సీఎం జగన్ కు గవర్నర్ ఝలక్! వైసీపీలో బెయిల్ టెన్షన్.. 

ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో జగన్ సర్కార్ కు గవర్నర్ ఝలక్ ఇచ్చారని తెలుస్తోంది. మూడు రోజుల క్రితమే గవర్నర్ కు ప్రతిపాదిత పేర్లను ప్రభుత్వం పంపినా.. గవర్నర్ ఆమోదించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం పంపిన పేర్లపై గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారని తెలుస్తోంది. జాబితాలోని నలుగురిలో ఇద్దరి పేర్లపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ ను కలవబోతున్నారు.  

ఏపీలో నామినేటెడ్‌ కోటాలో గవర్నర్‌ నియమించే 4 ఎమ్మెల్సీ స్థానాలుఖాళీ అయ్యాయి. వీటి భర్తీకి  లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్‌ రాజు, రమేశ్‌ యాదవ్‌ పేర్లను గవర్నర్‌కు పంపింది జగన్ సర్కార్. సాధారణంగా ప్రభుత్వం నుంచివచ్చిన ఫైళ్లను వెంటనే ఆమోదించి పంపిస్తారు గవర్నర్. కానీ ఎమ్మెల్సీల నియామకం ఫైలు వెళ్లి 4రోజులైనా ఇంతవరకూ ఆమోదం పొందలేదు. ఇందులో లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులుపై క్రిమినల్‌ కేసులు న్నట్లు గవర్నర్‌కు ఫిర్యాదులు అందాయని... అందుకే ఆ పేర్లపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారని రాజ్ భవన్ వర్గాల సమాచారం.

తోట త్రిమూర్తులుపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదై ఉంది. అప్పిరెడ్డిపై పలు క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అంటున్నారు. తన కోటా కింద జరుగుతున్న నియామకాలు కావడంతో గవర్నర్‌ వీరి పేర్లను క్షుణ్ణంగా పరిశీలించారని.. నామినేటెడ్‌ కోటాలో నియమితమయ్యేవారు వివాదరహితులై ఉండాలని, నేర చరితులై ఉండకూడదని ఆయన ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.దీంతో స్వయంగా సీఎం జగనే గవర్నర్ ను కలిసి వివరణ ఇవ్వబోతున్నారని చెబుతున్నారు. ఆయన గవర్నర్‌కు నచ్చజెప్పి ఆమోదం పొందగలుగుతారా లేక ఆ రెండుపేర్లు తప్పించి వేరే పేర్లు ఇస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఇది ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇది మర్యాదపూర్వక భేటీయేనని  అంటున్నాయి. తన ఢిల్లీ పర్యటన వివరాలను గవర్నర్‌కు తెలియజేయడానికే ఆయన రాజ్‌భవన్‌కు వెళ్తున్నారని చెబుతున్నాయి.

ఇటీవలే సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులను కలిశారు. అయినా ఎమ్మెల్సీ సీట్ల భర్తీలో గవర్నర్ కొర్రిలు వేయడం చర్చగా మారింది. కేంద్రం డైరెక్షన్ లోనే గవర్నర్ ఇలా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఢిల్లీ పర్యటన సాఫీగా సాగిందని వైసీపీ నేతలు చెబుతుండగా.. సీఎం జగన్ కు అమిత్ షా క్లాస్ పీకారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ వైఖరి కీలకంగా మారింది. మరోవైపు జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ రాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. తాజా పరిణామాలతో సీబీఐ కోర్టులో ఏం జరుగుతుందున్నది ఆసక్తిగా మారగా... వైసీపీ నేతల్లో మాత్రం టెన్షన్ పెంచుతుందని తెలుస్తోంది.