'ఆపరేషన్ గరుడ' ప్లేస్ లో 'ఆపరేషన్ బి'.. టీడీపీకి కష్టాలు తప్పవా?

posted on: Nov 10, 2018 11:29AM

 

గతంలో నటుడు శివాజీ.. ఓ జాతీయ పార్టీ 'ఆపరేషన్ గరుడ' పేరుతో ఏపీ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొన్ని పరిణామాలు చూసి 'ఆపరేషన్ గరుడ' నిజమేనా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు 'ఆపరేషన్ గరుడ' ప్లేస్ లో ఏపీని టార్గెట్ చేస్తూ మరో ఆపరేషన్ ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి ఈ ఆపరేషన్ గురించి చెప్పింది శివాజీ కాదు.. ప్రముఖ సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ. తాజాగా ఓ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

'ఆపరేషన్ గరుడ' ఫెయిల్ అయ్యేసరికి 'ఆపరేషన్ బి' పేరుతో త్వరలోనే మరో ఆపరేషన్ ప్రారంభమవుతుందని చెప్పి సంచలనం రేపారు. పదిహేను రోజుల్లోగా ఈ ఆపరేషన్ ప్రారంభమవుతుందని అన్నారు. నిన్న మొన్నటి వరకు వ్యాపారస్థులపై జరిపిన ఐటీ, ఈడీ దాడులు.. ఈసారి నేరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులపై జరుగుతాయని తెలిపారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నలుగురు మంత్రులు, 24 మంది వివిధ వ్యాపారాలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ అధినేత, మరియు ఎమ్మెల్యే లు వల్లభనేని వంశీ మోహన్,బొడే ప్రసాద్,బూరుగుపల్లి శేషారావు, ఆలపాటి రాజేందరప్రసాద్,కొమ్మాలపాటి శ్రీధర్, సిద్ధా రాఘవరావు.. ఎంపీ లు సీఎం రమేష్, మురళీమోహన్, విజయవాడ లోని ప్రముఖ హోటల్ డీవీ మానర్ యజమాని, KL యూనివర్సిటీ అధినేత పై త్వరలో ఐటీ, ఈడీ దాడులు జరగబోతున్నట్లు తమ్మారెడ్డి తెలిపారు.

ఇందుకోసం పీఎంవోలో ఒక అధికారి ప్రత్యేకంగా పనిచేస్తున్నారని కూడా చెప్పారు. అయితే ఇందులో నిజానిజాలు తనకు పూర్తిగా తెలియవని, తనకు అందిన సమాచారాన్నే బయటపెడుతున్నానని అన్నారు. ఈ విషయంపై తనను విచారణ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చని చెప్పారు. ఇందులో భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. తనకు తెలిసిన విషయాన్నే తాను చెప్పానని తెలిపారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చినందువల్లే టీడీపీని ఇబ్బందులపాలు చేసే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తోందని తమ్మారెడ్డి విమర్శించారు. జాతీయ రాజకీయాల్లో బాబు చురుగ్గా పాల్గొనకుండా ఉండేందుకే ఈ దాడులు జరగుతాయని అన్నారు. టీడీపీకి చెందిన నేతలను దొంగలుగా చూపించడం వల్ల జనాల్లో టీడీపీని చులకన చేయాలనేది బీజేపీ ఆలోచన అని చెప్పారు. 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలను దొంగలుగా చూపెడితే ఓటర్లలో దాని ప్రభావం ఎంత స్థాయిలో ఉంటుందో ఊహించగలమని అన్నారు. తనకు చంద్రబాబుపై ప్రత్యేకమైన అభిప్రాయం ఏమీ లేదని, గతంలో ఆయనను విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయడం మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తమ్మారెడ్డి అన్నారు. చూద్దాం మరి 'ఆపరేషన్ బి' ఏపీ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో.

google-ad-img
    Related Sigment News
    • Loading...