మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత 

సీనియర్ రాజకీయ వేత్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. ఉదయం బీపీ ఒక్కసారిగా తగ్గిపోవడంతో కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని స్టార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. రోశయ్య వయసు 89 సంవత్సరాలు. 

4 జులై 1933న గుంటూరు జిల్లా వేమూరులో రోశయ్య జన్మించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన రోశయ్య దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితంగా ఉండేవారు. ఆయన మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేకపోయారు. ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు గవర్నర్‌గానూ సేవలందించారు.

గుంటూరు హిందూ కళాశాలలో రోశయ్య విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా రోశయ్య సేవలందించారు. 1968, 74, 80లలో శాసనమండలి సభ్యునిగా ఆయన ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్లు రహదారులశాఖ, రవాణాశాఖా మంత్రిగా పనిచేశారు. 2004లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రోశయ్య విజయం సాధించారు. ఉమ్మడి ఏపీలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రోశయ్య రికార్డు క్రియేట్ చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత అంటే 3 సెప్టెంబర్ 2009-25 జూన్ 2011 వరకూ ఉమ్మడి ఏపీ సీఎంగా రోశయ్య బాధ్యతలు చేపట్టారు. ఆగస్ట్ 2011 నుంచి ఆగస్ట్ 2016 వరకూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్‌గా రోశయ్య పనిచేశారు