కేసీఆర్ కు ఏపీ మంత్రి కౌంటర్.. ఏమన్నారంటే.. ?

తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జల వివాదం ముదురుతోంది. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు నుంచి అక్రమంగా నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా కొత్త ఎత్తిపోథలు కడుతుందని తెలంగాణ సర్కార్ ఆరోపిస్తోంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారనే ప్రచారం జరిగింది. జగన్ .. ఆయన తండ్రి వైఎస్సార్ కంటే మోనార్క్ లా వ్యవహరిస్తున్నారని, చట్టాలను కూడా గౌరవించడం లేదని కేసీఆర్ ఫైరయ్యారట. జగన్ తీరుతో ఏపీకే నష్టం జరుగుతుందని కూడా చెప్పారుట. ఏపీ ప్రాజెక్టులు ఆగకపోతే.. ఎగువన కృష్ణా నదిపై కొత్త బ్యారేజీలు కడతామని కూడా తెలంగాణ కేబినెట్ హెచ్చరించింది.

తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో ఏపీ సీఎంతో ఆయనకు గ్యాప్ పెరిగిందనే చర్చ జరుగుతోంది. అయితే తాజాగా తెలంగాణ కేబినెట్ ప్రకటనకు కౌంటరిచ్చారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఏపీ ప్రాజెక్ట్‌లపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదని  అన్నారు. కేంద్ర జల సంఘం కేటాయింపులకు లోబడే ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్ట్‌ల నిర్మాణం జరుగుతోందని మంత్రి అనిల్ వివరణ ఇచ్చారు.  పోతిరెడ్డి పాడు నుంచి నీళ్లను తరలిస్తే తప్పేంటని నిలదీశారు. శ్రీశైలంలో  840 అడుగులకు లెవెల్ పడిపోతే ఏపీ చుక్కనీరు తీసుకునే అవకాశం లేదన్నారు. 

తాము ఎక్కడా కేటాయింపులు మించి వెళ్లడం లేదని చెప్పారు అనిల్ కుమార్ యాదవ్. తెలంగాణలోనే అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కల్వకుర్తి, నెట్టెంపాడు సామర్థ్యం పెంచుకున్నారని మంత్రి మండిపడ్డారు.రాజోలిబండ ప్రాజెక్ట్‌కి 4 టీఎంసీల కేటాయింపు ఉందన్న అనిల్ కుమార్..  ఏపీ ప్రయోజనాలు కాపాడటంలో సీఎం జగన్‌ ముందుంటారని తెలిపారు.  వంశధార ట్రిబ్యునల్ నుంచి నేరడి ప్రాజెక్ట్ కట్టేందుకు అనుమతి ఇచ్చింది. త్వరలో ప్రారంభిస్తామన్నారు.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రెండు రాష్ట్రాలు కలిసుండాలి అని కోరుకున్నారని మంత్అరి అనిల్భి చెప్పారు.  ఒక అడుగు ముందుకు వేసి స్నేహ హస్తం అందించే గొప్ప మనిషి తమ ముఖ్యమత్రి అని అన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టులు సృష్టించబడ్డాయని.. వాటి కెపాసిటీ పెంచుకునేందుకు మాత్రమే తాము ప్రయత్నం చేస్తున్నామని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు.