు సర్వే రాళ్లపై సైతం జగన్ బొమ్మ పెట్టుకున్నారంటే ఆయన పిచ్చి ఏ స్థాయిలో ఉండేదో ఎవరికైనా అవగతమౌతుంది.  జగన్ ఫొటోల పిచ్చి కూడా ప్రజలలో ఆయన ప్రతిష్ఠ దిగజారడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. చివరాఖరుకు పట్టాదారు పాసు పుస్తకాలపై కూడా జగన్ ఫొటో ఉండటంతో జనం తీవ్రంగా ఏవగించుకున్నారు. ఆయన సొంత నియోజకవర్గం అయిన పులివెందులలోనే ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లిన జగన్ సతీమణి భారతిని ఓటర్లు పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో ఏమిటంటూ నిలదీశారు. సరే జగన్ పార్టీ పరాజయం పాలైంది. అధికారాన్ని కోల్పోయింది. గత ఎన్నికలలో ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు సర్వే రాళ్ల నుంచి, పట్టాదారు పాసు పుస్తకాల వరకూ జగన్ ఫొటోలను తీసేయడానికి బోలెడంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది.  రాష్ట్ర ప్రభుత్వం ఏటా విడుదల చేసే వార్షిక క్యాలెండర్ పై కూడా  2019-24 మధ్య కాలంలో  అప్పటి ముఖ్యమంత్రి జగన్ చిత్రం మస్ట్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. క్యాలెండర్‌లోని ప్రతి పేజీలో జగన్ ఫోటో  నవరత్నాల లోగోలు ఉండేవి. ఆ ఐదేళ్లూ రాష్ట్ర ప్రభుత్వ వార్షిక క్యాలెండర్లు జగన్ ఫొటో ఎగ్జిబిషన్ లా ఉండేవి తప్ప క్యాలెండర్ గా ఉండేవి కావు.  ఇప్పుడు కూటమి ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 2025 వార్షిక క్యాలెండర్ లో  జగన్ ఆరంభించిన సంప్రదాయానికి ముగింపు పలకడమే కాకుండా, వినూత్నంగా, హుందాగా వర్తమాన రాజకీయ నాయకుల ఫొటోలకు తావే లేకుండా చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు తాజాగా విడుదల చేసిన వార్షిక క్యాలెండర్ లో  స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు,   ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య, మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి  ప్రముఖుల ఫొటోలు ఉన్నాయి.  ఐదు సంవత్సరాలుగా జగన్ బొమ్మతో  రోత పుట్టించిన ప్రభుత్వ వార్షిక క్యాలెండర్ ఇప్పుడు స్ఫూర్తిదాయక నేతల ఫొటోలతో విడుదల కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.  
Publish Date: Dec 31, 2024 11:13AM

ఏపీ సీఎంకు తెలంగాణ ముఖ్యమంత్రి కృతజ్ణతలు.. ఎందుకో తెలుసా?

తిరుమల దేవుని దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఇక నుంచి టీటీడీ అనుమతించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.   తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించేలా చూడాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖపై స్పందించిన చంద్రబాబు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడితో చర్చించి, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయించారు. అదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ ద్వారా తెలిపారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితో కలిసి చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తమ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తెలియ జేశారు.తెలంగాణకు చెందిన   ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతివారం ఏదైనా రెండు రోజుల్లో అంటే సోమవారం నుంచి గురువారం వరకు వీఐపీ బ్రేక్ దర్శనం  రూ.500/- టికెట్  కొరకు రెండు లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శన్ రూ. 300/- టికెట్ కొరకు రెండు లేఖలు స్వీకరించనున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఒక్కో లేఖపై గరిష్టంగా ఆరుగురు భక్తులను  దర్శనానికి సిఫార్సు చేయొచ్చని తెలిపారు.   తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాలకు టీటీడీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు, టీటీడీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞాపన లేఖలను అనుమతించడానికి ఆదేశాలిచ్చిన చంద్రబాబు గారికి కృతజ్ఞతలు అని పేర్కొంది.
Publish Date: Dec 31, 2024 9:36AM