సీఎం జగన్ క్రైస్తవుడని ఎలా చెపుతారు.. హైకోర్టు సూటి ప్రశ్న

ఏపీ సీఎం జగన్ మతం విషయంలో వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఒక షాకింగ్ ప్రశ్న వేసింది. సీఎం జగన్ క్రైస్తవుడని చెప్పేందుకు ఆధారాలు ఉంటే కోర్టు ముందుంచాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఒక కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ ను ఆదేశించారు. 

 

తిరుమల శ్రీవారి ఆలయంలోకి అన్యమతస్తులు వెళ్లేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని, కానీ అన్యమతస్థుడైన ఏపీ సీఎం వైఎస్ జగన్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని పిటిషనర్ చేసిన వాదనతో ఏపీ హైకోర్టు విభేదించింది. అంతేకాకుండా ఎటువంటి ఆధారాలూ లేకుండా ముఖ్యమంత్రి హిందువు కాడని, క్రిస్టియన్ అని కోర్టు ముందు ఎలా వాదిస్తారని న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తూ.. సీఎం మతానికి సంబంధించి తగిన ఆధారాలు ఉంటేనే తదుపరి విచారణ కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. ఇక ఈ కేసులో గవర్నర్ ను ప్రతివాదిగా చేర్చడంపై కూడా తీవ్ర అభ్యంతరం తెలిపిన న్యాయమూర్తి ఆయన్ను జాబితా నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులిచ్చారు. 

 

కొద్ది రోజుల క్రితం తిరుమల వెళ్లిన సీఎం జగన్ శ్రీవారి దర్శనానికి ముందు డిక్లరేషన్ ఇవ్వలేదని, ఇది దేవాదాయ చట్టానికి విరద్ధమని అంటూ గుంటూరు జిల్లా వైకుంఠాపురానికి చెందిన సుధాకర్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని పై తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.