సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై ఫిర్యాదు... రామ్ గోపాల్ వర్మపై ఏపీలో కేసు
posted on Nov 11, 2024 1:08PM
వివాదాలకు కేంద్రం అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్ లో కేసు నమోదైంది. సామాజిక మాధ్యమంలో అనుచిత పోస్టులు, ప్రత్యర్థులపై దూషణలకు పాల్పడిన వారిపై ఇటీవల ఏపీ పోలీసులు సీరియస్ గా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై ఫిర్యాదు అందగానే పోలీసులు రియక్ట్ అవుతున్నారు. జగన్ హయాంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. వైసీపీ సోషల్ మీడియా వింగ్ బూతుల కర్మాగారంగా మారిపోయి.. అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన నేతలు, మహిళా నేతలపై అసభ్య పోస్టులు, మార్ఫింగ్ తో రెచ్చిపోయింది. అలా రెచ్చిపోయిన వారికి అప్పటి సీఎం జగన్ ప్రోత్సాహం, అండదండలు ఉండేవన్న విమర్శలు ఉన్నాయి. జోగి రమేష్ వంటి వారికి కేబినెట్ లో స్థానం లభించడం వంటి సంఘటనలు ఆ విమర్శలకు బలం చేకూర్చేవిగా ఉండేవి.
అలా సోషల్ మీడియాలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, వారి కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులతో రెచ్చిపోయిన వారిలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఒకరు. వహించిన జగన్ అధికారంలో ఉన్నంత కాలం రామ్ గోపాల్ వర్మ హద్దూ, అదుపూ లేకుండా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. అప్పట్లో జగన్ కోసం ఆయన దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా ప్రమోషన్ల పేరు చెప్పి చంద్రబాబు నాయుడు , లోకేష్, నారా బ్రాహ్మణి పైన వారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఇష్టారీతిగా పోస్టులు పెట్టారు.
వీటిపై ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలానికి చెందిన టీడీపీ నాయకుడు రామలింగ్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ చట్టం కింద రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేశారు. కాగా గతంలో వైసిపి ప్రభుత్వానికి మద్దతుగా రాంగోపాల్ వర్మ చంద్రబాబును పదేపదే టార్గెట్ చేశారు. ఏకంగా చంద్రబాబును నెగిటివ్ క్యారెక్టర్ గా తన సినిమాలలో చూపిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. సోషల్ మీడియాలో కూడా చంద్రబాబును టార్గెట్ చేసి తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పోలీసులు ఆయన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.