ఆర్డినెన్స్ సాయంతో నిమ్మగడ్డ రమేష్ పై వేటు.. గవర్నర్ ఆమోదంతో జీవో జారీ..

ఓవైపు ఏపీలో కరోనా వైరస్ కల్లోలం ఆగనే లేదు అంతలోనే ఏపీలో రాజకీయ నిర్ణయాలకు జగన్ ప్రభుత్వం తెరలేపేసింది. స్ధానిక ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పిస్తూ ప్రభుత్వం ఇవాళ ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి గవర్నర్ ఆమోద ముద్ర కూడా పడటంతో వెంటనే న్యాయశాఖ జీవో కూడా జారీ చేసేసింది. దీంతో కరోనా వైరస్ లాక్ డౌన్ లోనే నిమ్మగడ్డ రమేష్‌ పదవి కోల్పోయినట్లయింది. 

ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలు ఏ క్షణాన వాయిదా పడ్డాయో కానీ అప్పటి నుంచి జగన్ సర్కార్ టార్గెట్ లోకి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేరిపోయారు. అప్పటి వరకూ నిమ్మగడ్డ విధుల్లో కానీ, ఎన్నికల కమిషన్ గురించి కానీ పెద్దగా పట్టించుకోని జగన్ ప్రభుత్వం.. ఆ తర్వాత మాత్రం ఒక్కసారిగా ఆయనపై విరుచుకు పడటం మొదలుపెట్టింది. అదీ ఏకంగా కులం పేరుతో ఆయన్ను దూషించే వరకూ ముఖ్యమంత్రే వెళ్లిపోయారంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. అయితే ఎన్నికల వాయిదా విషయంలో నిమ్మగడ్డ నుంచి ఇలాంటి నిర్ణయాన్ని ఊహించని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా స్టే లభించకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది.

కరోనా వైరస్ కారణంగా ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఏమీ చేయలేమనే నిర్ణయానికి వచ్చేసిన తర్వాత ప్రభుత్వం ఇక దీనికి కారణమైన ఎన్నికల కమిషనర్  నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించే మార్గాలపై దృష్టిపెట్టింది. 

రాజ్యాంగ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు అంత సులువు కాదని తేలిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై జగన్ సర్కారు ఇన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది. అయితే చివరికి సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకుండానే నిమ్మగడ్డ
రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడంతో పాటు దానికి గవర్నర్ ఆమోదం పొంది జీవో కూడా ఇచ్చేసినట్లయింది. 
వాస్తవానికి ఎస్ఈసీ తొలగింపుకు పార్లమెంటు అభిశంసనతో పాటు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. కానీ అది సాధ్యం కాదని తేలిపోవడంతో కమిషన్ లో సభ్యుల సంఖ్య పెంపు సహా పలు మార్గాలపై ప్రభుత్వం కసరత్తు చేసింది. 

మరోవైపు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు నేపథ్యంలో ఆయన స్ధానంలో హైకోర్టు న్యాయమూర్తి స్ధాయి వ్యక్తిని నియమించాలని, అదీ మూడేళ్ల పదవీకాలంతోనే అనే నిబంధనలను తీసుకొచ్చేలా రాష్ట్రపతిని కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతిని కోరుతూ ఓ లేఖ రాయాలని ప్రభుత్వం నిర్ణయించింది.