Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఒప్పు... తప్పు... బూతు...
posted on: Mar 17, 2015 3:18PM

తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న రాజకీయాలను చూస్తుంటే కాకలు తీరిన రాజకీయ పండితులకు కూడా బుర్ర తిరిగిపోతోంది. హిచ్‌కాక్ సినిమాల్లో ట్విస్టులనైనా ముందుగా ఊహించగలం కానీ, తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఎప్పుడు, ఏమి, ఎందుకు, ఎలా జరుగుతోందో తమ ఊహకు అందడం లేదని సదరు పండితులు బుర్రలు గోక్కుంటూ చెబుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో కూడా తెలుగుదేశాధినేత తీసుకున్న నిర్ణయం రాజకీయ పరిశీలకుల దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది.
ఎమ్మెల్యే కోటాలో తెలుగుదేశం పార్టీ మూడు ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకునే అవకాశం వుండటంతో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎంతోమంది సీనియర్లు ఎమ్మెల్సీ పదవి రేసులో నిలిచారు. మొన్నామధ్య జరిగిన సాధారణ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినవారికి ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఛాన్స్ లేదని చంద్రబాబు స్పష్టంగా ప్రకటించడంతో అప్పుడు ఓడిపోయిన చాలామంది నిరుత్సాహపడి రేసులోంచి విరమించుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు సముచిత నిర్ణయం తీసుకుని సమర్థులకే ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇస్తారని భావించారు. అయితే చంద్రబాబు నాయుడు అందరికీ షాకిస్తూ మూడు పేర్లు ప్రకటించారు. వారిలో కోస్తా నుంచి వి.వి.వి.చౌదరి, ఉత్తరాంధ్ర నుంచి గుమ్మడి సంధ్యారాణి, రాయలసీమ నుంచి తిప్పేస్వామి వున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన బీదా రవిచంద్రకు ఎమ్మెల్సీ టిక్కెట్ తప్పకుండా వస్తుందని అందరూ అనుకుంటున్న సమయంలో ఆయనని పక్కనపెట్టి తిప్పేస్వామిని తెరమీదకు తెచ్చారు. వీరిలో వి.వి.వి.చౌదరి విషయంలో ఎలాంటి అభ్యంతరాలు వినిపించడం లేదుగానీ, సంధ్యారాణి, తిప్పేస్వామిల ఎంపిక మాత్రం పార్టీలో కలకలం రేపింది.
చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను పార్టీ కార్యకర్తలు ‘ఒప్పు... తప్పు... బూతు’’ అని అభివర్ణిస్తున్నారు. ప్రతిక్షణం పార్టీ పనిలోనే వుంటూ, నిరంతరం పార్టీ కార్యాలయంలోనే వుండే వి.వి.వి.చౌదరికి టిక్కెట్ ఇవ్వడం ‘ఒప్పు’ అని అంటున్నారు. అలాగే మొన్నటి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినవారికి టిక్కెట్ ఇవ్వనని చెప్పిన చంద్రబాబే ఇప్పుడు అరకు ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన సంధ్యారాణిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం ‘తప్పు’ నిర్ణయంగా చెబుతున్నారు. ఇక తిప్పేస్వామి ఎంపిక నిర్ణయాన్ని ‘బూతు’ అని అభివర్ణిస్తున్నారు. పార్టీ కోసం దశాబ్దాలుగా సేవ చేసిన వారిని పక్కనపెట్టి నిన్నగాక మొన్న కాంగ్రెస్‌లోకి వచ్చిన తిప్పేస్వామికి ఎమ్మెల్సీ రావడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడి తీరు అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో వడ్డించిన చందంగా వుందని చెవులు కొరుక్కుంటున్నారు. సంధ్యారాణి, తిప్పేస్వామిలకు ఎమ్మెల్సీ స్థానాలు దక్కడం వెనుక చక్రం తిప్పిన ‘ఎమ్మెల్సీ మంత్రి’ గారి మీద టీడీపీ కార్యకర్తలు గుర్రుగా వున్నారు.


.jpg)
.jpg)


