బుద్ధా వెంకన్న అరెస్టు?

ఏపీ పోలీసుల ఒంటెత్తు పోకడలు కొనసాగుతూనే ఉన్నాయి. గుడివాడ ఘటన తరువాత టీడీపీ నేతల విమర్శలను కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. తామేం చేసినా చూస్తూ ఉండాల్సిందే తప్ప ఎదురు ప్రశ్నిస్తే ఎందాకైనా వస్తామన్నట్టుగా వారి ప్రవర్తన ఉందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కె.కన్వెన్షన్ ఎపిసోడ్ కు కొనసాగింపుగా కొడాలి నానిపై, రాష్ట్ర పోలీసు బాసు డీజీపీ గౌతమ్ సవాంగ్ పై విమర్శలు ఎక్కుపెట్టినందుకు విజయవాడ టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్నను అరెస్టు చేసేందుకు ఖాకీ యంత్రాంగం అంతా కదిలివచ్చింది. వెంకన్న చేసిన కామెంట్లపై వివరణ పేరుతో పోలీసులు వెంకన్న ఇంట్లో ప్రవేశించారు. నానిపై చేసిన కామెంట్లతో పాటు డీజీపీపై చేసిన కామెంట్లపై ఫోకస్ చేసి వెంకన్నను విచారించేందుకు సిద్ధమయ్యారు. 

పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారంటూ తీవ్రస్థాయిలో ఆక్రోశం వెళ్లగక్కిన టీడీపీ నేతలను వివరణ పేరుతో అరెస్టు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. చంద్రబాబునాయుడి  ఇంటిని టచ్ చేస్తే శవమై వెళ్తారని వెంకన్న నానికి వార్నింగ్ ఇవ్వగా... డీజీపీ అంటే డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీగా మారారంటూ పోలీసు బాసు మీద  సెటైర్లు రువ్వారు. దీనిపై బుద్ధా వెంకన్న నుంచి సంతృప్తికరమైన వివరణ రాకపోతే అరెస్టు చేసే అవకాశాలున్నాయి.